Oct 09,2022 10:49

ఓ కాలం కసిని ఎగదోసింది
అవివేకపు పొయ్యిలో
అజ్ఞానపు కర్రలను పేర్చి
వికృతిని ప్రకృతిగా
మార్చే ప్రక్రియకు పూనింది
నిలువునా సుడులు తిరుగుతూ
ఉబికి వస్తాయి వాసనలు
దేహపు మురికి కుండలోంచి
నిప్పున్నప్పుడే ఊపిరిని
శుభ్రం చేసుకోవాలె
చూపును వాక్కును సానబెట్టాలి
కాసిన్ని వెలుగు ముక్కలు ఏరుకోవాలి
ఆపతి కారుమబ్బై ఉరుముతూ
గోస పిడుగొచ్చి మీద పడకముందే
ఓ వెచ్చని గుడిసె కట్టుకోవాలి
ఉదయపు మొగులును చూడడానికి
తూర్పుకు హృదయాన్ని చాపి
ఉన్ముక్త కూనిరాగం తీస్తూ
సరికొత్త శ్వాస పీల్చుకోవాలి
పచ్చిక నుంచి మొక్క నుంచి
పిచ్చుక నుంచి నేర్చుకోవాలి
గిజిగాడి అల్లిక మెళుకువలను
దుర్బుద్ధిని నిర్వీర్యం గావించే
పసిరికను కనుక్కోవాలి
నాలుగు చేతులు ఎలా కలపాలో
రెండడుగులు ఎటేయాలో
అభ్యాసం చేయాలి
ఎల్లకాలం ఏడుపుతోకాక
కొన్ని విరబూసే నవ్వులను
ఎద లోతుల్లో తొయ్యాలె
జీవ నాడుల్లో
మట్టి గింజలను నాటాలె
కన్నీళ్లను పారబెట్టి
ఆనందాలను మొలకెత్తనియ్యాలె
తరతరాలుగా బతుకును
వెతుకులాటలో ప్రశ్నార్థకం
గావించిన ఆ భయం
సంకెళ్లను ఎట్టకేలకు
బద్దలుగొట్టి బహిరంగంగా
ఓ పాట పాడదాం రండి
ఓ విముక్తి గీతం రాద్దాం రండి!

- రఘు వగ్గు
96032 45215