Sep 28,2023 13:09
  • కాకినాడ డీఎస్పీ తీరుపై ఖండన
  • న్యాయ పోరాటానికి సిద్ధం 

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు సాగిస్తున్న ప్రజా సంఘాలు, వామపక్షాలపై అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్న పోలీసుల తీరు సరిగా లేదని పలువురు వామపక్షాల నేతలు మండిపడ్డారు. విద్యుత్తు చార్జీల పెంపుకు నిరసనగా బుధవారం కాకినాడలో వామపక్షాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణ రెడ్డి సిపిఎం, ఇతర వామపక్షాల నాయకులపై విరుచుకుపడ్డారు. దురుసుగా ప్రవర్తించి బూతులు దండకం మొదలుపెట్టారు.కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళి జీపులోకి ఎక్కించారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో డిఎస్పి తన తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా విలేకరుల సమావేశంలో తప్పుడు కథను ప్రచారం చేస్తున్నారు. దీంతో గురువారం స్థానిక సుందరయ్య భవన్లో వామపక్షాల నేతలు కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కాకినాడ జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ విద్యుత్తు చార్జీలకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాకు పోలీసులు అనుమతి ముందే తీసుకున్నామన్నారు. అందుకు సంబంధించిన అనుమతి పత్రాన్ని విలేకరుల ముందు ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన చేపట్టి వెళతామని పోలీసులకు చెప్పామన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే డీఎస్పీ మురళీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలు, రోప్, బారికేట్లను సిద్ధం చేసి అడ్డంగా పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. అంతేకాకుండా మహిళలు అని కూడా చూడకుండా ఇష్టారీతిన వ్యవహరించి, వామపక్షాల నేతలను కాలర్ పట్టుకుని ఈడ్చికెల్లడం శోచనీయమన్నారు. పోలీసుల తీరును ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. సిపిఎం కాకినాడ రూరల్ మండల నాయకులు నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం 15 ఏళ్ల పాటు జవాన్ గా పనిచేసే వచ్చిన తాను ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితుణ్ని అయి సిపిఎం తరపున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానన్నారు.అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలో డిఎస్పి తనపై ప్రదర్శించిన తీరు అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉందన్నారు. ఇటువంటి నిర్బంధాలను ఏనాడు చూడలేదన్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తే పరుష పదజాలంతో దుర్భాషలాడుతూ, మోకాలితో తన్నుతూ, కాలర్ పట్టుకుని తీసుకుని వెళ్లడం ఎంతవరకు సమంజసమన్నారు. మహిళా సిబ్బంది లేకుండానే  పురుష పోలీసులే మహిళలపై విచక్షణారహితంగా తోచుకుంటూ వెళ్లడం సరైన విధానం కాదన్నారు. జరిగిన సంఘటనపై తన తప్పు ఏమీ లేదన్నట్లుగా డిఎస్పి ప్రెస్ మీట్ పెట్టి కట్టు కదా అల్లడంపై మండిపడ్డారు. సంబంధిత అధికారిపై జిల్లా ఎస్పీ, డీజీపీలకు ఫిర్యాదు చేయడంతో పాటు సివిల్ కేసు వేసి న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు జే.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలపై ఎంతకాలం అణచివేత ధోరణలు ప్రదర్శిస్తారో చూస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను అడిగితే అక్రమంగా అరెస్టులు చేయిస్తుందన్నారు. పోలీసులను ఉపయోగించి దాడులు చేయిస్తుండడం సరికాదన్నారు. మహిళలను అని కూడా చూడకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. డిఎస్పి  బూతులు సరికాదన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అండతో డిఎస్పి ఇక్కడ ఇంకా కొనసాగుతున్నారు.పోలీసుల తీరుపై ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు రాజ్యం ఏలుతుందన్నారు. కాకినాడలో స్థానిక ఎమ్మెల్యే అండదండలు చూసుకుని పోలీసులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. వామపక్షాలు, ప్రజాసంఘాల ఉద్యమాలపై ఉక్కు పాదం మోపాలని చూస్తే మరిన్ని ఉద్యమాలు పుడతాయని హెచ్చరించారు. తక్షణమే డీఎస్పీను ఇక్కడ నుంచి బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కే.బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, న్యూడెమోక్రసీ నాయకులు వి. చిట్టిబాబు తదితరులు మాట్లాడారు. సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేష బాబ్జి,పి.వీరబాబు తదితరులు పాల్గొన్నారు.