ప్రజాశక్త-ఆదోని : పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఉన్న శ్మశాన వాటికకు అదనంగా రెండెకరాల భూమి కేటాయించాలని 41వ వార్డు కౌన్సిలర్ బి ఇందు కోరారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డికి మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మశాన వాటిక స్థలం కొరత ఉందన్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. హనుమన్ నగర్, కిలిచిన పేట ,వాల్మీకి నగర్, బోయగిరి, శుక్రవారం పేట ప్రాంతాలవాసులు ఈ స్మశానవాటికలోనే ఖననం చేయడం జరుగుతుందన్నారు. ఈ స్మశాన వాటికలో సుమారు 30 వేల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో శవాలను పూడ్చిన చోటే పూడ్చాల్సిన పరిస్థితి ఉందన్నారు. స్థలం కొరత వేధిస్తోందన్నారు. ఉన్న స్మశాన వాటికలో కూడా ముళ్ళ కంపలు పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. పరిసరాలను పరిశుభ్రం చేసి మొక్కలు పెంచి అహల్లదకరమైన వాతావరణము ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. వాటికలో నీటి సౌకర్యం రహదారి ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. శ్మశానం వద్ద వ్యక్తిని నియమించి ఖననం కాగానే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలను నమోదు చేసి రశీదు వచ్చే ఏర్పాటు చేయాలన్నారు. త్వరలోనే సమస్యను ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు ఆమెతోపాటు కౌన్సిలర్ లు ఫయాజ్ అహ్మద్ ,మహేశ్వరి ఉన్నారు.










