Jun 11,2022 06:52

తలనొప్పి బామ్‌ వ్యాపార ప్రకటనలకు ఎలాగైతే పది తలల రావణుడు ఉపయోగపడతాడో రాజకీయాలకు కూడా అంతే ఉపయోగపడుతున్నాడు. ఇంతకీ ఈ రావణుడు శ్రీలంక లోనే ఉంటాడా లేక మొహంలో ఎటువంటి భావమూ కనపడకుండా గాజు కళ్ళ వెనుక దాగున్న నాయకులవలే హస్తినలో ఉంటాడా? ఇంతకీ ఒక రావణుడి పాత్ర కొంతమంది కలిసి నిర్వహిస్తున్నారా? రావణుడి నివాసం ఇప్పుడు లంక కాదు. ఎక్కడ కుల మతాలతో ప్రజల మధ్య నిప్పు రాజేస్తుంటారో అక్కడంతా లంక ఉండనే ఉంటుంది. లంక భౌగోళికంగా ఎక్కడైనా ఉండవచ్చు. అలాగే దశకంఠులు కూడా ఎక్కడైనా ఎలాంటి రూపంలోనైనా ఉండవచ్చు.

మూడు దశాబ్దాల పైబడిన సంగతి. మెగాస్టార్‌ చిరంజీవి తరువాతి సినిమా ఏమిటి అని అందరూ ఎదురు చూస్తున్నారు. సడెన్‌గా ఒకరోజు ప్రకటించేశారు. సినిమా పేరు లంకేశ్వరుడు అని, దాసరి నారాయణరావు దర్శకుడని, ఇక యువతను ఉర్రూతలూగిస్తున్న రాజ్‌ కోటి ద్వయం సంగీతమని. ఇక ఆ పాటలకు స్టెప్పులెలా ఉంటాయో అన్న తాపత్రయం మొదలయ్యింది. చాలామందికి అన్నీ నచ్చినాయి కాని సినిమా పేరే అంతగా నచ్చలే. ఎందుకూ అంటే పేరు లంకేశ్వరుడు. అంటే రావణుడు. ఈ పేరు మా మెగాస్టారుకు చెడ్డపేరు తెస్తుందేమో అనుకున్నారు. ఆల్రెడీ రాక్షసుడు అని తీశారుగా అని అభిమానుల్లో ఎగస్పార్టీ వాళ్ళు అనేసి ఉండొచ్చు కూడా. రావణుడంటేనే పది తలలు ఉండి భయంకరంగా ఉంటాడని, సీతను ఎత్తుకుపోయాడని బాగా చెడ్డ పేరున్న పేరు. అందులోనూ తెలుగులో పౌరాణిక సినిమాలెన్నో వచ్చాయి. వాటిల్లో రావణాసురుడుగా ఎస్‌.వి రంగారావు, ఎన్‌.టి.ఆర్‌, సత్యనారాయణ ఇలా ఎందరో వేశారు. ఒక్క అన్న రామారావు మాత్రం రావణుడు మంచోడే కదా అన్న రీతిలో నటించాడు. తను రావణుడైతే రాముడు కూడా వచ్చి నమస్కారం పెట్టవలసిందే. ఇక మిగతావారందరూ రావణుడిని ఫక్తు విలన్‌గానే చూపించారు. అంతెందుకు హిందీలో రామాయణం సీరియల్‌ తీస్తే ఎస్‌.వి.రంగారావులా కనపడే అరవింద్‌ త్రివేది అనే గుజరాత్‌ నటుడిని ఎంపిక చేశారు. మన నటులే కాదు... రావణుడు కూడా అంత ఫేమస్‌ తెలుగు వాళ్ళకు. తరువాత శ్రీకృష్ణ సీరియల్‌లో కూడా కంసుడి పాత్రకు ఎస్వీయార్‌లా ఉండే గోగా కపూర్‌ అనే ఆయన్ను తీసుకున్నారు.
       ఇంత అకస్మాత్తుగా లంకేశ్వరడు, రావణుడు ఎందుకు గుర్తొచ్చారని కొందరు అనుకోవచ్చు. అసలు నేటి స్లోగన్‌ రాముడి గురించే ఉండాలి కదా నీవు రావణుడి మీద రాస్తావా అని నాకు ఫోన్‌ కాల్స్‌ కూడా రావచ్చు. అయితే అసలు కారణం ఈ మధ్య మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని కొందరూ, దేశం రావణ లంకలా అయిపోతుందని కొందరు అంటూ ఉన్నారు. ఆ దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. పేదవాళ్ళే కాదు... ఓ మాదిరి ఉన్నవాళ్ళు కూడా సరిగా బతకలేని స్థితి. అక్కడ ద్రవ్యోల్బణం పెరిగి దేశం తలకిందులైపోయింది. ప్రజల బాగుకంటే పాలకులకు తమ రాజకీయాలు, అధికార దాహం ఎక్కువైపోయాయి. అందుకే ప్రజల కడుపు మండింది. ఇంతకీ రావణాసురుడి నిర్వచనం ఏమిటి? లంకాదీశుడా? ఇతరుల భార్యను ఎత్తుకొచ్చిన దుర్మార్గుడా? పది తలల రాక్షసుడా? తరువాత వచ్చిన కీచకునితో కలిపి పోల్చబడుతున్న దుర్మార్గుడా? మనకు కావలసిన దాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే లంకను కూడా మనకవసరమైన విధంగా తీసుకోవచ్చు.
       ఒక పక్క శ్రీలంకను కొందరు తీసిపడేస్తుంటే అదే శ్రీలంక కొందరి అఖండ భారత్‌లో భాగంగా ఉంది. అంటే విడిగా ఉంటే ఒక నీతి. మనలో భాగంగా చెబితే ఒక రీతి. ఇది నవ్య సమాజంలో జరుగు తున్న పాత ప్రక్రియ. రాజకీయాలే వ్యాపార మైన నయా ప్రపంచీకరణ రోజులు. తలనొప్పి బామ్‌ వ్యాపార ప్రకటనలకు ఎలాగైతే పది తలల రావణుడు ఉపయోగ పడతాడో రాజకీయా లకు కూడా అంతే ఉపయోగ పడుతున్నాడు. ఇంతకీ ఈ రావణుడు శ్రీలంక లోనే ఉంటాడా లేక మొహంలో ఎటువంటి భావమూ కనపడకుండా గాజు కళ్ళ వెనుక దాగున్న నాయకులవలే హస్తినలో ఉంటాడా? ఇంతకీ ఒక రావణుడి పాత్ర కొంతమంది కలిసి నిర్వహిస్తున్నారా? రావణుడి నివాసం ఇప్పుడు లంక కాదు. ఎక్కడ కుల మతాలతో ప్రజల మధ్య నిప్పు రాజేస్తుంటారో అక్కడంతా లంక ఉండనే ఉంటుంది. లంక భౌగోళికంగా ఎక్కడైనా ఉండవచ్చు. అలాగే దశకంఠులు కూడా ఎక్కడైనా ఎలాంటి రూపంలోనైనా ఉండవచ్చు. ఇక రావణ కాష్టం అన్న మాట కూడా వినే ఉంటారు. పైన చెప్పుకున్నట్టు ఎక్కడో ఒక చోట ఆ కాష్టం రగుల్తూనే ఉంటు ంది. పాలస్తీనా పౌరులు తమ దేశంలోనే శరణా ర్థుల జీవితం గడుపుతున్నారు. ఆ వార్తలు రాసే విలేకరులను చంపుతూనే ఉన్నారు. రాష్ట్రాలు మారినా, దేశాలు మారినా, ప్రాంతాలు మారినా ఈ రావణ కాష్టపు ఉద్దేశ్యాలు మాత్రం మారడం లేదు. అవి రగిలించే వారి గురించిన విషయాలను, జీవిత చరిత్రలను స్వాతంత్య్ర పోరాట వీరుల గురించినవి తీసేసి మరీ పాఠ్య పుస్తకాల్లో పెడుతున్నారు. ఇది ఒకచోట జరిగేదని మనం అనుకోకూడదు. మొత్తానికి పాకిపోయే లక్షణం. ఏమన్నా అంటే అన్నవారు దేశభక్తుల లిస్టులో నుండి రాజద్రోహుల లిస్టు లోకి పోతారు. ఈ రాజద్రోహులు అన్న విషయం చూస్తున్నారే కాని ప్రజాద్రోహులు ఎవరు అన్న మాట జనాలు పట్టించుకోవడం లేదు. రాజును ఆకాశానికి ఎత్తేస్తున్నారు కాని ప్రజలు పాతాళం లోకి పోతున్నా వీళ్ళకు పట్టడం లేదు. ప్రజా ద్రోహులే నిజమైన రాజద్రోహులు అన్న విషయం మనం గమనించాలి. అది ప్రజలకు తెలియజేయాలి కూడా.
        పేరుకు వాళ్ళు విలన్లు కాని...ఐ.ఎం.ఎఫ్‌, ప్రపంచ బ్యాంకు మొదలైన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని... అవి చెప్పినట్టల్లా ఆడేవాళ్ల కంటే వాళ్ళే నయం. నిజానికి ప్రజల నోళ్ళు కొట్టే వాళ్ళే అసలైన విలన్లు. వంట నూనెలు లీటరుకు రెండు వందలు, నిత్యావసరాలు, కూరగాయల ధరలు పైపైకి పోతుంటే, పెట్రోలు డీజిలు నూట ఇరవై తాకుతుంటే ఆ లంకేశ్వరుడు కాని, దుర్యోధనుడు కాని చూస్తూ ఊరుకునే వాళ్ళు కాదు. చేతులు కట్టుకొని తలాడించే వాళ్ళు కాదు. ఏదో రాజకీయ కారణాలను చూపి వాళ్ళు ప్రజలని ఎప్పుడూ మోసం చేయలేదు. దేవుడి పేరు చెప్పి కూడా వాళ్ళు ఎటువంటి అన్యాయాలూ చేయలేదు.
      తమ మిత్రుల కోసం దేశాన్ని తాకట్టుపెట్టే వాళ్ళే అసలైన లంకేశ్వరులు, దశకంఠులు, దుర్యోధనులు. దేశంలో కేవలం ఇద్దరి ముగ్గురి బొక్కసాలు నింపి ప్రపంచ కుబేరుల్లో చేరుస్తున్న వైనం ఒకపక్క, తిండి లేక ఆకలి చావుల పాలౌతున్నవాళ్ళు ఇంకోపక్క ఎక్కువౌతున్న నేటి పరిస్థితుల్లో మానవుల ముఖం పెట్టుకొని రాక్షస ప్రవృత్తి చూపేవాళ్ళే అసలైన విలన్లు. ఆ విలన్లు కూడా తమతో వీళ్ళను పోలిస్తే తల వంచుకునే పరిస్థితి. లంకేశ్వరులుగానే కాదు లంచేశ్వరులు, బొక్కేశ్వరులుగా మారిన పాలకుల పని ఎలా పట్టాలో లంక వాసులు చూపించారు. ఇతర దేశాల ప్రజలూ చూపిస్తారు.
                                          - జంధ్యాల రఘుబాబు   సెల్‌:9849753298