ప్రజాశక్తి-ఆదోని : ఆంధ్ర రాష్ట్ర దళితోద్దారకుడు, ఆదర్శ రాజకీయ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని మే 19న ఊరూరా నిర్వహిద్దామని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, మండల కార్యదర్శి బి తిక్కప్ప పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో మండల అధ్యక్షులు మునిస్వామి అధ్యక్షతన జరిగిన మండల స్థాయి కెవిపిఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, అంటరానితనం నేటికి కొనసాగుతున్నదని, ఆదోని డివిజన్ ప్రాంతంలో అది మరింత ఎక్కువగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల పట్ల కొనసాగుతున్న ఈ అసమాన వ్యవస్థకు వ్యతిరేకంగా పని చేసిన పూలే, అంబేద్కర్, సుందరయ్య, పెరియార్ల స్ఫూర్తితో ఏర్పడ్డ కెవిపిఎస్ వారి ఆశయాలకు పునరంకితమై పని చేస్తోందన్నారు. దళిత వాడల సమస్యలపై 19న పోరును కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ మండల ఉపాధ్యక్షులు పరమేష్, నాయకులు వీరేష్, లాజర్, బంగారి, నగురూరు సిద్దప్ప, ఉలిగేష్, ఎల్లప్ప, జీవరత్న, నాగేంద్ర, వీరాస్వామి, ఏలీయా పాల్గొన్నారు.










