Apr 19,2023 15:24

ప్రజాశక్తి - తాళ్లరేవు : ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన కుడుపూడి శివన్నారాయణ ఈ నెల 23వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శివన్నారాయణ తాళ్ళరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ పత్తిగొందిలో ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆశీస్సులతో ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తనను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి, సహకరించిన నియోజకవర్గ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 23వ తేదీ ఆదివారం మహిపాల్ చెరువు సెంటర్లోని గ్రాండ్ పార్క్ కళ్యాణ మండపంలో ఉదయం 11 గంటలకు కమిటీ డైరెక్టర్ లతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు. ముందుగా తన నివాసం వద్ద 9 గంటలకు ర్యాలీ ప్రారంభమై పదిన్నర గంటలకు వేదిక వద్దకు చేరుకుంటామన్నారు. అనంతరం  ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర సంస్థల ప్రతినిధులు, ప్రజలు   పాల్గొని విజయవంతం చేయాలని శివన్నారాయణ విజ్ఞప్తి చేశారు.