
'ఖబర్ కె సాత్' కథా సంపుటిలోవి బతుకు కథలు. ఇందులోని ఏ కథను తడిమినా ఇది మా ఊరిదే. మా ఇంటి కథే. నా కథే అనిపించే అనుభవం ఎదురవుతుంది. సమాజంలో మానవతా వికాసానికి, జీవ వైవిధ్యానికి అడ్డుపడే రుగ్మతలన్నింటినీ సూటిగా, సునిశితంగా ప్రశ్నించడమే ఈ కథల్లోని హీరోయిజం. సీమ పల్లెల్లో నడయాడుతూ, కమ్మనైన మట్టి వాసన పీల్చుతూ.. ఆ సంస్కృతి సంగతులను, తీయనైన యాసను ఆస్వాదిస్తూ.. మన కళ్లు ఆ కథానికల వెంబడి ఆతృతగా పరుగులు తీయిస్తాయి. కుల పెత్తందారీ దాష్టీకం కింద నలుగుతున్న మట్టి మనసుల మౌన రోదనలు ఈ కథల్లో మనకు వినిపిస్తాయి. మానవ స్వార్థానికి బలైపోతున్న ప్రకృతి మూగవేదన, జీవరాశుల అరణ్య రోదనలు కళ్ళకు కడతాయి. ఏ కథలోనూ కాల్పనికత కనిపించదు.
ప్రతి సమస్యకూ, సంగతికీ ఒక నిర్దిష్ట ఆధారం, లెక్క, చరిత్రను అందమైన పదాల్లో, భావోద్వేేగపు ప్రవాహంతో రాశారు రచయిత శ్రీనివాసమూర్తి. మనకు తెలీకుండానే మన చేత శాస్త్రీయమైన, విస్తృత వివరాలను చదవింపజేయడం రచయిత చాతుర్యం. దిగువ, మధ్యతరగతి, నిమ్న కులాల ప్రజల బతుకు యాతనలను ఈ కథా సంపుటి ఆవిష్కరించింది. సమస్యలకు మూలాలను వేలెత్తి చూపించింది. ఈ కథలు అటవీ అలుగు తరపున, ఏనుగు తరపున, ప్రతి పిట్ట, చెట్టూ చేమ తరపున, శ్రమజీవి తరపున అన్యాయాన్ని ఎదిరించి.. గట్టిగా మాట్లాడాయి. సీమలో రైతు, సాగునీటి బాధల నుంచి కుల దురహంకార, స్వార్థ రాజకీయాలు, పితృస్వామ్య భావజాలం వరకూ ఏ రుగ్మతనూ రచయిత వదిలి పెట్టలేదు. పగలబడి నవ్వించే హాస్యపు మెరుపులు అద్ది మరీ అభ్యుదయ భావాలను, నిండైన మానవతను కథల్లో అత్యంత పదునుగా, సున్నితంగా పలికించారు రచయిత శ్రీనివాసమూర్తి.
ఆలయాల్లో దేవుణ్ని మోసే ఏనుగుల మూగ వేదన, వాటి భావోద్వేగాలు తెలిసిన ఓ మావటి మనోభావాలే 'కోవెల మావటి' కథలోని ఇతి వృత్తం. నిత్యం పట్టు వస్త్రాలంకారంతో దండాలు అందుకుంటూ మెరిసిపోయే కోవెల ఏనుగులు కడుపుకింత తిండి, నీరు లేక, ఆ భారీకాయం నడిచేందుకు నాలుగడుగుల జాగా సైతం లేక ఎలా అల్లాడుతున్నాయో ఈ కథ కళ్లకు కడుతుంది. బిడ్డల బాధలు తెలిసీ ఏమీ చేయలేని ఓ నిస్సహాయ తండ్రి మాదిరి కోవెల మావటి అల్లాడటం మనకు కనిపిస్తుంది. సీమ పల్లెలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, సజీవ బంధాలు, ఆత్మీయ పిలుపులు హాయి గొలుపుతాయి. 'కోవెల మావటి, అరణ్య రోదన, దొర్లు దొర్లు పుచ్చకారు, స్వాములొచ్చారు' వంటి కథలు ప్రకృతి వినాశనం తుదకు మానవ వినాశనమేనన్న వాస్తవాన్ని ఆవిష్కరించాయి. సరదాగా, ఆసక్తికరంగా సాగే 'దొర్లుదొర్లు పుచ్చకారు' కథలో అలుగు పలికించిన కొన్ని జగత్ వాస్తవాలు ఆలోచింపజేస్తాయి.
'ఖబర్ కె సాత్' కథలు సమకాలీనమైనవి. 'ఏనుగుల దాడిలో రైతుల దుర్మరణం, ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న కోతులు, జొన్నపంటపై రామచిలుకల దాడి, పాముల స్వైర విహారం, ఎలుగుల సంచారంతో జనం బెంబేలు, ఆఖరికి అడివిచీమల బారినపడి ప్రజలు గిలగిల' వంటి వార్తలను మనం నిత్యం వింటున్నాం. పాలకులు సైతం జంతువుల దయాదాక్షిణ్యాలకు మనుషులను, వ్యవసాయాన్ని, రైతును వదిలేసిన పాపాన్ని కళ్లారా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తప్పు ఎవరిది? మూగ జీవాలదా? మానవులదా? పాలకులదా? అనే అంశాలను లోతుగా చర్చించారు రచయిత. అందుకే ఈ జీవ వైవిధ్య కథలు సమకాలీనమైనవి. ప్రతి ఒక్కరూ చదవాల్సినవి.
హాస్య వాక్యంతో 'ఓటు మల్లన్న' కథ మొదలవుతుంది. నేటి స్వార్థ రాజకీయ క్రీడలో ఓ నిరుపేద బక్క ప్రాణి చిక్కుకొని విలవిల్లాడి, వాడిపోయి చివరికి ఎలా ఓడిపోయిందీ కథలో రచయిత కళ్లకు కట్టారు.
'ఇదీ మన పనే' కథ ప్రతి గృహిణి, శ్రామిక మహిళ మనస్సును ఆకట్టుకుంటుంది. నిండా బాధ్యతల బందిఖానాలో నలిగిపోతూ, ఏ పనినీ పంచుకోని భాగస్వామితో బంధాన్ని గుట్టుగా నడుపుకుంటున్న సగటు మహిళ ముఖచిత్రం ఇందులో కనిపిస్తుంది. నిమ్న కులం శ్రమను గౌరవించడం, ఆ పనిలో త్యాగాన్ని, భరించరాని కష్టాన్ని చర్చించడం ఈ కథ ఇతివృత్తం. 'దేవుని మాన్యం, ఏకంగార్రి, అడివోడు' కథల్లోనూ పురుషాధిక్యత, పెత్తందారీ కుల చట్రం స్వభావాన్ని, శ్రమజీవిపై దాని ప్రభావాన్ని తెరలు తెరలుగా చూపించారు రచయిత. చివరిగా అట్టమీది కథ 'ఖబర్ కె సాత్' ప్రతి భారతీయుడూ చదవాల్సిన నిజమైన దేశభక్తి కథ. ఢిల్లీ పాలకుల కుళ్లు
రాజకీయాలను, దౌర్జన్యాలను ఇందులో నిర్మొహమాటంగా చర్చించారు శ్రీనివాసమూర్తి. కాశ్మీరీ కన్నీటి గాథలను కళ్ల ముందుంచారు.
సమస్యలకు, రాజ్యం బెదిరింపులకు, పెత్తనానికి సామాన్యుడు తలొగ్గినట్టే కనిపిస్తాడు. కానీ సమయం వచ్చేసరికి అతడు పదునుగా తిరగబడతాడని 'సేద్యం' కథ తెలియజేసింది. వ్యవస్థ దురావస్థను మార్చే శక్తి ఒక్క విప్లవానికే ఉందని కథ చెప్పకనే చెప్పింది. ప్రజల మేలుకోసం ఉద్యమ జీవితం గడుపుతూ లాఠీ దెబ్బలు తింటున్న ఓ కొడుకు జీవితంపై తండ్రి కలవరపాటు, గౌరవం, తుదకు నేను సైతం నా కొడుకుతోనే అన్న తండ్రి తెగింపు మనకు స్ఫూర్తినిస్తాయి.
- ఖబర్ కె సాత్
- రచయిత : శ్రీనివాసమూర్తి
- వెల : 150/-
- పేజీలు : 215
- కథలు : 15
- ప్రతులకు : 944025303
- ఎల్. శాంతి
76800 86787