
తిరువనంతపురం : గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌పై కేరళ ప్రభుత్వం బుధవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రెండు వారాల్లో ఇది రెండవసారి పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. కోవిడ్ అనంతర ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించే కీలకమైన బిల్లులను ఆమోదించకుండా ప్రజల హక్కులను ఓడించడానికి యత్నిస్తున్నారని ఆరోపించింది. సుమారు ఎనిమిది కీలక బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో కొన్ని రెండేళ్లుగా వాయిదా పడ్డాయి.
గవర్నర్ నిరంకుశ చర్య కేరళ ప్రజల ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని రాష్ట్రం తరపున న్యాయవాది సి.కె. శశి తెలిపారు. బిల్లులను దీర్ఘకాలంగా, నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడంతో గవర్నర్ నిరంకుశ ప్రవర్తన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ని కూడా ఉల్లంఘిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ రూపొందించిన సంక్షేమ ప్రయోజనాలను ప్రజలకు అందకుండా చేయడం ద్వారా ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ప్రకారం కేరళ ప్రజల హక్కులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. గతేడాది నవంబర్ 30న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 461 పేజీల స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు సమర్పించిన బిల్లులను పరిష్కరించేందుకు కాలపరిమితిని నిర్ణయించాలన్న కేరళ ప్రభుత్వ పిటిషన్‌ను కేరళ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 200 ప్రకారం.. బిల్లును ఆమోదించడం లేదా, రాష్ట్ర అసెంబ్లీకి తిప్పి పంపడం, లేదా రాష్ట్రపతికి సిఫారసు చేయాల్సి వుంది. ఏదేమైనప్పటికీ ఈ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.