ప్రపంచం యావత్తూ కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. దానిని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలూ పరిశోధనల్లో, ప్రయోగాల్లో మునిగిపోయి వున్నారు. వివిధ దేశాల్లో, వ్యాక్సిన్లు రూపొందించేందుకు జరుగుతున్న ప్రయోగాలపై ఒక నిర్ధారణకు వచ్చి, ఆ వ్యాక్సిన్ ప్రపంచం మొత్తం మీద 400 నుంచి 500 కోట్ల జనాభాకు అందేలా చేయగలిగినప్పుడే ఈ కరోనాను అరికట్టగలిగే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చేవరకూ ప్రపంచంలోని అన్ని దేశాలూ పరస్పరం దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ, తమ వనరులను అన్నింటినీ కలబోసుకుని ఉమ్మడి యుద్ధం చేపట్టాలి.
పెట్టుబడిదారీ దేశాలలో, ముఖ్యంగా సంపన్న దేశాలలోని ప్రభుత్వాలు ఈ విషయంలో అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో అమెరికాది అగ్రస్థానం. మోడీ ప్రభుత్వానికి ఆ ట్రంప్ ఆదేశాలే ఆదర్శాలు. అందుకే ఈ రెండు దేశాలూ కరోనా కేసుల్లో మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇందుకు భిన్నంగా సోషలిస్టు దేశాలు-ముఖ్యంగా క్యూబా అంతర్జాతీయ స్ఫూర్తితో వ్యవహరిస్తున్న తీరు అత్యంత శ్లాఘనీయం, అనుసరణీయం. తమ దేశంలోని ప్రజలను కరోనా నుండి కాపాడుకోవడమే గాక, ఇతర దేశాలకూ హెన్రీ రీవ్స్ వైద్య బృందాలను పంపి ఆదుకోవడానికి ముందుకొచ్చింది. తనకు బద్ధ శత్రువైన అమెరికాకు సైతం వైద్య బృందాలను పంపడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. కష్ట కాలంలో కమ్యూనిస్టు మానవత అంటే ఏవిధంగా ఉంటుందో మనకు ప్రత్యక్షంగా చూపిస్తోంది క్యూబా. ఈ విధమైన స్పందనను గతంలో ఎబోలా, సార్స్ వైరస్‌లు విజృంభించిన సమయాల్లోనూ ప్రదర్శించింది.
క్యూబా ప్రదర్శిస్తున్న ఈ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా అమెరికా క్యూబా పట్ల ఈ కరోనా కాలంలో మరింత రాక్షసంగా వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభ సమయంలో గత ఆరు దశాబ్దాల నుండీ క్యూబాపై కొనసాగిస్తున్న ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక రంగ ఆంక్షలను ఏమాత్రమూ సడలించలేదు సరికదా మరింత క్రూరంగా వాటిని ఉధృతం చేసింది. ఈ కష్ట కాలంలో క్యూబా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, ప్రజల మధ్య నెలకొన్న ఐక్యతను విచ్ఛిన్నం చేసి క్యూబాను పాదాక్రాంతం చేసుకోవాలన్నదే అమెరికా వ్యూహం. క్యూబాతో ఎటువంటి లావాదేవీలకైనా సంసిద్ధతను వ్యక్తం చేసిన దేశాలను, సంస్థలను ఆటంక పరచడం, బెదిరించడం, వేధించడం, భయపెట్టడం చేస్తోంది. చివరకు హెన్రీ రీవ్స్ వైద్య బృందాల సహాయాన్ని తీసుకుంటామన్న దేశాలను సైతం అడ్డుకుంటోంది. హృదయం ఉన్న ప్రతీ వ్యక్తీ తీవ్రంగా ఖండించాల్సిన విషయమిది.
ఏప్రిల్ 2019 నుండి మార్చి 2020 మధ్య (అంటే ఇంకా కరోనా పూర్తిగా విజృంభించక ముందే) అమెరికా ఆంక్షలను తీవ్రతరం చేసిన కారణంగా క్యూబా 557 కోట్ల డాలర్ల మేరకు నష్టపోయిందని క్యూబన్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేస్తూ నివేదిక పంపింది. గత ఆరు దశాబ్దాల కాలపు ఆంక్షల ఫలితంగా కలిగిన నష్టాన్ని గనుక చూసుకుంటే 14,441 కోట్ల డాలర్లు ఉంటుందని ఆ నివేదిక తెలిపింది. ఇది మన కరెన్సీలో గనుక లెక్క వేస్తే సుమారు రూ.11 లక్షల కోట్లు! కేవలం ఒక కోటి మంది జనాభా మాత్రమే ఉన్న చిన్న దేశం క్యూబా. దానిపై అగ్రరాజ్యం అని, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే అమెరికాకు గల అక్కసు చూస్తే పెట్టుబడిదారీ వ్యవస్థకు, సోషలిస్టు వ్యవస్థకు మధ్య వైరుధ్యం అంటే ఏమిటో స్పష్టంగా బోధపడుతుంది. మన దేశంలో పాలకులు కమ్యూనిస్టుల పట్ల ఎందుకింత క్రూరంగా వ్యవహరిస్తారో అర్ధమౌతుంది. బూర్జువా ప్రజాస్వామ్యం పట్ల అనవసరంగా, అతిగా భ్రమలను కలిగి వుండకూడదని లెనిన్ ఎందుకు హెచ్చరించాడో తెలుస్తుంది.
క్యూబాకు చమురు సరఫరా చేయడానికి ముందుకొచ్చిన 34 వెనిజులా నౌకల పైన, ఇతర సరుకులను చేరవేయడానికి వచ్చిన నౌకల పైన అమెరికన్ వాణిజ్య శాఖ పెనాల్టీలను విధించింది. బ్యాంకింగ్ లావాదేవీలను చేస్తున్న జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ దేశాల సంస్థలకు సైతం ఈ పెనాల్టీలు తప్పలేదు. క్యూబాలో ఉన్న 223 సంస్థలతో ఇతర దేశాల కంపెనీలు ఎటువంటి లావాదేవీలనూ జరపరాదని అమెరికా ఆంక్షలు విధించింది. క్యూబా ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది. ఆ రంగాన్ని కూడా అమెరికా విడిచి పెట్టలేదు. పర్యాటకానికి సంబంధించిన విహార నౌకలను, విమానాలను సైతం నిషేధించింది. క్యూబన్ విమానయాన సంస్థలతో ఎటువంటి లీజు ఒప్పందాలనూ చేసుకోరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. టెలికాం రంగానికి సంబంధించి ఎటువంటి ఎగుమతులనూ క్యూబాకు చేయరాదని ఆర్డరు వేసింది.
ఈ చర్యల ఫలితంగా ఫ్రాన్స్, ఉరుగ్వే వంటి దేశాల విమానయాన సంస్థలు క్యూబాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. అంతర్జాతీయ టూరిస్టు సేవల సంస్థలు తమ జాబితాల నుండి క్యూబాకు చెందిన హోటళ్ళ పేర్లను తొలగించాయి.
అరవై సంవత్సరాల క్రితం క్యూబన్ విప్లవం విజయవంతం అయింది. అంతకు ముందు అక్కడ ఉన్న ప్రైవేటు కంపెనీలను సోషలిస్టు ప్రభుత్వం జాతీయం చేసింది. ఇప్పుడు 2020లో అమెరికా ఆ పాత ప్రైవేటు కంపెనీల చేత 25 కోర్టు కేసులు వేయించింది. వాటిలో మూడింటిని వాపసు తీసుకున్నా, తక్కిన 22 కేేసులూ అమెరికన్ కోర్టుల్లో నడుస్తున్నాయి.
ప్రపంచంలోని మందుల కంపెనీల్లో అత్యధిక శాతం అమెరికన్ యాజమాన్యాల కిందే ఉన్నాయి. ఈ కరోనా కాలంలో ఆ కంపెనీల నుండి క్యూబాకు ఎటువంటి మందులూ సరఫరా కాకుండా నిషేధించింది అమెరికా. వినికిడి సాధనాలు, ఇతర వైద్య పరికరాలు గతంలో అమెరికా నుండి దిగుమతి చేసుకున్నవి ఉన్నాయి. వాటికి స్పేర్ పార్టులు, వాటిలో ఉపయోగించే బ్యాటరీలు వంటివి కూడా నిషేధానికి గురయ్యాయి.
ఆహార వస్తువులు గతంలో కొన్ని అమెరికా నుండి దిగుమతి అయ్యేవాటిని (చికెన్ వగైరా) ఈ కాలంలో నిషేధించింది. దాంతో సుదూర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. అందువలన వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి తోడు చమురు సరఫరా కూడా ఆంక్షలకు గురి కావడంతో ఫాస్ట్ ఫుడ్స్ తయారీ పరిశ్రమలకు ఇంధన కొరత ఏర్పడింది. ఇది క్యూబాలో ఆహార సంక్షోభాన్ని సృష్టించింది.
విదేశాల్లో ఉన్న క్యూబన్లు స్వదేశంతో ఎటువంటి లావాదేవీలూ జరిపేందుకు వీలు లేకుండా నిషేధించింది అమెరికా. చివరకు వారు స్వదేశానికి రావాలన్నా ఒక్క హవానా ఎయిర్‌పోర్టుకు తప్ప తక్కిన విమానాశ్రయాలకు పోవడానికి సర్వీసులను రద్దు చేసింది. క్యూబా లోని తమ కుటుంబాలకు పంపే డబ్బు మూడు మాసాలకు 1000 డాలర్లకు మించరాదని నిబంధన పెట్టింది.
ఈ ఆంక్షల ఫలితంగా క్యూబా నుండి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు దాదాపు నిలిచి పోయాయి. విద్యా రంగానికి క్యూబన్ ప్రభుత్వం తన బడ్జెట్‌లో 23.7 శాతం కేటాయించింది. ఇప్పుడు ఇంధన రవాణాపై ఉన్న ఆంక్షల ఫలితంగా పలు విద్యా సంస్థల విద్యా సంవత్సరం అస్తవ్యస్తమైంది. క్రీడా, సాంస్కృతిక రంగాలు సైతం దెబ్బతిన్నాయి. క్యూబన్ సినిమాల ప్రదర్శనలు, సినిమాల చిత్రీకరణ అమెరికాలో నిషేధానికి గురయ్యాయి.
చైనా నుండి ఆలీబాబా అనే కంపెనీ క్యూబాకు విరాళంగా పంపిన వెంటిలేటర్లను, పరీక్ష కిట్లను, మాస్క్‌లను క్యూబా చేరకుండా అమెరికా అడ్డుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా వివిధ కంపెనీలు క్యూబాకు వెంటిలేటర్ల టెక్నాలజీని అమ్మడం సాధ్యపడదని స్విస్ కంపెనీలు తెలిపాయి. క్యూబాకు వచ్చిన డొనేషన్లను క్యూబన్ అకౌంట్లకు బదలాయించడం సాధ్యపడదని స్విస్ బ్యాంకులు తెలిపాయి.
అమెరికా ఇంత విచక్షణా రహితంగా క్యూబా పట్ల అనుసరిస్తున్న దాడిని ఆ దేశం, అక్కడి కమ్యూనిస్టు పార్టీ దృఢంగా ఎదుర్కొంటున్నాయి. ఎన్ని కష్టాలచ్చినా సోషలిజాన్ని అంటిపెట్టుకునే వుంటామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఈ కరోనా కాలంలో సైతం అమెరికన్ దుర్మార్గాన్ని ఖండిస్తూ 87 దేశాలలో 250కి పైగా క్యూబాకు సంఘీభావంగా కార్యక్రమాలు జరిగాయి. మనమూ గొంతులు కలుపుదాం.
ఎం.వి.ఎస్. శర్మ
('గ్రాన్మా' పత్రికలో రోడ్రిగజ్ మిలన్ వ్యాసం ఆధారంగా)










