Oct 12,2020 18:25
కులదురహంకార హత్యలకు అంతం లేదా?

'కులం' సమాజంలో చీడపురుగులా తయారైంది. రోజురోజుకు కుల దురహంకార హత్యలు పెరిగిపోతున్నాయి. అసలు కులమంటే ఏమిటి? కొందరు మనువాదులు వారి స్వార్థానికి ఏర్పాటు చేసింది కాదా? కులం మత్తులో జోగుతూ కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డలను కాటికి పంపుతున్నారు. తమ మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించడమే పిల్లలు చేసిన నేరమా? సలీం- అనార్కలి ప్రేమ నుంచి నేటికీ తల్లిదండ్రుల మస్కిష్కంలో మార్పు రాలేదా? నాటి నుంచి నేటి వరకు కులం, ధనం ప్రేమకు అడ్డుగోడలుగా నిలుస్తూనే ఉన్నాయా? ప్రేమించి.. పెళ్లాడితే.. చంపేస్తారా? తమ ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిని కళ్లముందే చంపేస్తే బిడ్డలు తిరిగి వస్తారా? కుల దురహంకార హత్యలకు అంతం లేదా? ఇదేనా బిడ్డలకు తల్లిదండ్రులిచ్చే కానుక ఇలా సమాధానాలు లేని ప్రశ్నలెన్నో..

ఆడపిల్ల పెద్దగా నవ్వకూడదు.. కొత్త వ్యక్తితో మాట్లాడకూడదు. తన ఇష్ట ప్రకారం దుస్తులు వేసుకోకూడదు. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆంక్షలెన్నో దాటుకుంటూ పెరుగుతుంది యువతి. ఒకవైపు రాకెట్‌ యుగంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటూనే ఆడపిల్లలను ఆంక్షలనే సంకెళ్లతో బంధిస్తున్నారు. చివరకు జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలోనూ ఆమెకు స్వేచ్ఛ లేదా? కూతురు ప్రేమించినోడు వేరే కులస్తుడు అయితే అప్పటి వరకు హీరోగా ఉన్న నాన్న ఒక్కసారిగా విలన్‌గా ఎందుకు మారిపోతున్నాడు? తరాలు మారినా నేటి యువత పాతకాలపు భావజాలంలోనే కొట్టుకుపోవాలా? కొత్త ఆలోచనలకు నాంది పలకకూడదా? యుక్త వయస్సు వచ్చినా మా మాటే వినాలి.. మేం చెప్పినట్లే నడుచుకోవాలి అనే పంతాలకు పోయి నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఇదెక్కడి న్యాయం?


పెరుగుతున్న కులదురహంకార హత్యలు
ఒకప్పుడు హర్యానాలాంటి రాష్ట్రాల్లో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలను ఖాప్‌ పంచాయితీలు పెట్టి నవ దంపతులకు దండన విధించేవారు. నేడు అదే తరహాలో మన తెలుగు రాష్ట్రాల్లోనూ కుల దురహంకార హత్యలు పెరిగిపోయాయి. ఈ కోవకు చెందినదే ఈమధ్య హైద్రాబాద్‌లో జరిగిన హేమంత్‌ హత్య. హేమంత్‌, అవంతి ప్రేమించుకున్నారు. అవంతి కుటుంబ సభ్యులు వారి ప్రేమకు అడ్డుగా నిలిచారు. కొన్నాళ్లు అవంతిని ఇంట్లోనే నిర్బంధించారు. కానీ ఆమె ఎలాగోలా తప్పించుకుని హేమంత్‌ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఈమధ్య పనిమీద బయటకు వచ్చిన అవంతి, హేమంత్‌లను కొందరు కిరాయి గూండాలు కిడ్నాపు చేశారు. కానీ అవంతి వారినుండి తప్పించుకోగలిగింది. హేమంత్‌ని అతి దారుణంగా చంపేశారు. 'అవంతిని పెళ్లి చేసుకుని మా కుటుంబ పరువు తీశాడు కాబట్టే హేమంత్‌ని చంపించాల్సి వచ్చింది' అని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి చెబుతున్నాడు.


2018లో ప్రణరు, అమృతల ప్రేమ విషయంలోనూ అమృత తండ్రి మారుతీరావు ఇలాగే చేశాడు. అప్పట్లో ప్రణరు హత్య పెద్ద సంచలనమే అయింది. ప్రణరు, అమృత చిన్ననాటి స్నేహితులు. అమృత ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రణరుని వివాహం చేసుకుంది. గర్భవతిగా ఉన్న అమృతను హాస్పిటల్‌కు తీసుకెళ్లి వస్తుండగా ప్రణరుని కొందరు కిరాయి గూండాలు హత్య చేశారు. మారుతీరావు అల్లుడినైతేే చంపించాడు కానీ ఆ తరువాత నెలకొన్న వాతావరణాన్ని తట్టుకోలేక కుంగిపోయాడు. చివరకు తనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోజు మారుతీరావు, ఈరోజు లక్ష్మారెడ్డికి పిల్లల సంతోషం కన్నా కులమే ముఖ్యమైందా? 2016లో తమిళనాడులో జరిగిన శంకర్‌ కులదురహంకార హత్య ఉదంతంలోనూ ఇదే జరిగింది. తమిళనాడులో అగ్రకులంగా భావించే దేవర్‌కు చెందిన కౌసల్య దళిత కులానికి చెందిన శంకర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది జీర్ణించుకోలేని ఆమె కుటుంబ సభ్యులు శంకర్‌ను హత్య చేయించారు. ఆమె నేటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. గత రెండు దశాబ్దాల్లో 44,412 హత్యలు ప్రేమ-పెళ్ళి వ్యవహారాల్లో జరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.


కొందరు స్వార్థపరులు ప్రజలపై రుద్దిన మూర్ఖత్వపు మూఢాచారాల ఫలితాలివి. రాజ్యాలను ఏలుతున్న మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, పెద్దపెద్ద చదువులు చదివిన అధికారులు 'కులాల పేరుతో హత్యలు చేసుకోవద్దు. కులాంతర వివాహాలూ సమర్ధనీయమైనవే. ఈ విషయాన్ని ఐదేండ్ల చర్చానంతరం 1955లో హిందూ కోడ్‌ బిల్లు ద్వారా ఆమోదించుకున్నాం. కులాల అంతరాలు నామమాత్రమే' అని ఒక్క మాట చెప్పడానికి ఎందుకు మొహం చాటేస్తున్నారు?


2006లో ఒక కులదురహంకార హత్యకేసు ఘటనలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 'ఈ తరహా హత్యల నిరోధానికి కఠిన చట్టాలు అవసరం' అని పార్లమెంటుకు గుర్తు చేసింది. అయినా అలాంటి చట్టాలు నేటికీ రాలేదు. కులం, ఆస్తి అంటూ తామెంతో ప్రేమించే బిడ్డల జీవితాలను నాశనం చేసిన తల్లిదండ్రులు సాధించిందేమిటి? వారి జీవితాలు, వారి బిడ్డల జీవితాలను విషాదాల్లోకి నెట్టడం తప్పా?
కులదురహంకార హత్యలు జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఉంది. 'కుల నిర్మూలన' రాజకీయ పార్టీల మానిఫెస్టోల్లో భాగం కావాలి. అన్ని వేదికలపై అది ప్రకటించాలి. ప్రముఖులంతా పాటించి ఆదర్శంగా నిలబడాలి.