Jan 17,2021 07:01

ప్రపంచం యావత్తూ కరోనా పై పోరులో సతమతమౌతోంది. ముఖ్యంగా ప్రజావైద్యాన్ని సైతం ఒక వ్యాపారంగా దిగజార్చిన అమెరికా, బ్రిటన్‌ తదితర సంపన్న దేశాలు, తమ నియంతృత్వ విధానాలతో ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కార్పొరేట్ల సేవలోనే మునిగి, తేల్తూ వున్న మోడీ, బోల్సనారో వంటి నాయకుల పాలనలో ఉన్న దేశాలు తమ ప్రజలను కరోనా నుండి రక్షించడంలో ఘోరంగా విఫలమయాయి. ఇటువంటి తరుణంలో, నాలుగు దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక ఆంక్షలకు గురవుతూ, పలు ఇక్కట్లలో ఉన్న సోషలిస్టు క్యూబా ప్రజలను ఆదుకోవడంలో యావత్‌ ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలిచింది. క్యూబా జనాభా ఒక కోటి 20 లక్షలు. ఏ కోణం నుండి చూసినా క్యూబాను సంపన్న దేశం అని అనలేము. 1959లో క్యూబన్‌ ప్రజలు సాధించుకున్న విప్లవాన్ని అమెరికా కుట్రల నుండి కాపాడుకోడానికే తన సర్వ శక్తులనూ వినియోగించవలసి వస్తున్నది. ఈ కరోనా క్లిష్ట పరిస్థితులలో సైతం అమెరికా క్యూబాకు ఇతర దేశాలు పంపిన అత్యవసర సరుకుల ఓడలను నిలిపివేసింది. క్యూబాతో లావాదేవీలు నిలిపివేయకుంటే తీవ్ర చర్యలు తప్పవని పలు దేశాలను హెచ్చరించడంతో చాలా దేశాలు వెనక్కి తగ్గాయి. చైనా నుండి క్యూబాకు పంపిన నౌకను మధ్య లోనే అమెరికా తన అధీనంలోకి తీసుకుంది. ఇన్ని దారుణాలను తట్టుకుంటూ క్యూబా ఏం చేసిందో చూద్దాం.

  1. తక్కిన దేశాలేవీ ఇంకా కరోనా ముప్పు గురించి పట్టించుకోక మునుపే 2020 జనవరి రెండో వారం లోనే క్యూబా తన కార్యాచరణను ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలను క్యూబన్‌ మీడియా విస్తృతంగా ప్రజలలోకి తీసుకుపోయింది. జనవరి 24న నేషనల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పడింది (మన మోడీ మార్చి నెల 23 వరకూ స్పందించనేలేదు).
  2. దేశంలో ఇంకా ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినా, జనవరిలోనే 95,000 మంది డాక్టర్లకు, 86,000 మంది నర్సులకు కరోనాను గుర్తించడం, వైద్యం అందించడం గురించి శిక్షణ ఇచ్చారు (ఒక కోటి 20 లక్షల జనాభాలో 95 వేల మంది వైద్యులు ఉన్నారు. అంటే దాదాపు ప్రతి 125 జనాభాకు ఒక డాక్టరున్నారు.).
  3. ఫిబ్రవరి నెలలో ప్రజానీకానికి కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పూర్తి అవగాహన కల్పించారు. అప్పటికి ఆ దేశంలో ఇంకా ఒక్క కేసూ నమోదు కాలేదు.
  4. మార్చి 10న ఒక విదేశీ టూరిస్టుకు కరోనా సోకినట్టు గుర్తించారు. వెంటనే క్యూబా లోని 13 మెడికల్‌ కాలేజీలలోని విద్యార్ధులను ఇంటింటి ప్రచారంలోకి పంపారు. మార్చి 15కల్లా ఆ బృందాలు దేశ జనాభాలో సగం మందిని, అంటే 60 లక్షల మందిని సర్వే చేసేశాయి.
  5. మార్చి 20 నాటికి మొత్తం కేసులు 21కి చేరాయి. వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన భౌతిక దూర నిబంధనలను అమలు చేయడం ప్రారంభించారు. సుమారు 60 వేల మంది విదేశీ టూరిస్టులను వెనక్కి పంపారు. ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టూరిజం మీద దీని ప్రతికూల ప్రభావం తీవ్రంగా పడింది. అయినా, క్యూబా తన ప్రజల ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యతనిచ్చింది.
  6. దేశంలో ప్రైవేటు వ్యాపారులు చెల్లించవలసిన పన్నులను నిలుపుచేసింది. లాక్‌డౌన్‌ వలన పనులు కోల్పోయిన కార్మికులకందరికీ మొదటి నెల పూర్తి జీతాన్ని చెల్లించింది. ఆ తర్వాత నెలనుండి 60 శాతం జీతాన్ని చెల్లిస్తూ వచ్చింది. ప్రైవేటు రంగం లోని కార్మికులకు జాతీయ కనీస వేతనాలు గ్యారంటీ చేసింది.
  7. నైబర్‌హుడ్‌ స్టోర్స్‌ ద్వారా దాదాపు 40 లక్షల కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, వంటనూనె, గుడ్లు, చక్కెర సరఫరా చేసింది.
  8.  ఏప్రిల్‌ 6 నాటికి మొత్తం కేసులు 396 కి చేరాయి. దాంతో అత్యవసర సర్వీసులు మినహా తక్కిన ఆర్థిక కార్యకలాపాలనన్నింటినీ నిలిపివేసింది. ప్రజలు తాగునీరు, విద్యుత్తు, వంట గ్యాస్‌ కోసం చెల్లించవలసిన చార్జీలను రద్దు చేసింది. ఈ చర్య శ్రామిక ప్రజలకు గొప్ప ఊరట కలిగించింది.
  9. జనవరి 2021 నాటికి క్యూబాలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 13000 దాటలేదు. మరణాలు ఆనాటికి 147 మాత్రమే. ప్రపంచంలోనే అతి తక్కువ శాతం మరణాలు సంభవించిన దేశాలలో క్యూబా ఒకటి.
  10. యువజన, మహిళా, విద్యార్ధి సంఘాలు కరోనా గురించి అవగాహన కల్పించడంలో, ఆహార సరఫరాలో, ఇంటింటి సర్వేలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. క్యూబాలో వెల్లడైన సహకార స్ఫూర్తి ఏ పెట్టుబడిదారీ దేశంలోనూ కానరాదు.
  11. చైనాకు, పలు ఇతర దేశాలకు అవసరమైన మందులను ఈ కాలంలో క్యూబా సరఫరా చేసింది. 1,50,000 డబుల్‌ డోసుల ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా 2బి డోసులను చైనాకు అందించింది.
  12. హెన్రీ రీవ్‌ ఇంటర్నేషనల్‌ మెడికల్‌ బ్రిగేడ్‌ నుంచి దాదాపు 25 దేశాలకు వైద్య బృందాలను పంపింది.ఇటలీ, బార్బడోస్‌ తదితర దేశాలకు వెళ్ళిన వైద్య బృందాలు అక్కడ వైద్యం అందించడంతో బాటు అక్కడి వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చాయి. ఇటువంటి విశిష్టమైన రీతిలో సేవలు అందించినందుకు క్యూబన్‌ డాక్టర్లకు నోబెల్‌ శాంతి బహుమతిని ఇవ్వాలని పలు సంస్థలు, మేథావులు కోరారు. కాని అమెరికా మాత్రం ఆ వైద్యుల సేవలను నిరాకరించడమే కాకుండా తన మిత్ర దేశాలేవీ క్యూబన్‌ డాక్టర్ల సేవలను వినియోగించుకోరాదని ఆంక్షలు పెట్టింది.
  13. ఎం.ఎస్‌.బ్రేమర్‌ అనే బ్రిటిష్‌ పాసింజర్ల నౌక 682 మంది ప్రయాణీకులతో ఉండి, అందులో పలువురికి కరోనా సోకింది. ఏ ఇతర దేశమూ ఆ నౌకను తమ రేవులలోకి రానివ్వలేదు. కాని క్యూబా మాత్రం అత్యున్నతమైన సోషలిస్టు మానవతా స్ఫూర్తిని ప్రదర్శించింది. ఆ నౌకను అనుమతించడం వలన కలిగే రిస్క్‌లు తీవ్రంగా ఉంటాయని తెలిసినా, అందులో చిక్కుకున్న ప్రయాణీకులను కాపాడేందుకే సిద్ధపడింది. వారందరికీ వైద్యం అందించింది. తిరిగి సురక్షితంగా బ్రిటన్‌ పంపింది.
  14. గత ఆగస్టులోనే క్యూబా తన మొదటి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసింది. అదే సొబెరనా-1. ఆ తర్వాత మరో మూడు వ్యాక్సిన్‌ లను తీసుకు వచ్చింది. ఇవన్నీ వివిధ దశల ప్రయోగాలలో ఉన్నాయి. ఫిబ్రవరి 2021నాటికి తన దేశ ప్రజలకందరికీ వ్యాక్సిన్‌ లను అందిస్తామని క్యూబన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఎంతసేపూ సొంత డబ్బా కొట్టుకుంటూ, ఏమీ చేయకపోయినా డాంబికాలు పలుకుతూ, ప్రజలను ఆదుకోడానికి పిసరంత సహాయం కూడా చేయకపోయినా, కోట్లాది రూపాయల సొమ్మును పి.ఎం. కేర్స్‌ పేర దండుకుంటూ, చప్పట్లు కొట్టి, శంఖాలూది, పళ్ళేలు మోగించి, గో మూత్రం తాగి కరోనాను తట్టుకోమని చెత్త సలహాలు చెప్పే మన ప్రభుత్వానికి, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఎంచే సోషలిస్టు క్యూబా ప్రభుత్వానికి ఎక్కడైనా పోలిక ఉందా?
                                                                                           * ఎం.వి.ఎస్‌. శర్మ