రెండు దృశ్యాలు ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకచోట ఆనంద హేల! మరో చోట ఆరోపణల గోల!! కరోనా వైరస్‌ను కట్టడి చేసిన చైనాలో అక్టోబరు ఒకటవ తేదీన ప్రతి ఏటా జరుపుకొనే అరుణపతాక ఆవిష్కరణ ఎంతో ఆర్భాటంగా జరిగింది. 1949 అక్టోబరు ఒకటవ తేదీన చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఇదే సమయంలో శరత్కాల పండుగను కూడా జరుపుకుంటారు. అందువలన రెండింటికి కలిపి వారం రోజుల పాటు ఇచ్చే సెలవులు గడిపేందుకు దాదాపు 55 కోట్ల మంది వివిధ ప్రాంతాలకు పయనమై వెళ్లారు. కరోనాను కట్టడి చేసిన తరువాత చైనాలో సాధారణ జీవనం పునరుద్ధరణ అయిందనేందుకు ఇది నిదర్శనం.
మరోవైపు కరోనా నిరోధాన్ని నిర్లక్ష్యం చేసి రెండు లక్షలకు పైగా ప్రాణాలు పోయేందుకు, 75 లక్షల మందికి కరోనా సోకేందుకు కారకుడైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన నేరం, వైఫల్య నెపాన్ని ఇతరుల మీద నెట్టేందుకు పూనుకున్నాడు. నిర్లక్ష్యంతో అధ్యక్షుడిగా యావత్ అమెరికా పౌరులను కరోనా దయాదాక్షిణ్యాలకు విడిచిపెట్టాడు. చివరకు వ్యక్తిగతంగా తాను కరోనా బారిన పడడమే గాక, తన భార్యకు సైతం కరోనాను అంటించి క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికలు జరిగే నాటికి కోటి మంది వరకు కరోనా బారినపడేంతగా వ్యాధి వ్యాపిస్తోంది. మరోవైపు చైనాలో అడపాదడపా కొన్ని కేసులు వెలుగు చూడటం-అదీ విదేశాల నుంచి దిగుమతి అయ్యేది-తప్ప మొత్తంగా వ్యాధి అదుపులో ఉంది.
మహమ్మారులను ఎదుర్కోవటం, కట్టడి చేయటంలో సోషలిస్టు ప్రభుత్వాల ప్రత్యేకత ఏమిటో చరిత్రలో తొలిసారిగా ప్రపంచం చూసింది. వంద సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ వ్యాప్తి చెంది పెద్ద సంఖ్యలో జనం మరణించిన సమయానికి రష్యాలో బోల్షివిక్ ప్రభుత్వం పూర్తిగా నిలదొక్కుకోలేదు. కరోనా కేసులు తొలుత చైనాలో బయట పడిన కారణంగా అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ జీవ ఆయుధాల తయారీలో భాగంగా బయటకు వదిలారని, ప్రమాదవశాత్తూ బయల్పడిందని ఏ కారణం చెప్పినప్పటికీ చైనా మీద ఆరోపణలు చేసేందుకు, కమ్యూనిస్టు సిద్ధాంతం మీద దాడి చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. కరోనా పేరుతో అన్ని విధాలుగా ఒంటరి పాటు చేసేందుకు, ఆ పేరుతో ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన దేశాలు ఏవో చూశాం. వాటన్నింటినీ తట్టుకొని తనదైన శైలిలో ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని కరోనా నుంచి బయటపడింది.
కరోనా కేసులు తొలుత బయట పడిన ఊహాన్ నగరం, హుబెరు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు జరిపిన తీరు ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదు. అన్నింటికీ మించి జనం ఎక్కడా చైనా, వియత్నాంలో మాదిరి సహకరించలేదు. కరోనా మహమ్మారి నుంచి చైనా సమాజాన్ని బయటపడవేసేందుకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తీసుకున్న చర్యల మీద జనం అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. దీనికి గత నాలుగు దశాబ్దాలలో సంస్కరణలు అమలు జరిపి జనజీవితాలను మెరుగుపరచిన వాస్తవాన్ని స్వయంగా గమనించటమే కారణం. పదేళ్ల క్రితం ధనిక దేశాల్లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా తమ ఆర్థిక వ్యవస్ధ కూడా ప్రభావితం అయినప్పటికీ...జనాన్ని ఆదుకున్న తీరును, మిగిలిన దేశాల్లో జనజీవితాలు అస్తవ్యస్ధం కావటాన్ని చూశారు గనుకనే కరోనా మహమ్మారిని జయించేందుకు ప్రభుత్వంతో కలసి జనం పోరాడారు.
దాదాపు తొమ్మిది నెలల పాటు క్వారంటైన్, లాక్‌డౌన్, అనేక ఆంక్షలను అనుభవించిన జనం గత రెండు నెలలుగా కొత్త కేసులు లేకపోవటంతో పంజరాల నుంచి బయట పడిన పక్షులు స్వేచ్ఛగా ఎగిరే మాదిరి బయటకు వచ్చారు. పరిస్ధితులన్నీ బాగుపడ్డాయనే ధైర్యం వచ్చిన తరువాత కసిగా విహార యాత్రలకు వెళుతున్నారని విశ్లేషకులు వర్ణించారు. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. సెప్టెంబరు 30వ తేదీన 12 కేసులు నమోదు కాగా అవి కూడా విదేశాల నుంచి వచ్చిన వారివే. ఎనిమిది రోజుల పాటు సెలవులను ప్రకటించటం ఏ దేశంలో అయినా జరుగుతుందా ? చైనాలో మాత్రమే చూడగలం. నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక్కసారిగా 55 కోట్ల మంది బయటకు వస్తే బహిరంగ స్ధలాలు ఎంత రద్దీ అవుతాయో ఊహించుకోవా ల్సిందే. ప్రయాణ సాధనాల్లో, హోటళ్లలో రిజర్వేషన్లు దొరక్క, ఒక రోజు ముందే వాహన రద్దీతో ఇళ్లకే పరిమితమైన వారెందరో. అక్టోబరు ఒకటవ తేదీ ఒక్క రోజే 14,941 విమానాలు ఏర్పాటు చేశారు. రద్దీని తట్టుకొనేందుకు ప్రత్యేక విమానాలు కూడా సిద్ధం చేశారు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు ఎనిమిది వరకు రైల్వే శాఖ 10.8 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే చైనా సమాజం మీద ఆర్థికంగా కరోనా ప్రభావం లేదా? ఉంది కనుకనే గత ఏడాది 80 కోట్ల మంది ప్రయాణాలు చేస్తే...ఈ ఏడాది 55 కోట్ల మందే చేస్తున్నారని వెల్లడైంది. గతేడాది 9.5 బిలియన్ డాలర్ల మేరకు జనం ఖర్చు చేశారు. ఈ ఏడాది తగ్గనుంది. ఆగస్టు నుంచి సాధారణ వస్తు కొనుగోలు పెరిగింది.
కరోనా వైరస్‌ను అదుపు చేయటంలో ఒక్క చైనాయే కాదు. వియత్నాంతో పాటు సామ్రాజ్యవాదుల ఆంక్షల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న క్యూబా, వెనెజులా కూడా ప్రపంచానికి మార్గం చూపాయి. వియత్నాంలో కరోనాను కట్టడి చేశారు. అయితే అదే పద్ధతిని ఇతర దేశాల్లో ఎందుకు అనుసరించటం లేదు? ఇబ్బందులేమిటి? అనే చర్చ జరిగింది. చైనాతో వియత్నాంకు సరిహద్దు ఉన్న విషయం తెలిసిందే. ఊహాన్ నుంచి వియత్నాం వచ్చిన ఒక చైనా పౌరుడు, అతని కుమారుడిలో జనవరి 30న ఆ వ్యాధి లక్షణాలు బయట పడ్డాయి. 2003లో చైనాలో బయటపడిన సార్స్ సోకిన తొలి దేశం వియత్నాం కావటం, గత అనుభవాలను గమనంలో ఉంచుకొని అక్కడి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం వెంటనే కరోనా నివారణకు కఠినమైన చర్యలు తీసుకుంది. వాటికి జనం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. వియత్నాంలో కేంద్రీకృత అధికార వ్యవస్ధ ఉండటం, వెంటనే నిర్ణయాలు తీసుకొనేందుకు, అమలు చేసేందుకు దోహదం చేసింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించటం, లాక్‌డౌన్ నిబంధనలను గట్టిగా అమలు జరపటం ఎంతో తోడ్పడింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీద నిఘా వేసే చర్యలు తీసుకున్నారు. అనేక దేశాల్లో ప్రభుత్వాలకు అలాంటి అధికారం ఉన్నప్పటికీ జవాబుదారీతనం, తగినన్ని నిధులు లేని కారణంగా ఆ పని చేయలేదు.
ఉత్తర వియత్నాంపై అమెరికా దాడి చేసిన సమయంలో జనాన్ని సిద్ధం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు ఎంతగానో అమెరికా వ్యతిరేకతను, దేశాన్ని రక్షించుకోవాల్సిన జాతీయ భావనలను జనంలో కలిగించటంలో జయప్రదం అయ్యాయి. అమెరికన్లను అడ్డుకొనేందుకు ప్రతి పౌరుడు సాయుధుడు కావాలని ప్రతి ఇల్లు ప్రతిఘటన కేంద్రంగా మారాలని అప్పుడు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కరోనా మీద యుద్ధాన్ని కూడా అదే పద్ధతుల్లో చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. ఇది జనాన్ని కదిలించింది. జనం కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. ఇలాంటి పరిస్ధితి మరే దేశంలోనూ కనిపించదు. సెల్‌ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్ధితిని ప్రభుత్వం వివరించింది. మీడియా సరేసరి. మిలిటరీని కూడా రంగంలోకి దించి జనాన్ని అప్రమత్తం చేసింది. ఈ కసరత్తు అంతా జనానికి పరిస్ధితి తీవ్రతను తెలియ చేసేందుకు కరోనా పోరులో వారిని భాగస్వాములను చేసేందుకు అన్నింటికీ మించి ఆత్మ విశ్వాసాన్ని కలిగించేందుకు ఎంతగానో తోడ్పడింది. దీనికి సోషలిస్టు చైతన్య స్ఫూర్తి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్త అని వేరే చెప్పనవసరం లేదు.
ఒక వైపు కరోనాను కట్టడి చేస్తూనే మరోవైపు ఆర్థిక రంగంపై దాని ప్రభావం పడకుండా చూసిన కారణంగా ఈ ఏడాది ఎనిమిది నెలల్లో అమెరికాతో సహా అనేక దేశాలకు వియత్నాం ఎగుమతులు గత ఏడాది కంటే పెరిగాయి. అమెరికా ఖండ దేశాల నుంచి పెట్టుబడులు కూడా పెరిగాయి. దీనికి అమెరికా-చైనా మధ్య తలెత్తిన వివాదం కూడా తోడైంది.
చైనాలో వైరస్ అదుపు లోకి వచ్చిన మే మాసం నుంచి నామమాత్రంగా కేసులు నమోదు కాగా...అమెరికాలో పది లక్షల నుంచి అక్టోబరు రెండు నాటికి 75 లక్షలకు పెరిగాయి. 25 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కరోనాకు ముందు ఎక్కువ మంది ఆర్థికవేత్తలు 2020లో చైనా ఆర్థిక వ్యవస్ధ ఆరు శాతానికి అటూ ఇటూగా వృద్ధి రేటుతో ఉంటుందని అంచనా వేశారు. 2021 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. నాటికి 2010లో ఉన్న జిడిపిని రెట్టింపు చేయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇచ్చింది. దాన్ని చేరుకోవాలంటే ఆరు శాతం వృద్ధి రేటు ఉంటే సాధ్యమే అని అనేక మంది భావించారు. కరోనాతో అది కష్టం కావచ్చని, అయినప్పటికీ ఆ దిశగా పని చేయాలని అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. 2021 నాటికి కాకున్నా ఆ ఏడాది చివరికి అయినా లక్ష్యాన్ని చేరాలనే పట్టుదలతో పని చేస్తున్నారు.
కరోనా కారణంగా ఉద్దీపన పథకాలకు అమెరికా 2.3 లక్షల కోట్ల డాలర్లు కేటాయించింది. చైనా 50 వేల కోట్ల డాలర్లు కేటాయించింది. అమెరికా అంత మొత్తం ప్రకటించినా ఆ దేశ ఆర్థిక వ్యవస్ధ 2020లో 8 శాతం తిరోగమనంలో ఉంటుందని, 2021లో 4.5 శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ జూన్ అంచనాలో పేర్కొన్నది. అదే చైనా విషయానికి వస్తే ఒకటి, 8.2 శాతాలుగా ఉంటుందని పేర్కొన్నది. ప్రపంచంలో ఒక్క చైనా మాత్రమే 2020లో పురోగమన వృద్ధి రేటుతో ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా. కరోనా విషయంలోనే కాదు, ఆర్థిక రంగంలో చైనా తన సోషలిస్టు వ్యవస్ధ విశిష్టతను ప్రదర్శిస్తోందన్నది స్పష్టం.
- ఎం. కోటేశ్వరరావు
('కరోనా కట్టడిలో క్యూబా' తదుపరి సంచికలో)










