
మిత్రమా..భూలోకంలో చవితి ఉత్సవాలు ఈ ఏడాది ఎలా జరుగుతున్నాయో చూసి వచ్చెదమని తన ఎలుక వాహనాన్ని బయలు దేరమన్నాడు వినాయకుడు! యాత్ర మాట విన్న మూషికం...ఇప్పుడున్న పరిస్థితుల్లో భూలోకానికి వెళ్ళుట అంత శ్రేయస్కరం కాదు గజేంద్రా అన్నాడు. ప్రతి ఏడాది నా ఉత్సవాలు భూలోకంలో ఎలా జరుగుతున్నాయో ప్రత్యక్షంగా వీక్షించి రావడం ఆనవాయితీయే కదా బయలుదేరుము అన్నాడు వినాయకుడు. ప్రతి యేడాది ఒక ఎత్తు, ఈ 2020 వేరు స్వామీ! ప్రస్తుతం ప్రజలకు మీ ఉత్సవాల కోసం ఆలోచించే తీరిక లేదు. భూలోకమంతటా ఏదో 'కరోనా' రోగమట ఏ నోట విన్నా ఇదే జపం. ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నారు. భూలోకానికి వెళితే ఆ మాయదారి రోగం మనకు అంటుకుంటే ముల్లోకాలకూ పాకుతుంది! అందుకే నా మాట విని ఈ ఏడాది మీ భూలోక ప్రయాణాన్ని విరమించుకోండి స్వామీ అన్నాడు మూషిక వాహనుడు!
ఈ 2020లో నా ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోవాలని చాలా కలలు కన్నాను మూషికా అన్నాడు సిద్ధి వినాయకుడు. ఈసారి మన ఉత్సవాలకు నిలువెత్తు విగ్రహాలు, బాజా భజంత్రీలు, ఊరేగింపులు, అభిషేకాలు ఆశించిన రీతిలో జరగవు స్వామీ. ప్రజల డబ్బంతా మాస్కులు, శానిటైజర్లు, ఆసుపత్రుల ఖర్చులకే చాలడం లేదు. ఇప్పుడు భూలోకానికి వెళితే ఆ రక్షణ కవచాలు లేవని మనక్కూడా ఫైన్లు వేస్తారు. అవి లేకపోతే కరోనా కాటుకు బలైపోతాం స్వామీ అన్నాడు ఎలుకవాహనుడు. ఏది ఏమైనా ప్రత్యక్షంగా భూలోకానికెళ్లి తీరాల్సిందేనంటూ తన మూషిక వాహనంపై ఆంధ్ర దేశానికి వచ్చాడు వినాయకులవారు!
భూలోకంలో ప్రజల పరిస్థితిని చూసిన విఘ్నేశ్వరుడు మూషికా ప్రజలందరి మూతులకు ఆ గుడ్డలేమిటి? ఆసుపత్రులలో ఆ ఆర్తనాదాలేమిటి? భూలోకంలో ఏం జరుగుతోంది అడిగాడు ఆశ్చర్యంగా. నేను ముందే చెప్పాను కదా స్వామీ. ఇది 'కరోనా టైం'. అందుకే నిన్న మొన్నటి వరకు ముక్కోటి దేవతలూ...సమస్త మతాల దేవుళ్లూ లాక్‌డౌన్ ప్రకటించుకున్నారు అన్నాడు మూషికుడు. ఈ కరోనా వల్ల చడీచప్పుడు లేకుండా ఓ 'పెద్దాయన' ప్రకటించిన లాక్‌డౌన్‌తో ప్రజల జీవితాలన్నీ ఛిద్రమయ్యాయి. తమ సొంతూళ్లకు పిల్లాపాపలతో వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నా పాలకులు కళ్లప్పగిస్తూ చూశారు. నడిచి, నడిచి ఎందరో గుండెలాగే వరకు, రైలు పట్టాలపై శరీరాలు ఛిద్రమయ్యే వరకు పట్టించుకోనే లేదు స్వామీ అన్నాడు మూషికుడు. ఎంత దుర్మార్గం. ఈ పాలకులు కళ్లుండీ కబోధుల్లా మారారు మూషికా అన్నాడు వినాయకుడు. అవును స్వామీ..ఉన్న పనిపోయి... సొంతూళ్లకు చేరిన జనాల్ని ఆదుకోవాల్సిన పాలకులు చేతులెత్తేశారు స్వామీ...సామాన్యుల చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతుంటే...మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు ఈ నాయకులు పెట్టిన పెట్రోల్ మంటలకు ఉన్నది కూడా కరిగిపోతోంది. అందుకే ఈసారి తమకు ధూప, నైవేద్యం కూడా పెట్టే పరిస్థితి మన సామాన్యులకు లేదు స్వామీ అన్నాడు మూషికుడు.
మూషికా..మాకు ప్రీతిపాత్రమైన పిల్లలు మమ్మల్ని మరువరు కదా! అన్నాడు వినాయకుడు. గతంలో మీ మండపాల వద్ద హడావుడి చేసే పిల్లలు, నేడు తమ ఆటా, పాటా, బడి గంటకు దూరమై ఇళ్లలోనే బంధీలయ్యారు. ఇప్పట్లో వీళ్లు బయటకొచ్చే పరిస్థితులు లేవు స్వామీ అన్నాడు మూషికుడు. అయినా ఇప్పుడు మీరు ఈ లోకంలో చూడాల్సింది మీ విగ్రహాలు కాదు స్వామీ. పాలకుల పాపాలకు కుదేలైన వైద్య రంగంతో, రోగమొస్తే కనీసం చూడ్డానికి వైద్యుడు కూడా కరువైన స్థితిని. తమాషా ఏమంటే స్వామీ. రోగానికి మందు గోళీల కంటే... గోమూత్రమే మందని నమ్మించేందుకు ప్రయత్నించిన వారు సైతం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు అన్నాడు మూషిక వాహనుడు.
ఈ కరోనా విపత్తుకి విరుగుడు వస్తుంది కదా మూషికా అన్నాడు వినాయకుడు. వస్తుంది స్వామీ...కానీ దూర దృష్టి లేని, సమాజ క్షేమం పట్టని నాయకుల ఏలుబడిలో కరోనాకు మందు పేరుతో వ్యాపారం, చికిత్స పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తూ...వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది స్వామీ! దీనికి విరుగుడైన వ్యాక్సిన్ కూడా మంచి బిజినెస్ అయింది. అందుకే ఈ పాలకులకు, బడాబాబులకు 'కరోనా' రోగమే ఒక పండగ. మీ పండగ పేరుతో వచ్చే లాభం కంటే ఈ కరోనా పేరుతో వచ్చే లాభమే..ఇలాంటి మరో వ్యాధి వచ్చే వరకూ వీరిని కాపాడుతుంది స్వామీ. ఇంతటి బంపర్ ఆఫర్‌ను వదులుకొని మిమ్మల్ని పట్టించుకునే పాలకులెవరున్నారు. మనకి కరోనా వస్తే చికిత్సకు ఆసుపత్రులు లేవు. ఖాళీ బెడ్లు కూడా లేవు. అందుకే పదండి మన లోకానికి బయలుదేరదాం అంది మూషికం. చేసేది లేక మూషిక వాహనంపై వినాయకుల వారు తన లోకానికి ఉపక్రమించాల్సి వచ్చింది!
- వి.వి. శ్రీనివాసరావు