
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన టిడిపి కూటమి అధికారంలోకి వచ్చేందుకు ఇరుపార్టీల నాయకులు సమిష్టిగా కృషి చేయాలని సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన టిడిపి ముఖ్యనాయకుల ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. జనసేన నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆద్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఇరుపార్టీల నాయకులు పరిచయం చేసుకున్నారు. ఈసందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమోదించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు రావటం అభినందనీయం అన్నారు.వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ ప్రతి పక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతున్నారని విమర్శించారు. జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన టిడిపి కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, టిడిపి నాయకులు మన్నెం శివనాగమల్లేశరరావు ,నాగౌతు శవరయ్య , జనసేన నాయకులు నాదెండ్ల నాగేశ్వరరావు తోట నరసయ్య, తాడువాయి లక్ష్మీ, శిరిగిరి పవన్, రంగిశెట్టి సుమన్, టిడిపి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.