
ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక జనాభా ఉన్న అస్సాంలో వరదల వల్ల వంద మంది పైగా చనిపోవడం, దాదాపు అరకోటి మంది పైగా ప్రజానీకం ముంపులో చిక్కుకొని నరకయాతన పడుతుండటం విషాదకరం. అస్సాంకు వరదలు కొత్త కాదు..కానీ ఈ ఏడాది ముంపు ప్రభావం కనీవినీ ఎరుగనంత స్థాయిలో ఉంది. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో 32 జిల్లాలు మొత్తంగా నీటిలోనే బతుకెళ్లదీస్తున్నాయి. గౌహతి తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన సిల్చార్ మొత్తం ఇప్పటికీ వరద నీటి కిందనే ఉండటం దిగ్భ్రాంతికరం. విద్యుత్ లేదు. తాగేందుకు నీళ్లు లేవు. మందులు లేవు. నిత్యవసర సరుకులు నిండుకున్నాయి. వరద ముంపునకు గురై చనిపోయినవారికంటే ప్రాణాధార మందులు, ఆహారం సకాలంలో అందకపోవడం వల్ల తనువు చాలించినవాళ్లే అధికమని కథనాలొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవితకాలంలో ఇంతటి విలయాన్ని తామెప్పుడూ చూడలేదని 70 ఏళ్లు పైబడిన వృద్ధులు కన్నీటి పర్యంతమవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సోనాపుర్‌లో ఆరో నంబరు జాతీయ రహదారిపై ఒక వైపు కొండ చరియలు విరిగిపడుతూవుంటే..మరోవైపు రక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బురదలో పడుతూలేస్తూ ప్రజలు వెళ్తున్న దృశ్యాలు కంటతడి పెట్టించకమానవు.
ప్రజానీకం ఇంతటి విలయంలో విలవిల్లాడిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుండటం సిగ్గుచేటు. ప్రజలను సకాలంలో రక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ, వారికి కనీస అవసరాలు తీర్చడంలోనూ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 845 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వరద ముంపులో చిక్కుకున్నవారిలో కేవలం 2.71 లక్షల మందిని తరలించింది. ఇంకా 54.7 లక్షల మంది ముంపులోనే విలవిల్లాడుతున్నారు. ఒక్క బర్పేటా జిల్లాలోనే 11.3 లక్షల మంది నీటిలో చిక్కుకున్నారు. సిల్చార్ నగరం మొత్తం నీటిలోనే ఉంది. కేంద్ర, రాష్ట్ర సహాయక బలగాలు ప్రజలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్న సమన్వయ లోపం కొట్టిచినట్టు కనిపిస్తోంది. ముంపు ప్రజలను ఆదుకోవడం కంటే రాజకీయ ప్రయోజనాలకే పాలక పెద్దలు ప్రాధమ్యం ఇవ్వడం వల్లే ఈ దుస్థితి.
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నందున రాష్ట్రంలోనూ బిజెపికే ఓటేస్తే 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాగ్దానాలను గుర్తు చేస్తూ ఇప్పుడు 'డబుల్ ఇంజిన్' ఎక్కడ ఆగిపోయిందంటూ అస్సామీయులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ఇటు రాష్ట్రం కానీ, అటు కేంద్రం కానీ పట్టించుకోకపోతే దిక్కు ఎవరు అంటూ నిలదీస్తున్నారు. నాలుగైదు వారాలుగా నరకయాతన అనుభవిస్తున్న ప్రజానీకాన్ని చూసేందుకు కూడా కేంద్ర పాలకులకు మనస్కరించకపోవడం సిగ్గుచేటు. విపత్కర పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో శివసేన తిరుగుబాటు నేతలను బిజెపి గౌహతికి తరలించడం మరో దుర్మార్గం.
ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చడంలో దిట్ట అని పేరు గడించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సకల ఏర్పాట్లు చేశారంటూ వస్తున్న విమర్శలు కొట్టిపారేయలేం. వరద నీటిలో మునిగిన ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి రాజకీయ బేరసారాల్లో పాలకులు మునిగిపోవడం క్షంతవ్యం కాదు. సర్వత్రా విమర్శలు రావడంతో అస్సాం ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని వాగ్దానం చేస్తూ గురువారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒట్టి ట్వీట్‌తో సరిపెట్టడం గమనార్హం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి అస్సాం ప్రజలను కాపాడాలి. ఒడ్డు ప్రాంతాలు కోతలకు గురై బ్రహ్మపుత్ర, బరాక్ విస్తీర్ణం క్రమంగా పెరుగుతూవుండటం, నీటి పారుదల లేకపోవడం, ప్రణాళిక రహిత పట్టణాభివృద్ధి, కొండ కోతలు, అటవీ నిర్మూలన కారణంగా ప్రతియేటా వరదలకు గురౌతున్న అస్సాంలో ప్రాణ, ఆస్థి నష్టాలను తగ్గించే శాశ్వత పరిష్కార చర్యలకు ప్రభుత్వాలు నడుం బిగించాలి.