కావాల్సిన పదార్థాలు:
కంద ముక్కలు - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయలు - మూడు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - కట్ట, కారం - టీస్పూను, పసుపు - పావు టీస్పూను, ఉప్పు - తగినంత, బెల్లం - సరిపడినంత, చింతపండు - చిన్న నిమ్మకాయంత, ధనియాల పొడి - ముప్పావు టీస్పూను, జీలకర్ర పొడి - పావు టీస్పూను, ఆవాలు - అర టీస్పూను, మెంతులు - పావు టీస్పూను, జీలకర్ర - అర టీస్పూను, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం:
- కంద చెక్కు తీసి ముక్కలుగా తరగాలి.
- ఎక్కువ నీళ్లతో ఉడికించి, నీళ్లు వంపేసి పక్కనుంచాలి.
- చింతపండు రసం తీసి పెట్టుకోవాలి.
- పాన్‌లో నూనె పోసి, కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించాలి.
- అందులోనే ఉడికించిన కంద ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, బెల్లం, ఉప్పు వేసి, రెండు నిమిషాలు పెద్ద మంట మీద వేగించాలి.
- తర్వాత చింతపండు రసం పోసి, మంట తగ్గించి కొద్దిసేపు ఉడికించాలి.
- అందులోనే ఒకటిన్నర లేదా రెండు కప్పుల నీళ్లు పోసి మీడియం మంట మీద మరికాసేపు ఉడకనివ్వాలి. పులుసు చిక్కబడిన తర్వాత కొత్తిమీర చల్లి, పొయ్యి మీద నుంచి దింపేయాలి.
- వేడి అన్నం లేదా చపాతీలోకి కమ్మగా ఉంటుంది.