Oct 15,2023 08:10

ఒళ్ళంతా ఒకటే నొప్పులు. కాలు కదల్చితే మోకాళ్ళ నొప్పులు. వంగుతుంటే నడుంనొప్పి, కొద్దిగా ఆహారం తీసుకోవడం ఆలస్యమైతే కడుపునొప్పి, తలనొప్పి. ఇలా అన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి. అవునులే నా వయసిప్పుడు పదహారే అనుకుంటున్నానో.. ఏమో! 75 సంవత్సరాలు వచ్చాయి. అది మరచిపోతే ఎలా అని అనుకున్నాను.
ప్రస్తుతం ఇంట్లో ఒక్కడినే ఉండాల్సి వస్తుంది. పనిమనిషి వచ్చి, వంటావార్పూ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి నిన్న మొన్నటి పప్పు మిగిలితే రసంలో వేసేస్తుంది. ఇంకోసారి రసంలో పప్పు కలబోసేసేది. ఆ వంటలు రుచి కూడా ఉండవు. గతిలేక అవే వంటలు తినాల్సి వస్తుంది. ఇక బయటి ఆహారం కల్తీల మయం.
అసలే ఒంట్లో షుగర్‌ ఉంది.. బయటి ఆహారం తినలేను. ఏదో పనిమనిషి చేసింది తినేసి కొడుకుకి, కోడలికి ఫోన్‌ చేసి మాట్లాడేవాణ్ణి. ఈ మధ్య వాళ్ళు కూడా ఏ రాత్రుల్లో ఒకటి రెండు మాటలు మాట్లాడేసి పెట్టేస్తున్నారు. ఇక నా కూతురు అల్లుడు కూడా అదే మాదిరి, ఎప్పుడు చూడూ బిజీ. ఏమి కాలమో ఇది? బాగున్నావా నాన్న అని కూడా అడగరు. తీరికలేని వాళ్ళ ఉద్యోగాలతో నేనున్నానని కూడా మర్చిపోతున్నారు.
ఇక మిగిలిన సమయమంతా ఇంటికి దగ్గర్లో ఊడలమర్రి చెట్టుకింద నా మిత్రులతో రోజూ కలుసుకుంటుంటాను. అలాగైనా నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవచ్చు అని. అవును ఒంటరివాడిని చేసి కాలం చేసింది నా భార్య మైత్రి.
నాకు పెళ్లయిన మొదట్లో చాలా చులకనగా చూసేవాణ్ణి తనను. అలా కొద్దిరోజులకి మా ఆవిడని వంటింటికి పరిమితం చేసేశాను. తను కూడా పదవ తరగతి వరకూ చదువుకున్నదైనా నా పురుషాహంకారంతో తనని ఏ ఉద్యోగం చెయ్యనివ్వలేదు.
నేనేమో ఉద్యోగానికెళ్లి ఇంటికి తిరిగి వచ్చేవాణ్ణి. ప్రభుత్వ ఉద్యోగమాయె ఇక మా ఆవిడ ఉద్యోగం ఎందుకు చెయ్యాలని మందలించి, ఇంట్లోనే ఉండమని చెప్పాను.
తెల్లవారుతుండగానే నిద్ర లేచి, ఇల్లు శుభ్రం చేసి, వంటలు చేసి అన్నీ సిద్ధం చేసి ఉంచేది. ఆ కల్మషం లేని ప్రేమని ఇప్పుడు పొందలేకపోతున్నందుకు బాధపడుతూనే ఉన్నాను. ఏం చెయ్యాలి! తనా ఒంటరిని చేసింది. పిల్లలు వారి వారి జీవితాలతో బిజీ బిజీ.
వాళ్ళ ఇంటికిపోయి ఉందామంటే కుదరదు అంటారు.. అదే నా మైత్రి బతికి ఉంటే తనని తీసుకెళ్ళేవారేమో..! ఏదో ఒక పని చేసిపెడ్తది కదా అని. అయినా బతికి ఉన్నప్పుడు తెలియని విలువ ఇప్పుడు తెలిసి ఉపయోగమేంటి?
మైత్రి ఏనాడూ నాకు ఎదురు చెప్పలేదు. ఎన్ని కష్టాలు ఉన్నా చెప్పేది కాదు. నా మనసును ఎప్పుడూ కష్టపెట్టలేదు. కానీ నేనే అప్పుడప్పుడు తాగి వచ్చి, ఆ మైకంలో కొట్టేవాణ్ణి. తనని ఒక మనిషిగా కూడా గుర్తించలేదు.
ఒక బానిసలా భావించాను.. అప్పుడే అర్ధాంగిగా గుర్తించి ఉంటే, తనకు వచ్చిన జబ్బు గురించి అయినా చెప్పి ఉండేది. తను దగ్గుతున్నా, జ్వరంతో ఉన్నా పట్టించుకోలేదు. దాంతోపాటు ఊపిరితిత్తుల సమస్య ఉందని తెలీనియ్యలేదు. మలేరియాతో బాధపడుతున్న తను చివరి నిమిషంలో కూడా నాకు ఒక్క మాట చెప్పలేదు. దానికి కారణం కూడా నా ప్రవర్తనే. తనని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు బాధపడతూనే ఉన్నాను ఎప్పుడూ.
ఒకప్పటి జీవిత పొరపాటు నాకు గ్రహపాటైంది. ఇప్పుడు గుణపాఠమైంది. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం? అప్పుడే కళ్ళు తెరవాల్సింది నేను. ఇప్పుడు తినడానికీ కష్టమే, నడవడానికీ కష్టమే, ఏదైనా జరగరానిది నాకు జరిగితే చూసే నాథుడే లేడు.
ఇదే కాబోలు కాలం కాటువెయ్యడం అంటే. చేసిన తప్పులకి కాలమే శిక్షిస్తుంది. మైత్రి జ్ఞాపకాలు ఎన్ని ఉన్నా! తను లేని లోటు మాత్రం ఎవ్వరూ తీర్చలేనిది. ఎన్నోసార్లు నా స్నేహితులు వాళ్ళ భార్యల గురించి గొప్పగా చెప్తుంటే నా మీద నాకే అసహ్యమేసేది.. నా ప్రవర్తనకి అలాగే బాధేసేది.
నా జీవితం ఎలాగూ నాశనం చేసుకున్నా, ఇల్లాలిని దూరం చేసుకుని. ఇప్పుడు నూతన దంపతులు కనపడితే చెప్తూ ఉంటాను. మీరు నాలాగా మారొద్దండి అని. నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి అని. మీ ఇంటి మహాలక్ష్మిని కంటనీరు పెట్టించకండి అని. చివరి వరకు ఈ జీవన యాత్రలో మిగిలేది జంటపక్షులే. పిల్లలకి రెక్కలు రాగానే ఎగిరిపోయి, ఇంకో గూడుని చూసుకుంటారు. మిగిలేది మీరిద్దరే అని చెప్తూ ఉంటాను.
నా కట్టె కాలే సమయం దగ్గరికి వచ్చినట్లుంది. ఎవరు వస్తారో, ఎవరు రారో. చివరికి పిల్లలు మేము రాలేము, చితి పేర్చి కాల్చివెయ్యండి అని చెప్తారో ఏమో.. ఎవరికి ఎరుక.. కాల మహిమ మరి.


- ఆర్‌. నవజీవన్‌ రెడ్డి, 97423 77332