
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్దిక్ కుప్పన్ అరెస్టును సవాలు చేస్తూ.. దాఖలైన బెయిల్ పిటిషన్‌పై స్పందన తెలపాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఎస్‌ఐ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హథ్రాస్ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన కవరేజీ కోసం హథ్రాస్ వెళ్తున్న సమయంలో అక్టోబర్ 5న కుప్పన్‌ను అరెస్టు చేసి యుఎపిఎ చట్టం కింద అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ రాజ్యాంగబద్ధమైన పరిష్కారం కోరుతూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(కెయుడబ్ల్యుజె) ఆర్టికల్ 32 కింద పిటిషన్ దాఖలు చేసింది. ప్రాథమిక హక్కుల అమలు, చట్టపరమైన సహాయం వంటి అంశాలపై విచారణ జరిపించాలని మధుర జిల్లా న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తిని ఆదేశించాని సుప్రీంకోర్టును కోరింది. బెయిల్‌కు సంబంధించి పిటిషన్ కోసం కుప్పన్‌్‌ని కలవడానికి అధికారులు నిరాకరించారని, ఎఫ్‌ఐఆర్‌లో సిద్దిక్ కుప్పన్ పేరు పేర్కొనలేదని, కానీ అక్టోబర్ 5 నుంచి జైల్లో ఉన్నాడని కుప్పన్ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. పిటిషనర్లు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించే బదులు నేరుగా తమనే ఆశ్రయించి ఉండాల్సిందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.