Nov 18,2023 09:38
  • పంట వ్యర్థాలు కాల్చారనీ రైతులు జైలుకు
  • 20 మందిపై కేసులు నమోదు..
  • రూ. 1 లక్ష జరిమానా వసూలు
  • కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల యజమానులపై కేసులేవి?
  • బిజెపి సర్కారు తీరుపై రైతన్నల ఆగ్రహం

లక్నో: యూపీలోని యోగి సర్కారు అక్కడి రైతన్నలపై కఠినంగా వ్యవహరిస్తున్నది. గాలి కాలుష్యానికి కారణమవుతున్నారనే కారణంగా పంట వ్యర్థాలు కాల్చారన్న ఆరోపణలపై పది మంది రైతులను జైలుకు పంపింది. మరో 20 మందిపై కేసులు నమోదు చేసింది. వారి నుంచి రూ. 1 లక్ష వరకు జరిమానా వసూలు చేసింది. మహారాజ్‌గంజ్‌ అధికారులు రైతులపై తీసుకున్న చర్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రైతులన్నలు యోగి సర్కారుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాయు కాలుష్యమనే విషయమే ప్రభుత్వానికి ప్రధాన అంశమైతే.. ఆ కాలుష్యానికి కారణాల్లో ముందు వరుసలో ఉండే పరిశ్రమలపై ప్రభుత్వం చర్యలేవని రైతన్నలు అంటున్నారు. అన్నదాతలపై వేగంగా స్పందించే యోగి సర్కారు.. పరిశ్రమల యజమానుల విషయంలో ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నదని వారు ప్రశ్నిస్తున్నారు.
           కాగా, రైతన్నలు పంట వ్యర్థాలను కాల్చకుండా నిరోధించటంలో విఫలమైన ముగ్గురు లేఖపాల్‌లను అధికారులు సస్పెండ్‌ చేశారు. ''పదేపదే అభ్యర్థనలు, అవగాహన కల్పించినప్పటికీ.. రైతులు మహారాజ్‌గంజ్‌లో పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు. దీంతో రైతులపై చర్యలు తీసుకున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు కనీసం 10 మంది రైతులను అరెస్టు చేశాం. 20 మందికి పైగా కేసు నమోదు చేశాం. శాటిలైట్‌ చిత్రాలను పర్యవేక్షించడానికీ, రైతులను పర్యవేక్షించడానికి మేము ఒక కమిటీని ఏర్పాటు చేసాము. ఎవరైనా దోషులుగా తేలితే చట్టప్రకారం శిక్షార్హులవుతారు'' అని సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్డీఎం) రమేష్‌ కుమార్‌ తెలిపారు. మరోవైపు, మహరాజ్‌గంజ్‌ జిల్లాలో 50 మంది రైతులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వారికి రూ. 5 లక్షల జరిమానా విధించినట్టు సమాచారం.
 

                                                 రైతన్నలకు బాసటగా సిపిఐ (ఎంఎల్‌)

మహరాజ్‌గంజ్‌లోని రైతు అరెస్టులకు వ్యతిరేకంగా సిపిఐ (ఎంఎల్‌) రైతులను సమీకరించింది. వారికి బాసటగా నిలిచింది. సిపిఐ (ఎంఎల్‌) సభ్యుడు హరీష్‌ మాట్లాడుతూ '' పంట వ్యర్థాల దహనం విషయంలో అనవసరంగా రైతుల పరువు తీస్తున్నారు. ఈ వ్యర్థాల దహనం 8 శాతం కాలుష్యానికి మాత్రమే కారణమని అందరికీ తెలుసు. మిగిలిన 92 శాతం పరిశ్రమల వల్ల కలుషితమవుతున్నది. రైతులు, పేదలు సులభమైన లక్ష్యం కాబట్టి ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటోంది. ఏ పరిశ్రమపై కానీ, వ్యాపారవేత్తలపై కానీ ఎటువంటి చర్య తీసుకోదు'' అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. '' పంట వ్యర్థాల దహనం విషయంలో రైతులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం వరిని కొనుగోలు చేయని వారిపై కూడా వరి సేకరణపై కూడా చర్యలు తీసుకోవాలి. వరికి క్వింటాల్‌కు రూ.2,160 ధర నిర్ణయించగా, క్వింటాల్‌కు రూ.550 నష్టంతో రైతులు రూ.1,600కు విక్రయించాల్సి వస్తున్నది. కానీ దీనిని ఎవరు పట్టించుకుంటారు?'' అని ఆయన యోగి సర్కారును ప్రశ్నించారు.