Aug 19,2023 21:47

అత్యవసరంగా విచారించిన బెంచ్‌
గుజరాత్‌ హైకోర్టు తీరుపై తీవ్ర అసంతృప్తి
న్యూఢిల్లీ : గర్భస్రావాన్ని చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అత్యాచార బాధితురాలు పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ బెంచ్‌ శనివారం అత్యవసరంగా సమావేశమైంది. దాదాపు 28వారాల గర్భమైనందున దాన్ని తొలగించుకోవడానికి అనుమతి కావాలని బాధితురాలు కోరారు. గుజరాత్‌ హైకోర్టు ఆమెకు అనుమతిని నిరాకరించడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌లతో కూడిన బెంచ్‌ శనివారం ఉదయం అత్యవసరంగా సమావేశమైంది. తన క్లయింట్‌ను అబార్షన్‌ చేయించుకోవాల్సిందిగా మెడికల్‌ బోర్టు సిఫార్సు చేసిందని పిటిషనర్‌ తరపు న్యాయవాది శశాంక్‌ సింగ్‌ చెప్పారు. అబార్షన్‌ కోసం చేసిన అభ్యర్ధనను గుజరాత్‌ హైకోర్టు తోసిపుచ్చింది.
ఆమె గర్భం పరిస్థితి ఎలా వుందీ, అలాగే ఆమె ఆరోగ్యం ఎలా వుంది వంటి విషయాలను నిర్ధారించేందుకు మెడికల్‌ బోర్టును ఏర్పాటు చేయాలని ఆగస్టు 8న హైకోర్టు ఆదేశించిందని న్యాయవాది చెప్పారు. 10వ తేదీన మెడికల్‌ కాలేజీ నివేదిక కూడా అందజేసింది. 11వ తేదీన కోర్టుకు ఆ నివేదిక అందినా 12 రోజులు ఆలస్యంగా 23వ తేదీన దానిపై కోర్టు విచారణకు నిర్దేశించడం వింతగా వుందన్నారు. ఈ కేసులోని వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో రోజు జాప్యం కూడా చాలా కీలకమైనదన్న విషయం విస్మరించినట్లు వున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 17వ తేదీన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చినట్లు కేసు స్టేటస్‌లో తెలుస్తోందని, కానీ తోసిపుచ్చడానికి కారణం కూడా చెప్పలేదని, పైగా కోర్టు ఆదేశాలు ఇంతవరకు హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ కాలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది తమ దృష్టికి తెచ్చినట్లు బెంచ్‌ పేర్కొంది. 12 రోజులు ఆలస్యంగా విచారణ జరపాలని గుజరాత్‌ హైకోర్టు ఎందుకు నిర్ణయం తీసుకుందో తెలియడం లేదంటూ సుప్రీం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఈ కారణంగా ఎన్నో విలువైన రోజులు వృధా అయ్యాయి? అని జస్టిస్‌ నాగరత్న వ్యాఖ్యానించారు. తిరిగి తాజాగా వైద్య పరీక్షలు జరిపి నివేదిక అందజేయాల్సిందిగా బెంచ్‌ కోరింది. సోమవారానికి విచారణను వాయిదా వేసింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ (ఎంటిపి) చట్టం ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో 24 వారాల వరకు అబార్షన్‌ చేయించుకోవచ్చు.