మన భారత రాజ్యాంగపు మౌలిక లక్షణాలలో ఫెడరలిజం ఒకటి. ఆనాడు రాజ్యాంగ సభలో ప్రొఫెసర్ కె.టి. షా మన రాజ్యాంగపు పీఠిక లోనే ఈ ''ఫెడరల్'' అనే పదాన్ని, ''లౌకిక'' అనే పదాన్ని చేర్చాలని ప్రతిపాదించారు. అయితే, రిపబ్లిక్ అంటేనే ఫెడరల్, లౌకిక స్వభావం కలిగి వుండేదన్న అర్ధం అంతర్లీనంగా ఉంది గనుక ప్రత్యేకంగా పీఠికలో చేర్చనవసరం లేదని ఆ ప్రతిపాదనను డా. అంబేద్కర్ తోసిపుచ్చారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూలులో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశాలు ఒక జాబితాగా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశాలు మరొక జాబితాగా, రెండింటి పరిధిలోనూ ఉండేవి మూడో జాబితాగా పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో రాష్ట్రాల పరిధిలో ఉండే అంశాలలోకి చొరబడడానికి కేంద్రం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే వుంది. అయితే ఈ ధోరణి ప్రస్తుతం మరింత జోరందుకుంది. అప్రకటితంగానే ఈ దేశాన్ని ఒక కేంద్రీకృత పాలనా వ్యవస్థ కిందకు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ఏమాత్రం అతిశయోక్తి కాదు.
రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా అమ్మకం పన్ను ఉండేది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. దానికి బదులు జిఎస్‌టి వ్యవస్థ లోకి వచ్చేందుకు రాష్ట్రాలను ఒప్పించారు. ఈ జిఎస్‌టి వ్యవస్థ ప్రధానంగా కేంద్రం డామినేట్ చేసే జిఎస్‌టి కౌన్సిల్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇలా జిఎస్‌టి లోకి మారినందున రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గనుక తగ్గితే ఆ మేరకు దానిని కేంద్రం భర్తీ చేస్తుందన్న హామీ ఇచ్చి రాష్ట్రాలను ఒప్పించారు. ఇప్పుడు కేంద్రం చల్లగా ఆ హామీని అటకెక్కించింది. ఇప్పుడు రాష్ట్రాలకు మూడే మూడు వస్తువుల పైన తప్ప తక్కిన వేటిపైనా పన్ను విధించే అధికారం లేకుండా పోయింది. కేంద్రం ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు.
అయితే ఆర్థిక వనరులపై అధికారం మాత్రమే కేంద్రీకృతం అయిందనుకుంటే పొరపాటు. నిర్ణయాధికారాలు కూడా కేంద్రీకృతం అవుతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఉదాహరణకు విద్యారంగాన్ని తీసుకోండి. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. కాని, రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. రాష్ట్రాలు మర్యాదగా దానిని అంగీకరించి అమలు చేయాల్సిందే. అలాగే వ్యవసాయం. ఇది రాష్ట్రాల జాబితాలో ఉంది. కాని కేంద్రం పార్లమెంటులో హడావుడిగా మూడు బిల్లులనూ ఆమోదింపజేసుకుంది. ఇందులో రాష్ట్రాలను సంప్రదించినదీ లేదు. ఈ బిల్లులు దేశంలో ఉన్న వ్యవసాయ విధానంలో చాలా తీవ్రమైన మార్పులను తీసుకువచ్చి రైతాంగాన్ని చాలా దెబ్బతీయడమేగాక, రాష్ట్రాల ఆదాయ వనరులను కూడా దెబ్బతీయనున్నాయి.
రాష్ట్రాల పరిధిలోకి చొరబడడమేకాదు, వాటి ఉనికిని కూడా ఏకపక్షంగా కేంద్రం మార్చివేయవచ్చు. జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాన్ని అక్కడి అసెంబ్లీ ఆమోదం లేకుండానే కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తీరు ఇందుకు దృష్టాంతం. అప్పుడు ఆ రాష్ట్రం గవర్నరు పాలన కింద ఉన్నది కనుక, గవర్నరు ఆమోదం తెలిపారు గనుక రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి రాష్ట్ర ఆమోదం లభించినట్టేనని కేంద్రం అంటోంది. తాము నియమించిన గవర్నరు నుండి ఆమోదం వస్తే అది రాష్ట్రం నుండి వచ్చినట్టేనని చెప్పుకుంటోంది. గవర్నరు ఆమోదం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదంతో సమానం అన్న కేంద్రం వాదన చట్టబద్ధమే అయితే రేపు వేరే ఏ రాష్ట్రాన్నైనా విడగొట్టాలనుకుంటే ముందు దానిని గవర్నరు పాలన కిందకు తెచ్చి ఆ గవర్నరు ఆమోదం తీసుకుని ఆతర్వాత రాష్టాన్ని ముక్కలు చేసేయవచ్చునన్నమాట. ఇలా రాష్ట్రం మనుగడే కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన పరిస్థితి వచ్చిందంటే మనం ఒక కేంద్రీకృత పాలనావ్యవస్థ దిశగా చాలా దూరం వచ్చేసినట్టేనని భావించాల్సి వుంటుంది.
అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో మమేకం అయిపోయిన మన ద్రవ్యపెట్టుబడి-కార్పొరేట్ కూటమితోబాటు హిందూత్వ శక్తులు ఇటువంటి కేంద్రీకృత ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి. అతి కొద్దిమందితో కూడిన ఈ ద్రవ్యపెట్టుబడి-కార్పొరేట్ కూటమి హిందూత్వ శక్తులతో జత కట్టినందున, ప్రస్తుతం వీళ్ళ ఆధిపత్యమే దేశ రాజకీయాలలో కొనసాగుతున్నందున ఈ కేంద్రీకృత వ్యవస్థవైపు అడుగులు త్వరగా పడుతున్నాయి.
మన దేశంలో ప్రతి పౌరుడికీ ద్వంద్వ జాతీయ చైతన్యం ఉంటుంది. మన దేశ పౌరుడు ఏదో ఒక ప్రాంతీయ-భాషా సమూహానికి చెందివుంటాడు. ఒక తెలుగువాడిగానో, బెంగాలీగానో, మలయాళీగానో, తమిళుడిగానో ఉంటాడు. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఒక భారతీయుడిగా కూడా ఉంటాడు. ఈ రెండు రకాల చైతన్యాలూ జాతీయోద్యమకాలంలో పెనవేసుకుని బలపడ్డాయి. అందుచేత స్వాతంత్య్రానంతర కాలంలో ఈ రెండింటినీ సమన్వయం చేసే ఒక రాజకీయ వ్యవస్థ అవసరమైంది. అదే ఫెడరల్ వ్యవస్థ. ఆ విధంగా జాతీయోద్యమం పెంపొందించిన చైతన్యం ఈ ఫెడరల్ రాజ్యాంగం రూపకల్పనలో పాత్ర పోషించింది. ఈ రెండు తరహాల చైతన్యాల నడుమ ఉండే సున్నితమైన సమతుల్యతను నిలబెట్టుకోవాలంటే ఈ ఫెడరల్ స్వభావాన్ని నిలబెట్టుకోవాలి. అతిగా ఒకవైపు నొక్కి కేంద్రీకరణకు పూనుకుంటే అది ప్రాంతీయ-భాషా చైతన్యం గాయపడడానికి, దరిమిలా వేర్పాటుతత్వానికి, ఆఖరుకు దేశం నుండే వేరుపడాలనే డిమాండ్‌కు దారితీస్తుంది.
మన దేశంలో ఉన్న ఈ సంక్లిష్ట పరిస్థితి హిందూత్వ శక్తులకు అర్ధం కావడం లేదు. వాళ్ళకు ఆ జాతీయోద్యమంతో ఎటువంటి సంబంధమూ లేదు. దానికి వాళ్ళు దూరంగానే ఉంటూ వచ్చారు. ఇక భారతదేశం అనేది ఒకే దేశంగా రూపుదిద్దుకునే దశలోనే ఉందన్న వాస్తవమూ వాళ్ళ దృష్టిలో లేదు. ఇదంతా హిందువుల దేశమేనని, ఆ విధంగానే అనాదికాలం నుండీ ఉంటూ వస్తోందని వాళ్ళు అనుకుంటున్నారు. అందుచేతనే ప్రాంతీయ-భాషా చైతన్యాన్ని గుర్తించకపోగా కొట్టిపారేస్తారు. ఈ ప్రాంతీయ-భాషా చైతన్యాన్ని ఒక జాతీయ చైతన్యంగా పెంపొందించే బదులు ''ఒకే భాష'', '''ఒకే సంస్కృతి'' వంటి విధానాలను పైనుండి రుద్ది బలవంతంగా ఏకరూపతను సాధించాలని చూస్తారు. ఈ విధమైన, ఊహాజనితమైన ఐక్యతను గనుక వ్యతిరేకిస్తే అటువంటి వారంతా దేశద్రోహులని ముద్రవేస్తారు. అందువల్లనే హిందూత్వ శక్తులు రాజ్యాంగ ఫెడరల్ స్వభావాన్ని వ్యతిరేకిస్తారు. ఈ వ్యతిరేకత కేవలం వారి రాజకీయ అవసరాల నుండి, తక్షణ ప్రయోజనాల నుండి మాత్రమే వచ్చినది కాదు. కేంద్రీకృత మత రాజ్యంగా ఈ దేశాన్ని మార్చివేయాలన్న వారి సిద్ధాంతం నుండి కూడా వచ్చింది.
ఇక ద్రవ్యపెట్టుబడి-కార్పొరేట్ అల్ప సంఖ్యాక కూటమికి కూడా ఈ ఫెడరలిజం అక్కరలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం వారి గుప్పెట్లో ఉండాలని వారు కోరుకుంటున్నారు. అలా జరగాలంటే రాజ్య వ్యవస్థ మొత్తం కేంద్రీకృతం కావాలి. గుత్తపెట్టుబడి పెత్తనానికి కేంద్రీకృత వ్యవస్థ కీలకమైన ఆయుధం. అయితే ఈ సూత్రం అన్ని దేశాలలోనూ, అన్ని కాలాల్లోనూ ఒకేలా వర్తించదు. ఈ ద్రవ్యపెట్టుబడి-కార్పొరేట్ కూటమి ఒకానొక దేశంలో ఆధిపత్యం చెలాయించడానికి అక్కడున్న కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న శక్తులు అవరోధంగా ఉన్నప్పుడు ఈ కూటమి అధికారాలు మరింతగా రాష్ట్రాలకు వికేంద్రీకరించాలని వత్తిడి చేస్తాయి. అంతేగాక, వేర్పాటువాదాన్ని, దేశం నుండి విడిపోవాలనే వాదాన్ని బలపరుస్తాయి. తద్వారా విడిపోయి బలహీన పడిన ప్రాంతాలపైన తమ ఆధిపత్యాన్ని సాధిస్తాయి. ఇందుకు యుగోస్లావియా అనుభవమే ఉదాహరణ. ఐక్య యుగోస్లావియాలో అంతర్భాగంగా ఉండిన సెర్బియా నాజీ వ్యతిరేక పోరాటంలో ముందుంది. ఆ ప్రజలు జర్మన్ పెట్టుబడిదారుల దురాశను బాగా గ్రహించారు. సెర్బియా యుగోస్లావియాలో అంతర్భాగంగా ఉన్నంతకాలం జర్మన్ పెట్టుబడిదారులు ఆ దేశంపై ఆధిపత్యం సాధించలేరు. అందుకే వారు యుగోస్లావియా ముక్కలు చెక్కలు కావడానికి వీలుగా వేర్పాటు ఉద్యమాలను ప్రోత్సహించారు.
అదే ఒక దేశంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే ద్రవ్యపెట్టుబడి-కార్పొరేట్ కూటమి ప్రయోజనాలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ కూటమి వైఖరి వేరుగా ఉంటుంది. కేంద్రమే వారి చెప్పుచేతల్లో ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాలలో ఉండే రకరకాల ప్రభుత్వాలతో వ్యవహారాలు నడపడం వారికి అనవసరమైన తలనొప్పి అవుతుంది. ఒక్కో రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం ప్రాజెక్టు కాంట్రాక్టులను ఆ రాష్ట్రానికే చెందిన స్థానిక పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని చూడవచ్చు. లేదా ప్రభుత్వ రంగానికి అప్పజెప్పవచ్చు. ప్రాజెక్టుల కోసం తీసుకునే భూములకు ఎక్కువగా నష్టపరిహారం నిర్ణయించవచ్చు. అటువంటి నిర్ణయాలు ఈ కూటమికి ఇబ్బంది కదా. అదే మొత్తం కేంద్రీకృత పాలనా వ్యవస్థ ఉంటే ఇటువంటి చిక్కులేమీ ఉండవు.
తాజాగా వ్యవసాయ బిల్లులనే తీసుకోండి. వీటిని రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో గనుక ప్రవేశపెడితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా దానికి సవరణలు, మార్పులు వస్తాయి. అలా జరిగితే ఈ కార్పొరేట్లకు ఎంత చిక్కు వస్తుందో ఆలోచించండి. అందుకే రాజ్యాంగాన్ని తోసిరాజని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దారు. ఇలా చేయడం చట్టరీత్యా చెల్లుతుందా లేదా అన్న చర్చ ఉంది. అయితే ప్రస్తుతం మన దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఎంత చక్కగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం కదా.
అటు హిందూత్వ శక్తులు, ఇటు ద్రవ్యపెట్టుబడి-కార్పొరేట్ అల్ప సంఖ్యాక కూటమి ఇలా కూడబలుక్కున్నాక ఇక పాలనా వ్యవస్థను కేంద్రీకృతం చేసే ప్రక్రియ వేగంగా సాగడంలో ఆశ్చర్యమేమీ లేదు. కేవలం రాజకీయ, ఆర్థిక అంశాలకు మాత్రమే ఈ కేంద్రీకరణ పరిమితం కాదు. సాంస్కృతిక రంగంలో, విద్యా రంగంలో సమాంతరంగా ఈ కేంద్రీకరణ సాగుతోంది. హిందీయేతర రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నంనుంచి ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు కనపడుతోంది. కాని ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తుంది. నూతన విద్యా విధానంలో బోధనాంశాలను మొత్తంగా కేంద్రీకృతంగానే నిర్ణయిస్తారు. రాష్ట్రాలను సంప్రదించవలసిన అవసరం లేదు. అందుచేత ''ఒకే సంస్కృతి'' పేరుతో బలవంతంగా ఈ దేశంలోని భిన్నత్వాన్ని నాశనం చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి.
బలవంతంగా పైనుండి రుద్దే ఈ ''ఏకరూపత'' వలన మన దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వుంటుంది. వైవిధ్యం కలిగిన ప్రాంతీయ-భాషా చైతన్యాన్ని గనుక ఉపేక్షిస్తే అది ఈ దేశ భవిష్యత్తునే ప్రమాదం లోకి నెడుతుంది.
(స్వేచ్ఛానుసరణ)

- ప్రభాత్ పట్నాయక్










