
'పట్టిన ముసురు వదలనట్టు లోకంలోని ఆకలంతా మాలాంటి ఇళ్ళ ముందే తిష్టేసుకు కూచుంది. ఉన్నవాళ్ళు ఏదో ఒకటి తింటారు. మా బతుకులే కాలే కడుపులతో ఇలా చూరుపట్టుకు వేలాడుతున్నాయి. మనిషికి కష్టాలొస్తాయి. లోకమంతా కష్టాలు రావటం ఇప్పుడే చూస్తున్నాం' లాక్ డౌన్ తలుచుకుంటూ బాధపడుతోంది రాములమ్మ.
''అమ్మా ఆకలే'' నకనకలాడుతున్న కడుపు పట్టుకుని ఏడుస్తూ తల్లి వైపు చూశాడు ఐదేళ్ళ రాము.
''కాసేపాగు అన్నం వండి పెడతాను'' ప్రేమతో కొడుకుని చేతుల్లోకి తీసుకుని అంది రాములమ్మ.
కొడుకు దిగులు చూపులుచూసి కాదనలేక అప్పటికి ఏదో అనేసిందిగానీ ఇంట్లో చూస్తే బియ్యం నిండుకున్నాయి. ఏపూటకాపూట గడుపుకునేవాళ్లకి సరుకులు నిల్వ ఉండవు. ఏం చేయాలో రాములమ్మకి అర్థం కాలేదు.
''సెంటర్లో బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నారట, వెళ్దాం వస్తావా?'' పక్కవాటా పార్వతమ్మ గుమ్మం ముందు నిలబడి, రాములమ్మని పిలిచింది.
''హమ్మయ్యా! సమయానికి ఎంత చల్లని కబురు మోసుకొచ్చావు తల్లీ! కాలిపోతున్న ఆకలి కడుపులకి ఊరటనిచ్చే మాట చెప్పావు'' ఊపిరి పీల్చుకుని పార్వతమ్మ వెంట నడిచింది రాములమ్మ.
సెంటర్లో ఓ వందమంది పేదలు, రోజుకూలీలు బిర్యానీ పేకెట్ల కోసం లైన్లో దూరం దూరంగా నిలబడి ఉన్నారు. వాళ్ళతోపాటు రాములమ్మ, పార్వతమ్మ అక్కడ లైన్లో నిలబడ్డారు. లైను మెల్లగా కదులుతోంది. తమవంతు వచ్చేవరకూ లైన్లో నిలబడి ఎదురుచూస్తున్నారు. అక్కడకు అప్పటికే వాళ్ళొచ్చి గంటపైగా అయింది.
నడినెత్తి మీద సూర్యుడు భగభగ మండుతున్నాడు. ఇంట్లో చూస్తే పిల్లాడు ఆకలితో విలవిల్లాడి పోతున్నాడు. ఇక్కడ ఇచ్చే బిర్యానీతోనే వాడి ఆకలి తీరాలి. ముఖాన కారుతున్న చెమటను చీరచెంగుతో తుడుచుకుంటూ లైన్లో మెల్లగా కదులుతోంది రాములమ్మ. లైను దగ్గర పడింది. వాళ్ళిచ్చిన బిర్యానీ ప్యాకెట్ తీసుకుని, ఆఘమేఘాల మీద అడుగుల వేగం పెంచుకుంటూ పార్వతమ్మతో పాటు ఇంటికి చేరుకుంది రాములమ్మ.
ఆకలితో ఏడ్చి ఏడ్చి రాము అప్పటికే నిద్రపోయాడు. కంగారుగా వచ్చి వాడిని లేపి, ప్యాకెట్లో ఉన్న బిర్యానీని ముద్దలు చేసి తినిపించింది. కడుపు నిండా తిని రెండు రోజులైందేమో నాలుగోవంతు బిర్యానీ ఆబగా తినేశాడు రాము.
''అమ్మా నువ్వు తినవే?'' అంటూ తల్లికేసి చూశాడు రాము.
''తింటాలేరా.. ముందు నువ్వు పడుకో'' అని అందులో కొంత బిర్యానీ కంచంలో వేసి, మామ నారాయణకు పెట్టింది.
''ఏమ్మా రాంబాబు కబుర్లు ఏమైనా తెలిసాయా?'' కొడుకుని తలుచుకొని అడిగాడు నారాయణ.
''లేదు మామా ఎప్పుడొస్తాడో తెలీదు'' రాములమ్మ చెప్పిన మాట వినగానే.. ఏమనుకున్నాడో ఏమో తింటున్న అన్నం మధ్యలోనే వదిలేసి, చేతులు కడిగేసుకున్నాడు నారాయణ.
లాక్‌డౌనులో చిక్కుకుపోయిన కొడుకు మీద బెంగ నారాయణకి ఇంకా పోలేదు.
''అమ్మా నాన్న ఎప్పుడొస్తాడే. వచ్చినప్పుడు నాకోసం ఇమానం తెస్తానన్నాడే!'' విమానం ఎప్పుడు తెస్తాడా అని ఎదురుచూస్తూ ఆత్రంగా తల్లిని అడిగాడు రాము.
''అక్కడ మీనాన్న తిన్నాడో లేదోనని నేను బెంగ పడుతుంటే మధ్యలో నీకు విమానం బొమ్మ కావాలేరా?'' కొడుకు మీద చిరాకుపడింది రాములమ్మ.
మళ్ళీ అంతలోనే తనలో తానే అనుకుంది. 'వాడు ఏమడిగాడు. చిన్న ఇమానం బొమ్మ అడిగాడు. ఉన్నోళ్ళ పిల్లలు ఊరంతేసి బొమ్మలతో ఆడుకుంటారు. వాడు ఆకాశంలో ఎప్పుడు ఇమానం చూడకపోయినా బొమ్మలో ఇమానం చూసుకుంటానని అడిగాడు అంతేగా!' అంటూ నారాయణ నిట్టూర్చాడు.
''నీ అయ్య నీ కోసం ఇమానం తెస్తాడులేరా! బెంగపెట్టుకోకు!'' వాడికి దగ్గరగా వెళ్ళి చిన్నబుచ్చుకున్న కొడుకుని ఓదార్చింది రాములమ్మ.
'మిగిలిన బిర్యానీ ఇప్పుడు నేను తినేస్తే రాత్రికి వీళ్ళకేం పెట్టాలి?' మనసులో అనుకుంటూ బిర్యానీని గిన్నెలో వేసి, రాత్రికి దాచింది రాములమ్మ. ఆపూటకి మంచినీళ్ళు తాగి, పడుకుంది.
లాక్‌డౌను మొత్తం ప్రపంచాన్నే ఎక్కడ వాళ్ళనక్కడ కట్టిపడేసింది. కరోనా కాటుకి మనుషులంతా కుదేలైపోయారు. కూలి పనులకు వెళ్ళిన రాంబాబు హైదరాబాదులో చిక్కుకుపోయాడు. అక్కడ ఉండలేడు.. ఇక్కడకు రాలేడు. ఉగాదికి ఊరొచ్చేస్తాడనుకుంటే ఇంతలో కరోనా చుట్టుముట్టేసింది.
'లాక్‌డౌను పెట్టకపోయుంటే ఉగాది ముందే ఊళ్ళో ఉండేవాడు. ఇంతలో ఈకష్టమొచ్చింది' భర్తను తలుచుకుని, వాపోయింది రాములమ్మ.
***
హైదరాబాదులో అదొక పెద్ద కల్యాణమండపం. వలసకూలీలతో ఆ ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. సమయానికి ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి అక్కడ టిఫిను, భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏదో ఆకలి తీర్చుకోవటానికి తింటున్నారే తప్ప వాళ్ళ దృష్టి తిండిమీద లేదు. రాత్రి చీకటి పడగానే మొక్కుబడిగా నిద్రపోతున్నారేగానీ మనసారా వాళ్ళు నిద్రపోయి చాలా రోజులైంది.
వాళ్ళ మనసుల్లో ఒకటే మాట వినిపిస్తోంది. 'ఈ చెర నుండి తప్పించుకుని, ఎంత వేగంగా ఊరుపోదామా అని. లాక్ డౌనులో అందరినీ ఒకచోట పెట్టి, కాళ్ళు చేతులు కట్టేశారు. పారిపోదామంటే దారి లేదు. పైగా పోలీసుల పహారా ఒకటి!'
''కష్టపడకుండా ఇలా కూడు తినాలంటే బాధగానే ఉంది'' ఒక కూలీ మాట.
''ఒకరు పెడుతుంటే ఎంతకాలం మనం తినేది'' మరో కూలీ మాట.
''దీనికి పరిష్కారం వెదకాలి'' ఇంకో కూలీ మాట.
''ఊరొదిలి ఏడాది అవుతోంది?'' రాంబాబుకి భార్యాపిల్లలు గుర్తొస్తున్నారు.
''ఇక్కడ ఇంకా ఈ బాధలు పడలేం. నేను ఓ నిర్ణయానికి వచ్చాను. కాలి నడకన ఊరుకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను'' రాంబాబు ఆ మాట అన్నాడో లేదో మిగతా పదిమంది మేమూ వస్తామంటూ రాంబాబుతో చేతులు కలిపారు.
***
ఫోన్ మోగేసరికి ఆలోచనలోంచి తేరుకుని, సెల్‌ఫోన్ అందుకుంది రాములమ్మ.
''ఎలా ఉన్నారు?'' అడిగాడు రాంబాబు.
''బతకలేక చావలేక మధ్యలో ఉన్నాం. వాళ్ళు వీళ్ళు ఇచ్చిన అన్నం పాకెట్లు తింటూ ఇలా ఉన్నాం'' అనగానే రాంబాబు వాళ్ళ పరిస్థితి తలుచుకుని బాధపడ్డాడు.
మళ్ళీ అంతలోనే ''పోలీసుల కళ్ళుకప్పి, పదిమందితో కలిసి కాలినడకన ఊరొస్తున్నాం. నడిచి నడిచి కొద్దిరోజుల్లో ఊరు చేరుకుంటాం. అంతవరకూ ధైర్యంగా ఉండండి'' చెప్పాడు రాంబాబు.
ఈ మాట వినగానే రాములమ్మ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మనిషంతా నిలువునా వణికిపోయింది.
అంతదూరం నడిచి రావడం మామూలు విషయం కాదు. అలా రావటం రాములమ్మకి కూడా ఇష్టం లేదు. ''వద్దొద్దు నడిచి రావద్దు. ఈ మాట మీ అయ్య వింటే ఏమైనా ఉందా? అంతెత్తున ఎగురుతాడు. అంతా సర్దుకున్నాక పోలీసులు అక్కడ నుంచి మిమ్మల్ని పంపేదాక ఊరుకి రావద్దు. అప్పటివరకు ఆ విషయం మర్చిపోండి'' భయంతో విలవిల్లాడిపోయింది రాములమ్మ.
''నువ్వేమీ కంగారుపడకు. నేనొచ్చేవరకు ఈ విషయం నాన్నతో చెప్పొద్దు.'' రాంబాబు ఓ నిర్ణయం తీసుకుంటే ఎవరు చెప్పినా వినడని నిశ్చయించుకున్న రాములమ్మ ''సరే జాగ్రత్త్త'' అంటూ ఫోన్ ఆఫ్ చేసింది.
''రాంబాబు ఎలా ఉన్నాడు, ఎప్పుడొస్తాడు'' ఆత్రంగా అడిగాడు నారాయణ.
''బాగానే ఉన్నాడు. బస్సులు తిరిగితే వస్తాడు!'' చెప్పింది రాములమ్మ.
''బస్సులు తిరిగేదెప్పుడు? వాడొచ్చేదెప్పుడు? మన చీకటి బతుకులు తెల్లారేదెప్పుడు?'' నిర్వేదంగా అన్నాడు నారాయణ.
''రేపు ఒకటో తారీకు కోటా బియ్యమిస్తారు, రెండువారాలు గడిచిపోతాయి. నీ పించెను కూడా ఈలోగా వస్తుంది. ఇంటిఖర్చులు దాటిపోతాయి.'' రాములమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా ఆశాదీపాలు వెలిగాయి.
''అప్పటిదాకా రాంబాబు ఊరు రాడంటావా?'' నారాయణ మొహం అప్పటికే పాలిపోయి ఉంది.
''బస్సులు తిరిగితే కదా వచ్చేది'' మామకు నచ్చజెప్పింది రాములమ్మ.
''రాంబాబు అక్కడ ఏం తింటున్నాడో ఏమో?'' కొడుకు గుర్తుకు రాగానే నారాయణ కళ్ళు చెమ్మగిల్లాయి.
''వలస కూలీలందరినీ ఒక శిబిరంలో ఉంచారట. గూడు ఇచ్చేవాళ్ళు కూడు పెట్టరా! అక్కడన్నీ బాగానే ఉన్నాయట'' పైకి అలా అనేసిందిగానీ రాంబాబు గురించి మనసులో ఆందోళన పడుతోంది రాములమ్మ.
***
హైదరాబాదు వలసకూలీల శిబిరం నుంచి తన బ్యాచ్‌తో ఊరుకి బయలుదేరాడు రాంబాబు. మధ్యమధ్యలో ఆగుతూ పోలీసుల కళ్ళుకప్పి, నడక సాగినంత మేర వాళ్ళు నడుస్తూనే ఉన్నారు.
దొరికినచోట ఏదో ఒకటి తిని, దాతలు పెట్టే ఆహారం రాత్రికి దాచుకుని, పాదాలు అరిగేదాక వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. దాహమేస్తే నీళ్ళు, ఆకలేస్తే దొరికిందేదో తిని, నిద్రొస్తే ఎక్కడో ఒకచోట కళ్ళు మూసుకుంటున్నారు.
వేకువ రాకముందే మళ్ళీ కాళ్ళకి పనిచెప్తూ పొడవాటి దారులు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు.
నడిచి.. నడిచి.. అలసిన దేహాలు మధ్యలో ఎక్కడైనా కుళాయి కనిపిస్తే ప్రాణం లేచొచ్చి దాహార్తి తీర్చుకుని, అక్కడికక్కడే ఒళ్ళు కడిగేసుకుని, వాళ్ళ పాదయాత్ర సాగుతూనే ఉంది.
వాళ్ళ ఆలోచన ఒకటే. ఊరు చేరుకోవాలి. ఊపిరి ఉన్నప్పుడే ఊరు చేరుకోవాలి. భార్యబిడ్డలు, ముసలి తల్లిదండ్రులు కళ్ళ ముందు కలలా కదులుతున్నారు. కల నిజమయ్యే లోపు ఊరు చేరుకోవాలి.
ఎంత కాలమైనా, ఎన్ని గాయాలైనా ఊరు చేరుకోవాలి. ఊరు చూస్తే చాలు ఊపిరి వచ్చినట్టే. కదిలే పాదాలు, కదలని పాదాలు, అవిటి పాదాలు, అలసిన పాదాలు, చీలిన పాదాలు, బొబ్బలెక్కిన పాదాలు, నలిగిన పాదాలు, నడవలేని పాదాలు అన్నీ కట్టకట్టుకుని.. కసితీర ముందుకు పోతున్నాయి. నడవడానికి సహకరించని కాళ్ళను, ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న కాళ్ళను తట్టిలేపి, కాలిబాట మీదకు మళ్ళించాడు రాంబాబు.
పట్నంలో బిర్యానీ తినడం కన్నా ఉన్న ఊళ్ళో ఉప్మా తినడం మేలు.
బతికుంటే చాలు, ముందు ఈ నరకం నుండి బయటపడాలి. మనుషుల్లో నీరసం ఆవరించినా మనసు ధైర్యంగానే ఉంది. ఆ ధైర్యమే వాళ్ళను ముందుకు నడిపిస్తోంది.
నడవలేను మొర్రో అంటూ మొరాయించిన కాళ్ళను, ఊపిరిపోసుకున్న గుండెతో ధైర్యం చెప్పించి, ముందుకు నడిచాడు రాంబాబు.
బొబ్బలెక్కిన పాదాలను, చిమ్ముతున్న రక్తపు చారికలను చేతితో తుడిచేసి.. గమ్యస్థానం వైపు నడుస్తున్నాడు రాంబాబు. చీలిన పాదాల నుండి బొటబొట కారుతున్న రక్తపుటేరులు దాటుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు రాంబాబు.
రాంబాబు ఇప్పుడు అన్నీ వదిలేసి ఒకటే ధ్యేయంతో ముందుకుపోతున్న వలసజీవి. ఎండ, వాన, బరువు, బాధ, సుఖం, దు:ఖం పక్కనపెట్టి.. కనుచూపు మేర వెలుగు వెళ్ళే చోటుకి కాళ్ళీడ్చుకుంటూ సాగిపోతున్నాడు.
ఊరు కన్నతల్లి, ఒక జ్ఞాపకం. ఊరు దగ్గర పడుతున్న కొద్దీ రాంబాబులో ఏదో చైతన్యం ఆవరించింది. మొహం పీక్కుపోయినా, గడ్డం పెరిగినా, తల చెదిరిపోయినా, దుస్తులు నలిగిపోయినా భౌతిక సుఖాలు, ప్రాపంచిక సరదాలు అన్నీ వదులుకుని, కొనఊపిరి ఆడేలోపు ఊరు చేరుకోవాలనే బలమైన కోరికే రాంబాబుని ఆ దిశగా నడిపిస్తోంది.
కాళ్ళకు బలపాలు కట్టుకుని, వాళ్ళు ఊరి పొలిమేరకొచ్చేశారు. నడిచి నడిచి అలసిపోయి తూలుతున్న రాంబాబు గుండెమూలలో దాచుకున్న చివరి ఊపిరి శకలాన్ని ఒక్కసారిగా పాదాల అంచుల నుండి దేహం పైవరకూ బలంగా పీల్చి.. ఆ నీడలో ఊరిని చూసి, గర్వంగా నిలబడ్డాడు.
'ఊరు ఇప్పుడు ఊరులా లేదు. ఊరు తీరు మారిపోయింది. సడి లేదు, జన సంచారమూ లేదు. అర్ధరాత్రి వరకూ ఊరు మేలుకొనే ఉండేది. ఇప్పుడు ఊరుకేమయింది?'.
ఎక్కడో వల్లకాటిలో ఉన్నట్టు భారంగా అడుగుతీసి, అడుగు వేస్తున్నాడు రాంబాబు.
'ముళ్ళకంచెతో ఊరంతా దిగ్బంధనం చేసేశారు. ఏ విషపు కాటు పడకుండా ఊరుని నెత్తి మీద మోస్తున్నారు. ఊరు జనం నిద్రహారాలు మాని, విషపుపురుగు లోనికి రాకుండా కాపలా కాస్తున్నారంటే, ఇలాంటి ఊరును వదలి ఎక్కడో దరిలేని లోకానికి పోయాను.' అనుకుంటూ..ఊరు చేరుకున్న ఆనందంలో ముందున్న ముళ్ళకంచెలు ఛేదించుకుని, తడబడుతున్న అడుగులతో ఇంటివైపు నడిచాడు రాంబాబు.
నడిరాత్రిలో నిద్రపోతున్న నిశ్శబ్దంలా ఉంది ఇల్లు.
టక్...టక్...టక్...
''ఎవరు, ఇంత రాత్రివేళ?..పట్టక పట్టక ఈ వేళకి నిద్రపడితే ఇలావచ్చి తలుపు కొట్టిందెవరు?'' తలుపు తీసిన రాములమ్మ కనుచీకటిలో రాంబాబుని అంత సులువుగా గుర్తు పట్టలేకపోయింది.
''నేను...'' రాంబాబు మాట నీరసంగా ఉంది.
లైటు వేశాక రాంబాబు వైపు తేరిపార చూసి ''ఇలా అయిపోయావేటి?'' బ్యాగు అందుకుని, రాంబాబు చెయ్యి పట్టుకుని నెమ్మదిగా లోనికి తీసికెళ్ళింది రాములమ్మ.
''నా రాంబాబు వచ్చేశాడా?'' పడుకున్న నారాయణ లేచి అన్నాడు.
''నాన్నా! ఇంకా పడుకోలేదా? రాంబాబు మాట పీలగా ఉంది.
''లాక్‌డౌను పెట్టినకాడ నుంచి నువ్వెప్పుడు ఇంటికొస్తావా అని ఎదురుచూస్తూ నిద్ర సంగతే మరిచిపోయాడు మీ అయ్య'' రాంబాబు మొహం తడుముతూ అంది రాములమ్మ.
''రాంబాబు ఇలగయిపోయావేట్రా!'' కొడుకుని పట్టుకుని, కళ్ళు చెమర్చాడు నారాయణ.
''ఇంటికొచ్చేసాడుగద నీ కొడుకు. ఇక వల్లకుండు'' సర్దిచెప్పింది రాములమ్మ.
''ఎప్పుడు తిన్నాడో ఏమో, రాంబాబుకి ఏదైనా పెట్టమ్మీ'' కొడుకు మీద ప్రేమ చంపుకోలేక కోడలితో అన్నాడు నారాయణ.
''ఉండు అన్నం పెడతాను'' అంటూ రేపటికి ఉంచిన గంజన్నంలో అంత ఉప్పేసి అన్నం తినిపించి, అడుగునున్న గంజి రాంబాబుతో తాగించేసింది రాములమ్మ.
రాంబాబు మనసు ఇప్పుడు కుదుటపడింది. ఊపిరి చల్లగా కొట్టుకుంటుంది. ఎదురుగా అందరూ కనబడేసరికి రాంబాబుకు ప్రాణం లేచొచ్చింది.
వాళ్ళ అలికిడికి పడుకున్న రాము లేచి ''నాన్నొచ్చాడు నాన్నొచ్చాడు'' అంటూ రాంబాబుని చుట్టేశాడు.
''నాకే బొమ్మలూ వద్దు. నాన్నొచ్చేశాడు! నాన్న పక్కనుంటే నాకదే చాలు'' పాలిపోయిన రాంబాబు మొహం చూసి, చలించిపోయాడు రాము.
'నాన్నొస్తే తనకోసం ఇమానం బొమ్మ తెస్తాడని ఎన్నో కలలుగన్న రాము రాంబాబుని చూసేసరికి కలలన్నీ మనసులోనే చంపేసుకున్నాడు!' కొడుకులో వచ్చిన మార్పుని చూసి మనసులో అనుకుంది రాములమ్మ.
అంత నీరసంలో కూడా బ్యాగు తెరిచి, విమానం బొమ్మ తీసి కొడుకు చేతికిచ్చాడు రాంబాబు.
విమానం బొమ్మ చూసి రాము కళ్ళు అంతలేసి చేసి ''నాన్న ఇమానం తెచ్చాడోచ్!'' అంటూ ఆ బుల్లి విమానాన్ని అమ్మకి, తాతకి చూపించి మురిసిపోయాడు. అంత రాత్రివేళ విమానంతో ఆడుకుంటున్నాడు రాము.
పిల్లలకు ఆనందమే ముఖ్యం. అది అర్ధరాత్రా అపరాత్రా అంటూ వేళాపాలా ఉండదు. ఆ ఆనందాన్ని పిల్లలకు దూరం చేయకూడదు.
''రాంబాబు చాలా నీరసించిపోయాడు. మళ్ళీ మనిషిగా మారాలంటే కొన్నిరోజులు పడుతుంది. కుటుంబం కోసం అందర్నీ వదిలి, ఎక్కడో ఊరుకాని ఊరులో జీవితాన్ని తాకట్టు పెడుతున్నాడు!'' రాంబాబుని చూసి రాములమ్మ తనలో తను అనుకుంది.
''చాలు.. ఇకచాలు.. ఆ కష్టమేదో ఊళ్ళోనే పడదాం. నువ్వు ఇక ఎక్కడికీ వెళ్ళమాక. ఉన్నదాంట్లోనే కలిసి బతుకుదాం'' తూలిపోతున్న రాంబాబుని మంచం మీద పడుకోబెట్టింది రాములమ్మ.
రాంబాబు కంటి కొసల్లో తండ్రి నారాయణ, భార్య రాములమ్మ, కొడుకు రాము లీలగా కనిపిస్తున్నారు.
రాంబాబు నడిచి నడిచి అలసిపోయాడు. ఊరు చేరుకోవాలనే తపనతో రాంబాబు అస్థిపంజరంగా మారిపోయాడు. మనిషిగా మిగిలితే చాలు అనే దీక్షతో రాంబాబు ఇన్ని రోజులు నడక అనే ఆయుధంతో ఇల్లు చేరుకున్నాడు.
ఆరాత్రి కంటి నిండా నిద్రపోయాడు రాంబాబు. చాలారోజుల వరకూ తేరుకోలేకపోయాడు.
- చొక్కర తాతారావు
6301192215