మూడు వందల లోపు కార్మికులున్న సంస్థల యజమానులు తమ ఇష్టం వచ్చిన రీతిలో ప్రభుత్వ అనుమతి లేకుండానే కార్మికులను తొలగించే అధికారం వచ్చింది. నూటికి 75 శాతం కార్మికులకు ఉద్యోగ భద్రత పోతుంది. 300 సంఖ్యను సంబంధిత ప్రభుత్వం ఒక చిన్న నోటిఫికేషన్ ద్వారా ఎపుడైనా, ఎంతకైనా పెంచవచ్చు. చట్ట సభలకు పోయి మార్పులకు ఆమోదం తీసుకోనవసరం లేదు. కార్మికులను పనిలోకి తీసుకోవటంలో (హైర్), పనిలో నుండి తీసివేయడం (ఫైర్)లో యజమానులకు కావలసినంత స్వేచ్ఛను మోడీ ప్రభుత్వం ఇచ్చింది.
పెట్టుబడిదారులు తమ వ్యాపారం చేసుకోవటాన్ని తేలికపర్చాలి. వారి వ్యాపారం ఎటువంటి ఆటంకాలు లేకుండా నల్లేరు మీద బండి లాగా నడవాలి. కార్మికుల శ్రమను దోపిడీ చేసుకుని లాభాలు పెంచుకోవాలి. ఇలా జరగాలంటే కార్మికులను పర్మినెంట్ పద్ధతిలో గాకుండా నిర్ధారిత కాలపరిమితి ఉద్యోగులు (ఫిక్స్‌డ్ టెర్మ్ ఎంప్లాయీస్)గా తీసుకోవాలి. తమకు అవసరం అయినపుడు తమ ఇష్టం వచ్చిన పద్ధతిలో పనిలో పెట్టుకోవాలి. అవసరం లేనపుడు కరివేపాకును తీసేసినట్లు పనిలో నుండి తీసేయాలి. ఇదీ ఇటీవల పార్లమెంట్‌లో పాసైన లేబర్ కోడ్లు యజమానులకు ఇచ్చిన స్వేచ్ఛ. తమకు పూర్తి స్వేచ్ఛ వచ్చిందని, పగ్గాలు తమ చేతికి వచ్చాయని యజమానుల సంఘాలు తెగ సంతోషపడ్డాయి. ఈ పగ్గాలు అందించింది మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం తమకు చేసిన ద్రోహాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులంతా ఒక్కటై నవంబర్ 26న సమ్మె కడుతున్నారు.
1991 నుండి పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను, విధానాలను మార్చటం మొదలైంది. పాలక వర్గాలు ఈ స్వేచ్ఛను ఇవ్వటానికి పదే పదే ప్రయత్నం చేశాయి. 1991లో పి.వి.నరసింహారావు ప్రభుత్వం ఎగ్జిట్ పాలసీ (బయటకు పంపే విధానం) తీసుకొచ్చి కార్మిక వర్గం చేతిలో భంగపడింది. మరో 8 సంవత్సరాల్లో వాజ్‌పేయి నాయకత్వం లోని బిజెపి మైనార్టీ ప్రభుత్వం రెండో లేబరు కమిషన్‌ను నియమించింది. అది 300 లోపు కార్మికులు పని చేసే పరిశ్రమలు/ సంస్థలను ప్రభుత్వ అనుమతి లేకుండా మూసివేయటానికి, కార్మికులను తొలగించటానికి యజమానులకు స్వేచ్ఛ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను అమలు చేయాలని వాజ్‌పేయి (బిజెపి), మన్మోహన్ సింగ్ (కాంగ్రెసు) మైనార్టీ ప్రభుత్వాలు ఉబలాటపడినా సాధ్యం కాలేదు. ఒక పక్కన మైనార్టీ ప్రభుత్వాలుగా ఉండటం, మరో పక్క కార్మిక పోరాటాలు సాధ్యపడనీయలేదు.
ఇక మోడీ 2014లో విదేశాల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తెచ్చి ప్రజలందరి ఖాతాల్లో వేస్తానని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే వాగ్దానాలతో అధికారం లోకి వచ్చారు. ఆయన వచ్చిన కొద్ది కాలంలోనే అసలు రంగు బయట పడింది. ఈయనైతే కార్మికులను ఏమార్చి తమకు కావలసిన పనులన్నీ చేసి పెడతాడని కార్పొరేట్ కంపెనీలు అధికారం లోకి తెచ్చాయి. 2019లో మరలా అధికారంలోకి రావటానికి బాణీ మారింది. ఈ సారి 'దేశభక్తి', 'దేశద్రోహులు', 'మైనార్టీ ఉగ్ర వాదం' నినాదాలతో కార్మికులను, ప్రజలను దారి మళ్ళించి అధికారం చేజిక్కించుకున్నారు. 'పుల్వామా', 'బాలాకోట్'లను తనకు అనుకూలంగా మలుచుకున్నారు.
2014 లోనే కార్మిక వర్గం మీద దాడి మొదలైంది. బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు, తన తోలుబొమ్మ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేత కార్మిక చట్టాల్లో కార్మిక వ్యతిరేక మార్పులు చేయించారు. 2019లో రెండోసారి అధికారం లోకి రాగానే 2014 నుండి కేంద్ర స్థాయిలో తాను మొదలు పెట్టిన పనిని 2020 సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి కార్మికుల నెత్తి మీద టోపీ పెట్టారు. ఈ టోపీ పెట్టటానికి అనుకూలంగా పార్లమెంట్‌లో వైసిపి, టిడిపి లు ఓటు వేసి కార్మికులకు తీరని ద్రోహం చేశాయి. వామపక్ష పార్టీలు ఒంటరిగా కార్మికుల పక్షాన నిలబడ్డాయి.
2020 సెప్టెంబరులో పాసైన పారిశ్రామిక సంబంధాల కోడ్ ప్రకారం 300 మంది కార్మికులు లేదా సంబంధిత ప్రభుత్వం (కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు) నోటిఫై చేసిన అంతకంటే ఎక్కువ మంది కార్మికులున్న పారిశ్రామిక సంస్థ దాని మూసివేతకు, కార్మికుల తొలగింపుకు, లేఆఫ్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవాలి. అంతకు ముందరి పారిశ్రామిక వివాదాల చట్టంలో 300 మంది కార్మికుల స్థానంలో 100 మంది అని ఉంది. కానీ సంబంధిత ప్రభుత్వం నోటిఫై చేసిన అంతకంటే ఎక్కువ సంఖ్యలో అనేది లేదు.
మూడు వందల లోపు కార్మికులున్న సంస్థల యజమానులు తమ ఇష్టం వచ్చిన రీతిలో ప్రభుత్వ అనుమతి లేకుండానే కార్మికులను తొలగించే అధికారం వచ్చింది. నూటికి 75 శాతం కార్మికులకు ఉద్యోగ భద్రత పోతుంది. 300 సంఖ్యను సంబంధిత ప్రభుత్వం ఒక చిన్న నోటిఫికేషన్ ద్వారా ఎపుడైనా, ఎంతకైనా పెంచవచ్చు. చట్ట సభలకు పోయి మార్పులకు ఆమోదం తీసుకోనవసరం లేదు. కార్మికులను పనిలోకి తీసుకోవటంలో (హైర్), పనిలో నుండి తీసివేయడం (ఫైర్)లో యజమానులకు కావలసినంత స్వేచ్ఛను మోడీ ప్రభుత్వం ఇచ్చింది.
మోడీ ప్రభుత్వ ప్రోత్సాహంతో బిజెపి, టిడిపి రాష్ట్ర ప్రభుత్వాలు 2015 లోనే కార్మికుల 100 సంఖ్యను 300కు పెంచాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 300కు పెంచాయి కాబట్టి, ఇంకా 100 దగ్గరే ఉంచనవసరం లేదని కేంద్రం వాదించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఉన్న వామపక్షం మినహా మిగతా మెజార్టీ సభ్యులు 300కు పెంచాలని సిఫార్సు చేశారు. కానీ 300కి మించి ఎప్పుడైనా నోటిఫికేషన్‌తో పెంచుకునే అధికారాన్ని ప్రభుత్వాలకు ఇవ్వవద్దనీ, దాన్ని తొలగించాలన్న స్టాండింగ్ కమిటీ సిఫార్సును మోడీ ప్రభుత్వం ఆమోదించ లేదు. ఈ హైర్ అండ్ ఫైర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నవంబరు 26 సమ్మె జరుగుతోంది.
(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు)
పి. అజయ కుమార్











