Mar 26,2023 10:45
  • ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ.20 కోట్లు పెండింగ్‌
  • వసూలుకు అధికారులు నానా తంటాలు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లించకుండా కార్పొరేట్‌ రంగంలోని విద్యా, వైద్య, భారీ పరిశ్రమలు ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 40 సంస్థలు రూ.20 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వీటి వసూలుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1025 గ్రామ పంచాయతీల నుంచి గత రెండేళ్లుగా ఇంటి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. వివిధ పన్నుల రూపంలో మొత్తం రూ.70 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉండగా వీటిల్లో రూ.20 కోట్ల వరకు కార్పొరేట్‌ సంస్థలు చెల్లించాల్సినవి ఉన్నాయి. రాజధాని ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, విట్‌ యూనివర్సిటీలు గత కొనేళ్లుగా పన్నులు చెల్లించడం లేదు. దాదాపు రూ.నాలుగు కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. గుంటూరులోని కాటూరి మెడికల్‌ కళాశాల దాదాపు రూ.50 లక్షల వరకు బకాయి ఉండగా వారు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు మూడు విడతలుగా రూ.30 లక్షలు చెల్లించారు. చేబ్రోలులోని కొన్ని స్పిన్నింగ్‌ మిల్లులు, భారీ పరిశ్రమల నిర్వహాకులు రూ.60 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. వీరు పన్నులు చెల్లించమంటే ముందు మౌలిక సదుపాయాలు కల్పించండి అంటూ ఎదురుదాడి చేస్తున్నారని అధికారులు తెలిపారు. వీరికి నోటీసులు జారీ చేశారు. ఇంజినీరింగ్‌, మెడికల్‌, డిగ్రీ కళాశాలలకు సంబంధించి పల్నాడు జిల్లాలో దాదాపు రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉండగా బాపట్ల జిల్లాలో రూ.మూడు కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో రూ.ఏడు కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. కొన్ని సంస్థల నిర్వహాకులు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో వీరి నుంచి వసూలు చేయడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. మరికొన్ని సంస్థల వారు పంచాయతీల సిబ్బందిని మ్యానేజ్‌చేసుకుని వేర్వేరు కారణాలతో జాప్యం చేస్తున్నాయి. ఇటీవల స్పందనలో జిల్లా కలెక్టర్‌కు పలువురు ఫిర్యాదు చేయడంతో కార్పొరేట్‌ సంస్థలకు నోటీసులు జారీ చేశారు.