- ఎన్‌పిఎ రైటాఫ్‌ల పేరిట దోచిపెడుతున్న మోడీ సర్కార్
- ఏడాది కాలంలో రూ.172,800 కోట్లు రైటాఫ్
న్యూఢిల్లీ : రైటాఫ్ ..కార్పొరేట్ కంపెనీలకు పెద్ద వరంగా మారింది. ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో కార్పొరేట్ సంస్థలు రుణాలు తీసుకొని వాటిని ఎగ్గొట్టితే వాటి మాఫీ చేయడానికి పాలకులు పెట్టిన ముద్దుపేరు రైటాఫ్. సామాజిక భద్రత, సంక్షేమ పథకాలకు భారీగా నిధులను తెగ్గోస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ రైటాఫ్‌లు చేసిన సొమ్మును కేపిటిల్ ఫండ్ పేరుతో భర్తీ చేసేందుకు ఉదారంగా నిధులు వెచ్చిస్తోంది. దేశ సంపదను దొడ్డిదారిన ఎన్‌పిఎలో రూపంలో తన కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో కార్పొరేట్ సంస్థలు తీసుకున్న రుణాలను నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ)గా ప్రకటించి ఈ ఏడాది కాలంలోనే ఏకంగా రూ.172,800 కోట్ల సొమ్మును రైటాఫ్ చేశారు. అంటే ఆ మేరకు కార్పొరేట్ కంపెనీలు లాభపడినట్టే. బ్యాంకులకు ఎన్‌పిఎ రైటాఫ్‌లో జరిగిన నష్టాన్ని మోడీ సర్కార్ మూలనిధి ఫండింగ్ పేరుతో నింపుతోంది. ప్రజల పన్నులు రూపంలో కట్టిన సొమ్ము మొత్తాన్ని ఇలా కార్పొరేట్ కంపెనీలకు తరులుతోంది. విద్య, వైద్యం, ఉపాధి హామీ పథకాలకు నిధులను భారీగా తగ్గించిన మోడీ సర్కార్ రైటాఫ్ రూపంలో అత్యధిక సొమ్మును కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం గమనార్హం.
దిగ్భ్రాంతికరం : ఏచూరి
ఇది చాలా దిగ్భ్రాంతికర అంశమని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. వివిధ రంగాలకు కేటాయించిన నిధులను, ఎన్‌పిఎ రైటాఫ్ సొమ్మును పోల్చి వ్యత్యాసాన్ని పట్టిక రూపంలో ఆయన ట్వీట్ చేశారు. ప్రజాసంక్షేమాన్ని పణంగా పెట్టి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడాన్ని మోడీ సర్కార్ మానుకోవాలని ఆయన హితవు పలికారు.










