Nov 29,2020 08:42

'బ్యాంకింగ్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం-1949'ని సవరించడం ద్వారా బడా కార్పొరేట్లు, పారిశ్రామిక సంస్థలు స్వంతంగా బ్యాంకులను కలిగి వుండేందుకు అనుమతించాలని భారత రిజర్వ్‌ బ్యాంక్‌ అంతర్గత వర్కింగ్‌ గ్రూపు (ఐడబ్ల్యుజి) ప్రతిపాదించింది. రూ.50 వేల కోట్లు, అంతకు పైగా ఆస్తి వున్న (కార్పొరేట్‌ సంస్థల అదుపులో వున్న వాటితో సహా) పెద్ద బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక కంపెనీలకు (ఎన్‌బిఎఫ్‌సిఎస్‌) దశాబ్ద కాలం పైగా ట్రాక్‌ రికార్డు వుంటే వాటికవి బ్యాంకులుగా మారడానికి అనుమతించాలన్నది మరో ప్రతిపాదన.
బడా వాణిజ్య సంస్థలకు బ్యాంకింగ్‌ రంగ ద్వారాలు తెరవాలన్నది మోడీ ప్రభుత్వ ఉద్దేశ్యంగా వుందని ఈ సిఫార్సులు సూచిస్తున్నాయి. ఈ ప్రమాదకరమైన ప్రతిపాదనలు ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తాయి. ప్రజల పొదుపు మొత్తాలను ముప్పులో పడేస్తాయి.
ఈ చర్యలే గనుక తీసుకుంటే, ఇక అంబానీలు, అదానీలు నేరుగా బ్యాంకులను ప్రారంభించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కార్పొరేట్లు ఇప్పటికే నిర్వహిస్తున్న ఎన్‌బిఎఫ్‌సి లను బ్యాంకులుగా మార్చుకోవచ్చు. అలాగే టాటాలు, ఆదిత్య బిర్లా గ్రూపు, బజాజ్‌ గ్రూపులకు చెందిన ప్రస్తుతమున్న ఎన్‌బిఎఫ్‌సిలు బ్యాంకులుగా మారిపోవచ్చు. కార్పొరేట్లు, పారిశ్రామిక సంస్థలు నిర్వహించే బ్యాంకులు డిపాజిటర్ల పొదుపు మొత్తాలను సంబంధిత లేదా అంతర సంబంధమైన సంస్థలకు మళ్లించడానికి అవకాశం వుంటుంది. ఆర్థిక రంగంలో ప్రస్తుతమున్న నిబంధనలు, నియంత్రణలను పరిగణన లోకి తీసుకున్నట్లైతే బ్యాంకుల ప్రమోటర్లు చాలా సులభంగా మార్గదర్శకాలను తప్పించుకోవడానికి అవకాశం వుంటుంది. అలాగే, తమ స్వంత ఆర్థికేతర వ్యాపార ప్రయోజనాలకు మూల వనరులను సమకూర్చడానికి లొసుగులను ఉపయోగించుకుంటారు.
కార్పొరేట్‌ సంస్థలు నిర్వహించే బ్యాంకులు మరింతగా నైతిక విపత్తులను ఆహ్వానిస్తాయి. మొత్తంగా రుణ కేటాయింపులను పక్కకు మళ్ళిస్తాయి. రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు అందకుండా వుండేలా చూస్తారని పేర్కొంది. ఆర్థిక, పారిశ్రామిక సంస్థలకు చెందిన బడా కంపెనీలు తమకు ఇష్టమైన షరతులు, నిబంధనల ప్రాతిపదికగా రుణాలు పొందడానికి అవకాశం వుంటుంది.
బడా వ్యాపార సంస్థలు, బ్యాంకుల మధ్య అపవిత్రమైన పొత్తును విచ్ఛిన్నం చేయడమే 1969లో బ్యాంకుల జాతీయీకరణ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ అపవిత్రమైన పొత్తు వల్ల రుణ కేటాయింపులు తీవ్రంగా పక్క దారి పట్టడం, వ్యవసాయం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వంటి ప్రధాన రంగాలను పక్కకు నెట్టడం, తద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కుంచించుకుపోవడం జరిగింది. దారిద్య్ర నిర్మూలనకు ఇది ప్రధాన అడ్డంకిగా వుందని నిరూపించబడింది.
బ్యాంకుల జాతీయీకరణకు ముందున్న రోజుల్లో, యునైటెడ్‌ కమిర్షియల్‌ బ్యాంక్‌ బిర్లా సంస్థలకు అనుకూలంగా వ్యవహరించేది. ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ థాపర్‌ కంపెనీలకు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా టాటా సంస్థలకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనివర్శల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు సాహూ-జైన్‌ గ్రూపు అధీనంలో వుండేవి.
మోడీ ప్రభుత్వ హయాంలో, చాలా వ్యాపార రంగాలు ఆర్థిక సామ్రాజ్యాన్ని నియంత్రిస్తున్నాయి. ఆశ్రిత పక్షపాతం పరిఢవిల్లుతోంది. కార్పొరేట్‌ సంస్థలు బ్యాంకులను నియంత్రించడానికి అనుమతించడం ప్రగతి నిరోధక, ప్రమాదకరమైన చర్యగా వుంది. ఇది, పెట్టుబడులు ఒకే చోట కేంద్రీకృతం అయ్యేందుకు, అసమానతలు పెచ్చరిల్లేందుకు దారి తీస్తుంది.
ప్రైవేటు బ్యాంకులకు లైసెన్సులిచ్చే కొత్త తరం 1993లో ప్రారంభమైంది. కానీ, 2013లో మాత్రమే అంటే యుపిఎ ప్రభుత్వ హయాం లోనే, ఆర్థికేతర కార్పొరేట్‌ సంస్థలకు కూడా అర్హత వుండేలా బ్యాంకింగ్‌ లైసెన్సులకు దరఖాస్తు చేసే ఆర్‌బిఐ మార్గదర్శకాలు మారాయి. ఈ సంస్థల ప్రవేశాన్ని అనుమతించినపుడు అవి కొన్ని నిబంధనలకు లొంగి వుండాల్సి వుంది. అంటే ఈ సంస్థల ఆర్థికేతర వ్యాపార కార్యకలాపాల నుండి ఆర్థిక లేదా బ్యాంకింగ్‌ కార్యకలాపాలను వేరు చేసి చూపడానికి ఒక మార్గంగా నిర్వహణలో లేని ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ ద్వారా పని చేయడం వంటి నిబంధనలకు తలొగ్గాల్సి వుంది. అయితే, ఈ మార్గదర్శకాలు వున్నప్పటికీ, ఇప్పటి వరకు జారీ చేసిన 14 లైసెన్సుల్లో ఏ ఒక్కటీ కార్పొరేట్‌కు ఇవ్వలేదు. 2013 తర్వాత జారీ చేసిన రెండు లైసెన్సులు ఐడిఎఫ్‌సి, బంధన్‌ బ్యాంక్‌లకు ఇచ్చారు. ఇవి ఆర్థిక సంస్థలు. ఆర్థికేతర కార్పొరేట్లు కావు.
1993 నుండి లైసెన్స్‌ ఇచ్చిన ప్రైవేటు రంగ బ్యాంకుల కొత్త తరం రికార్డు ఏమంత స్ఫూర్తిదాయకంగా లేదు. ఇప్పుడు కేవలం 9 మాత్రమే మనుగడలో వున్నాయి. వాటిలో కొన్ని గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌ వంటివి భయానకమైన వైఫల్యాలను చవిచూశాయి. ఎస్‌ బ్యాంక్‌ ప్రమోటర్లు అయితే అవినీతి, మనీ లాండరింగ్‌ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జాతీయీకరణ చెందిన బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు (ఎన్‌పిఎ) పెరుగుతుండడంతో 2015 తర్వాత మాత్రమే ప్రైవేటు బ్యాంకులు తమ వాటా అడ్వాన్సులను పెంచుకుంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రధానంగా మౌలిక సదుపాయాల రంగంలో కొన్ని ఇష్టపడే కార్పొరేట్లకే అతిగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ ఎన్‌పిఎ లు బాగా పెరిగాయి.
బ్యాంకుల నిర్వహణలో కార్పొరేట్ల ప్రమేయం వుండరాదంటూ బ్యాంకుల జాతీయీకరణ చేపట్టినప్పటి నుండి అనుసరిస్తూ వచ్చిన ముందు జాగ్రత్త చర్యను రద్దు చేసే క్రమం 2013 మార్గదర్శకాలతో ప్రారంభమైంది. అయితే ఐడబ్ల్యుజి నివేదిక దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. పైగా బ్యాంకుల నిర్వహణకు కార్పొరేట్లకు, పారిశ్రామిక సంస్థలకు ఒక హేతుబద్ధతను కల్పించింది. ''ఆ సంస్థలు ముఖ్యమైన పెట్టుబడి వనరుగా వుండగలవు. వాటి అనుభవాన్ని ఉపయోగించగలవు. బ్యాంకింగ్‌ రంగానికి నిర్వహణా నైపుణ్యం, వ్యూహాత్మక దిశను ఇవ్వగలవు.'' అని ఐడబ్ల్యుజి నివేదిక పేర్కొంది. అంతర్గత వర్కింగ్‌ గ్రూపు ఈ వైఖరి తీసుకోవడం వింతగా వుంది. ఈ రంగంలో నిపుణులైన దాదాపు పది మందిని ఈ విషయమై సంప్రదించారు. ఒకరు మినహా మిగిలిన వారందరూ బ్యాంకులకు బడా కార్పొరేట్లు, పారిశ్రామిక సంస్థలను అనుమతించడాన్ని వ్యతిరేకించారు. దీంతో, ఐడబ్ల్యుజి ప్రతిపాదనలు ప్రభుత్వానివేననే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఆర్థిక రంగ నిపుణులు, మాజీ బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు పలువురి నుండి ఆర్‌బిఐ ప్రతిపాదనలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌, మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్యలు ఇద్దరూ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. మరింత ఎక్కువగా ఆర్థిక, రాజకీయ శక్తి ఒకచోటే కేంద్రీకృతమయ్యే ప్రమాదం వుందని రాజన్‌ దీనిపై వ్యాఖ్యానించారు. ఆశ్రిత పెట్టుబడిదారీవాదం దీన్ని ప్రేరేపిస్తుందంటూ భయాందోళనలు వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ను సమర్ధించిన వీరిరువురు దీన్ని వ్యతిరేకించడం ఇక్కడ గమనార్హం.
ఆర్థిక రంగ ప్రైవేటీకరణను మోడీ ప్రభుత్వం విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఇందుకు గాను, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం ద్వారా మొత్తంగా ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగాన్ని బలహీన పరిచేందుకు పావులు కదుపుతోంది. విఫలమైన లక్ష్మీ విలాస్‌ బ్యాంకును విదేశీ బ్యాంక్‌ అయిన డిబిఎస్‌ స్వాధీనం చేసుకునేందుకు ఆర్‌బిఐ అనుమతించిందంటే ఇదే అర్ధం. కొన్ని బలహీనమైన ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్‌ నియంత్రణలో వున్న ప్రైవేటు బ్యాంకుకు అప్పగించే సమయం రావచ్చు కూడా.
స్వంతంగా బ్యాంకులను కలిగి వుండేందుకు, నిర్వహించేందుకు కార్పొరేట్లను, పారిశ్రామిక సంస్థలను అనుమతించడం ద్వారా ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగాన్ని ధ్వంసం చేయడానికి మోడీ ప్రభుత్వాన్ని ఎంత మాత్రమూ అనుమతించరాదు.
('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)