రాత్రి నే నా మస్తిష్కంలో నిద్దుర పోయా
చుట్టూ ఆలోచనల చీకటి....
నాకు ముందే
ఇక్కడో సమాజం
పూరిగుడిసెలు మురికివాడలు
ఆకలి దారిద్య్రం
ఆసరయ్యే ఆదరణ కోసం
ఊతమయ్యే చేయి కోసం
మనుషులా...కేవలం దేహాలా..
సమాంతరమై ధనిక ప్రపంచం....
కడుపుకింత తిండి కరువైనప్పుడు
ఏ ధర్మంతో ఎవరికేంటి
ఇంత ముద్ద పెట్టే వాడే కదా దేవుడు...
అంతరిక్షమైన నిరాకారుడు
నన్నెందుకు పంపాడు!
నా వేలు నిన్నెందుకు చూపిస్తోంది!
నీలో లోపమెందుకు ఎంచుతోంది!!
నా కింద చీకటిని నేనే కదా
మొదట పారదోలాలి!!!
దేహం ఇరవై ఒకటో శతాబ్దంలో
నేను
ఆదిమానవుని గుహలో
ఇంకా తచ్చాడుతూనె............
అదిగో
తూరుపున ఓ కాంతిపుంజం...
అక్షరాలు సప్తాశ్వాలు
కలం రథసారథి
కవిత్వం వెలుగుల జిమ్ముతూ....
ఇపుడే అర్థమవుతోంది
బోధివృక్షం లీలగా అగుపిస్తోంది.....
- అశోక్ గుంటుక
9908144099