ప్రజాశక్తి-నందిగామ : నందిగామ నియోజకవర్గంలో జర్నలిస్టులు సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని నందిగామ రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ రవీందర్రావు హామీ ఇచ్చారు. మే 29న జర్నలిస్టుల డిమాండ్స్ డేను పురస్కరించుకొని సోమవారం నందిగామ ఆర్డీవో ఏ రవీందర్రావు కు ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నందిగా మీడియా మిత్రులు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు ఆకుల వెంకటనారాయణ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వాలని కోరారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీని నియమించాలని, జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక బీమా వర్తింపజేయాలని, జర్నలిస్టు కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, మీడియా అకాడమీలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టుల అవార్డులు ఇవ్వాలని, జర్నలిస్టుల ఆరోగ్య బీమా అమలుపై సమీక్ష కమిటీని నియమించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్డీవో రవీంద్ర రావు మాట్లాడుతూ నందిగామలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని పరిశీలించి ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం నాయకులు శాఖమూరి మల్లికార్జునరావు ,గంట విజయ్ కుమార్ ,ఏచూరి శ్రీనివాసరావు, షాబాన్ పాషా మీరా తదితరులు పాల్గొన్నారు.










