May 08,2023 15:24
  • ఇన్‌ఛార్జ్ జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌హేష్ కుమార్‌

ప్రజాశక్తి-కాకినాడ : బాలల సమగ్ర వికాసానికి వేసవి విజ్ఞాన శిబిరాలు దోహదపడతాయని కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ క‌లెక్ట‌ర్‌, నగరపాలక సంస్థ కమిషనర్ డా.రావిరాల మహేష్ కుమార్ అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ శాఖా గ్రంథాలయంలో సోమవారం వేసవి విజ్ఞాన శిబిరాన్ని క‌మిష‌న‌ర్ మహేష్ కుమార్ గౌరవ అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌ప‌ర్స‌న్ దూలం పద్మ వెంకన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి.ఎల్.ఎన్.ఎస్.వి.ప్రసాద్ అధ్యక్షత వహించారు. జూన్ 11వ తేదీ వ‌ర‌కు 33 రోజుల పాటు జరిగే వేస‌వి శిబిరంలో విద్యార్థులకు సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, స్పోకెన్ ఇంగ్లీషు, పేపర్ క్రాఫ్ట్, కథలు చదవడం, కథలు రాయడం వంటి పలు అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ శిబిరానికి పంపించాలని పద్మ వెంకన్నబాబు కోరారు. కార్య‌క్ర‌మంలో జనవిజ్ఞాన వేదిక విద్యా విభాగం జిల్లా కన్వీనర్ కృష్ణశ్రీ, చిత్రలేఖనం రిసోర్స్ పర్సన్ పి.వి.బాబు, సంగీతం మాస్టారు చక్రవర్తి, రిటైర్డ్ డిప్యూటీ లైబ్రేరియన్ సలాది సాయి సత్యనారాయణ, గాంధీనగర్ గ్రంథాలయం లైబ్రేరియన్ ములంపాక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మానికి విద్యార్థులు, త‌ల్లిదండ్రులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.