Jul 15,2023 14:26
  • ఎమ్మిగనూరు నియోజకవర్గ సిపిఎం జీపు జాతాను ప్రారంభం
  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే ప్రభాకరరెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు : సమస్యలు పట్టించుకోని పాలకవర్గాల విధానాన్ని ప్రశ్నించడం తోపాటు పరిష్కరించే దాకా ప్రజలందరిని కూడగట్టి ఉద్యమాలు నిర్వహిద్దామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కే ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలోని తేరుబజార్ సర్కిల్ వద్ద సిపిఎం జిల్లా నాయకులు సి గోవిందు అధ్యక్షతన జరిగిన జీపు జాత ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులుగా అత్యున్నత పదవులు అలంకరించినా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా జిల్లాకు చేసింది మాత్రం శూన్యమన్నారు. కర్నూలు జిల్లా రెండుగా విడిపోయిన తర్వాత కరువు ప్రాంతం మాత్రమే కర్నూలు జిల్లాగా మిగిలిపోయిందన్నారు. జిల్లా సంక్షేమం పట్టని పాలకుల విధానాలకు వ్యతిరేకంగా, కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధిని కోరుతూ వందలాదిమందితో జూలై 26 నుండి 31 దాకా ఆదోని నుండి కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వరకు మహాపాదయాత్ర నిర్వహించి, వేలాది మందితో మహాధర్నాను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, ఎక్కడికక్కడ వాటి పరిష్కారం కోరుతూ సచివాలయ అధికారులకు ఇస్తూనే, గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను మరింత చైతన్యం చేస్తూ ప్రశ్నించే వారిగా తీర్చిదిద్దడంలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో జీపు జాతాలను నిర్వహిస్తున్నామన్నారు.ఎమ్మిగనూరు నుండి ప్రారంభించిన ఈ జీపు జాత ఎమ్మిగనూరు పట్టణం, మంత్రాలయం, నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు  మండలాలలోని అన్ని గ్రామాలలో ప్రజలను చైతన్యం చేస్తూ జాత సాగుతుందని వారు తెలియజేశారు. ఆదోని  ఎమ్మిగనూరు మధ్య టెక్స్టైల్ పార్కు నిర్మించాలని, ఆర్డీఎస్ కుడికాలను పూర్తి చేయాలని, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల స్కీములు తక్షణమే పూర్తి చేయాలని, మంత్రాలయం  నాగులదిన్నె   సుంకేసుల మీదుగా రోడ్డు పూర్తి చేయాలని, బనవాసిలో అగ్రికల్చర్  ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని , ఎమ్మిగనూరులో లెదర్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఎమ్మిగనూరులో రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించాలని, పట్టణంలో శివారు కాలనీలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పిఎస్ రాధాకృష్ణ, నారాయణ, యం డి ఆనంద్ బాబు, అంజిబాబు, గురు శేఖర్, ఎమ్మిగనూరు మండల కార్యదర్శి హనుమంతు, నాయకులు రాముడు, లక్ష్మీ, నరసయ్య, సురేష్, నరసింహులు, బి రాజు, కరుణాకర్, అబ్దుల్ ఆంథోనీ రాజు, రమేష్ కాలప్ప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.