Jun 05,2023 15:58
  • పది రోజులు ప్రజల మధ్య పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు

ప్రజాశక్తి-కాకినాడ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టబోతున్న వారాహి యాత్ర ఈనెల 14వ తేదీ నుంచి సుమారు పది రోజులపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతుందని ఈ వారాహి యాత్రకు సంబంధించి ఉమ్మడి జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ సోమవారం కాకినాడలోని హెలికాన్ టైమ్స్ హోటల్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ పవన్ యాత్ర ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు సుమారు పది రోజులు పలు నియోజకవర్గాల్లో జరుగుతుందని అనంతరం ఆయా నియోజకవర్గాల్లో భారీ ఎత్తున బహిరంగ సభలను నిర్వహించి ఆయా నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై సభలో జనసేనాని ప్రసంగిస్తారని దుర్గేష్ చెప్పారు.14న ఉదయం అన్నవరం స్వామి వారి సన్నిధిలో పూజ నిర్వహించి జనసేనని వారాహి యాత్ర ప్రారంభిస్తారని అక్కడే అదే రోజు సాయంత్రం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. అనంతరం 15, 16వ తేదీన పిఠాపురంలోనూ, 17, 18, 19 తేదీలలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనూ, అనంతరం ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గంలలో జరుగుతుందని చెప్పారు. 24వ తేదీతో యాత్ర ముగుస్తుందని తెలిపారు. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు ఇతర ప్రజా సంఘాలు, మహిళా సంఘాల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి సమస్యలకు పరిష్కారం పవన్ సూచిస్తారన్నారు. గతంలో పవన్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారని ఈ కార్యక్రమానికి ప్రజల నుండి వినతి పత్రాలను తీసుకున్నారన్నారని అలాగే పవన్ నిర్వహిస్తున్న వారాహి యాత్రలకు వైకాపాలో గుబులు పుట్టిందన్నారు. వారాహి యాత్ర ప్రజల్లో మమేకమవుతుందని చెప్పారు  ప్రజలతోనే ప్రజల మధ్యనే పవన్ వారాహిపై యాత్ర నిర్వహిస్తారని సీఎం జగన్ మాదిరిగా ప్రజల మధ్య లేకుండా సమస్యలు పరిష్కరించకుండా హెలికాప్టర్లో తిరుగుతున్నారంటూ దుర్గేష్ ఎద్దేవ చేశారు. బందరు కోర్టుకు మూడుసార్లు శంకుస్థాపన చేశారని అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని దుర్గేష్ చెప్పారు. వైకాపా నాయకులు కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబులు తమ నాయకునిపై విమర్శలు చేయడానికి తప్పా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలని పరిష్కరించడంలో వారు శ్రద్ధ వహించడం లేదని చెప్పారు. తూర్పు సెంటిమెంటుతో జనసేన చరిత్ర సృష్టిస్తుందని దుర్గేష్ పేర్కొన్నారు. 
  ఈ సమావేశంలో జనసేన నాయకులు మాకినీడు శేషు కుమారి, పితాని బాలకృష్ణ, ముత్తా శశిధర్, పంతం నానాజీ, మేడ గురుదత్త ప్రసాద్, కే కళ్యాణ్ కృష్ణ, పరుపుల తమ్మయ్య బాబు, తుమ్మల బాబు, సుంకర కృష్ణవేణి, మోర్త మాలతి, మిర్యాల హైమావతి తదితరులు పాల్గొన్నారు.