- జగనన్న అమ్మబడి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఎంపీ వంగా గీత
ప్రజాశక్తి-కాకినాడ : 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పేదల కష్టాలను, అవసరాలను గుర్తించి వాటిని తీర్చడానికి ఎన్నడూలేని విధంగా ముఖ్యమంత్రి వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. బుధవారం జగనన్న అమ్మ ఒడి జిల్లాస్థాయి కార్యక్రమం కాకినాడ అర్బన్ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన కాకినాడ స్మార్ట్‌సిటీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, కలెక్టర్ డా. కృతికా శుక్లా, జెడ్‌పీ ఛైర్‌పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, కాకినాడ పట్టణ మార్కెటింగ్ కమిటీ ఛైర్‌పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ ఆర్‌డీవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఈవో కేఎన్‌వీఎస్ అన్నపూర్ణ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగో విడత జగనన్న అమ్మ ఒడి నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాంలో ప్రారంభించిన అనంతరం ఎంపీ వంగా గీత, కలెక్టర్ డా. కృతికా శుక్లా, జెడ్‌పీ ఛైర్‌పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు, శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్నతదితరులు విద్యార్థుల తల్లిదండ్రులకు జగనన్న అమ్మ ఒడి ఆర్థిక సహాయానికి సంబంధించిన మెగా చెక్ అందజేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రంలోని పిల్లలందరి అదృష్టమని పేర్కొన్నారు. విద్య, వైద్యం తదితరాల కోసం పేదలు అప్పులు చేయాల్సిన పరిస్థితి గతంలో ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, విద్య ప్రాధాన్యాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగనన్న అమ్మ ఒడితో పాటు వివిధ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని జీవిత పాఠాలు కూడా నేర్పాలని ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత సూచించారు.
- జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ. 280 కోట్ల లబ్ధి : కలెక్టర్ డా. కృతికా శుక్లా
కాకినాడ జిల్లాలో ఈ ఏడాది 1,86,708 మంది తల్లులకు రూ. 280.06 కోట్ల మేర లబ్ది చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది జగనన్న అమ్మ ఒడి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. పేదరికం విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు లబ్ధి చేకూర్చుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని, ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. మనబడి నాడు-నేడు ద్వారా జిల్లాలో ఇప్పటికే రూ. 335 కోట్ల ఖర్చుతో పనులు పూర్తిచేసినట్లు వివరించారు. అదే విధంగా డిజిటల్ తరగతి గదులు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను అందిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభమైన రోజునే నాణ్యమైన బ్యాగు, యూనిఫాం, షూ తదితరాలతో పాటు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్‌తో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లను అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో రైజ్ కార్యక్రమం ద్వారా విద్యార్థులో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రైజ్ కార్యక్రమానికి ప్రశంసలు లభిస్తున్నాయని కలెక్టర్ డా. కృతికా శుక్లా పేర్కొన్నారు.
- ఎంతో ఉపయోగపకరమైన పథకం : జెడ్‌పీ ఛైర్‌పర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు
జెడ్‌పీ ఛైర్‌పర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ జగనన్న అమ్మ ఒడి పథకం ఎంతో ఉపయోగపకరమైన పథకమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని వేణుగోపాలరావు అన్నారు.
- తల్లిదండ్రులకు భారం కాకూడదనే : శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
విద్యారంగ ప్రాధాన్యాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న అమ్మ ఒడి వంటి వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కాకినాడ అర్బన్ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లి ఖాతాలో రూ. 13 వేలు చొప్పున జమవుతోందని తెలిపారు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్క కాకినాడ అర్బన్ పరిధిలోనే జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 25,170 మంది లబ్ధి పొందుతున్నారని ఇది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. పేదల కష్టాలను గుండెల్లో పెట్టుకొని వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషిచేస్తున్నారని వివరించారు. అత్యంత నాణ్యతతో జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.










