Oct 08,2023 21:50

600 మందికిపైగా మృతి
వేలాది మందికి గాయాలు
గాజాను శిథిలం చేస్తా: నెతన్యాహు
ఇజ్రాయిల్‌పై మోర్టార్లతో హిజ్బుల్లాల దాడి
ఈజిప్టులో ఇద్దరు ఇజ్రాయిలీ టూరిస్టుల కాల్చివేత
గాజా సిటీ: పాలస్తీనా సాయుధ గ్రూపు హమాస్‌, ఇజ్రాయిల్‌ బలగాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఆదివారం మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య 600కు దాటింది. పాలస్తీనా భూ భాగంలోని గాజా సిటీలో గడచిన 24 గంటల వ్యవధిలో 250 మందికిపైగా మరణించారు. హమాస్‌పై ఇజ్రాయిల్‌ అధికారికంగా యుద్ధం ప్రకటించిందని నెతన్యాహు కార్యాలయం ఆదివారం వెల్లడించింది. హమాస్‌కు పట్టు ఉన్న గాజాప్రాంతాన్ని శిథిలంగా మారుస్తానని పచ్చి మితవాది, బెంజిమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. ఆయన యుద్ధ ప్రతిపాదనకు భద్రతావ్యవహారాల కేబినెట్‌ కమిటీ శనివారం రాత్రి ఆమోదం తెలిపింది. గాజాపై ఇప్పటికే ఇజ్రాయిల్‌ వైమానిక దళాలు పెద్దయెత్తున దాడులకు దిగాయి.. ఈ దాడులు రెండవ రోజు కూడా కొనసాగడంతో గాజా ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు కురిపిస్తున్న బాంబుల వర్షానికి పాలస్తీనా నేషనల్‌ ఇస్లామిక్‌ బ్యాంక్‌తో బాటు పలు పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులో 380 మంది పాలస్తీనియన్‌ పౌరులు చనిపోయారని, మరో 2200 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వందలాది మంది క్షతగాత్రులతో గాజా సిటీలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల వల్ల గాజా సిటీలో 80 శాతం ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మహిళలు, పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ఇదిలా ఉండగా లెబనాన్‌ నుండి ఇజ్రాయిల్‌ ఆక్రమిత షెబా ఫామ్‌ ప్రాంతంపై హిజ్బుల్లా సాయుధ గ్రూపు మోర్టార్లతో దాడి చేసింది. దీనికి ఫిరంగులతో సమాధానం చెబుతామని ఇజ్రాయిల్‌ తెలిపింది.
ఈజిప్టులో పోలీసులు ఇద్దరు ఇజ్రాయిలీ టూరిస్టులను కాల్చివేసినట్లు అల్‌జజీరా వెబ్‌సైట్‌ తెలిపింది.