Jan 24,2021 08:37

దేశం ఆకలి తీర్చే రైతన్నల ఆశలను చిదిమే పాలకులు.. ఆకలిగొన్న దేహాల ప్రాణం నిలిపే అన్నదాతల ఉసురు తీస్తోన్న చట్టాలు.. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రానికి గొడ్డలిపెట్టుగా మారాయి. మన వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించి, సారవంతమైన భూములను శ్మశానాలుగా మార్చడానికి సిద్ధమయ్యారు మన పాలకులు. మనకెందుకులే అనుకుందామా.. నిగ్గదీసి ప్రశ్నిద్దామా..? ప్రజాస్వామ్య ముసుగులోని కార్పొరేట్ల సేవకులను గద్దె నుండి తరిమేద్దామా.. ఈ రైతు గణతంత్ర దినోత్సవం స్ఫూర్తిగా ముందుకు కదులుదామా?

 

రైతు గణతంత్రం

అంతర్జాతీయ మద్దతు..
అంతర్జాతీయంగా రైతులకు మద్దతు లభిస్తోంటే.. ప్రభుత్వానికి రోజురోజుకూ మద్దతు తగ్గిపోతోంది. మరోవైపు మోడీ ప్రభుత్వానికి దగ్గరగా ఉండేవాళ్లంతా ఇప్పుడు దూరమవుతున్నారు. తన ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారంతా రైతులకు మద్దతుగా ప్రభుత్వం నుండి, ఎన్‌డిఎ భాగస్వామ్యం నుండి తప్పుకున్నారు. వారంతా రైతు పోరాటంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వాములవుతున్నారు. అయినా మత్తులో వున్నా తాగుబోతు తన చంకలోని సారా సీసాను వదలనట్లు.. ప్రభుత్వం సరళీకరణ విధానాల మత్తులో తూగుతోంది. మోడీ ప్రభుత్వం తలకెక్కిన మత్తును దించే మూలికలు రైతుల దగ్గరే ఉన్నాయి. వీరికి అండగా కార్మికులు, ప్రజలు, ఉపాధ్యాయులు.. ఇలా వివిధ వర్గాలకు చెందిన వారంతా రైతులకు అన్ని రకాలుగా మద్దతునిస్తున్నారు. దక్షిణాదిలో రైతు ఉద్యమ ప్రభావం లేదని ప్రభుత్వ గోడీ మీడియా ప్రచారం చేస్తోంది. కానీ, ఇక్కడి నుండి కదిలిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సమరశంఖం పూరించారు. హిందీ, ఇంగ్లీష్‌ మాట్లాడటం రాకపోయినా, 1800 కిలోమీటర్లు ప్రయాణించి హర్యానా - రాజస్థాన్‌ సరిహద్దులో జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్నారు. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా.. రైతులంతా ఒక్కటేనని, రైతుల భాష, గోస ఎక్కడైనా ఒక్కటేనని నినదించారు. కేవలం అదానీ - అంబానీలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేందుకే ఈ చట్టాలతో రైతులెవరికీ మేలు జరగదని, ఈ నల్ల చట్టాలను ఎదుర్కోవడమే మార్గమని చేయీచేయి కలిపారు. దీంతో ఏమీ పాలుపోని ప్రభుత్వం తత్తరపడుతోంది.

 

రైతు గణతంత్రం

మహిళారైతుల అద్వితీయ పాత్ర
ఈ పోరాటంలో మహిళా రైతులదీ ప్రధానపాత్ర. ర్యాలీల్లో పాల్గొనడం దగ్గర నుంచి నిరాహారదీక్షల్లో పాల్గొనడం వరకూ అన్నింటిలోనూ వాళ్లే ముందువరుసలో ఉన్నారు. పోరాటంలో పాల్గొన్నవారికి రొట్టెలను అందించడమే కాదు ''మీరు తినే ప్రతి మెతుకూ మా కష్టానికి ప్రతిఫలమే''నని నిరూపిస్తున్నారు. వారితో పాటు యువకులు, పిల్లలు సైతం ఉత్సాహంగా ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. పోరాట వీరులకు వెన్నుదన్నుగా నిలుస్తూ.. తామో శక్తి స్వరూపిణుల్లా మరికొంతమందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ''ఇది రైతు గణతంత్రం.. ఈ దేశం మాది.. ఈ భూమి మాది.. ఈ గణతంత్రం మాది..'' అని రైతులు నినదిస్తున ా్నరు. ఇది రైతులు జరుపుతున్న గణతంత్ర ఉత్సవాలు. మహిళా రైతులు సైతం ట్రాక్టర్లను నడుపుతూ.. ఢిల్లీ ఔటర్‌రింగ్‌ రోడ్‌ అంతా పరేడ్‌ జరుపు తుంటే.. ఢిల్లీ నడిమధ్యలో బిక్కుబిక్కుమంటూ గణతంత్రాన్ని జరుపుకోవాల్సిన పరిస్థితి మోడీ ప్రభుత్వానికి ఎదురైంది.

 

రైతు గణతంత్రం

నాడూ నేడూ రైతులే సారధులు..
ఇప్పుడు రైతులు నడుపుతోన్న పోరాటం వాళ్లు డబ్బు సంపాదించుకోడానికో, వాళ్ల ఆస్తులు పెంచుకోడానికో చేయట్లేదు. అలా భావించడం అవివేకం కూడా. రైతులు పోరాడుతున్నది ఈ దేశ ఆర్థికవ్యవస్థ తిరిగి నిలబడాలని. కానీ, తాను కూర్చున్న చెట్టు కొమ్మనే నరికేసినట్లు పారిశ్రామికవేత్తల కోసం సాక్షాత్తూ ప్రభుత్వమే వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తోంది. వ్యవసాయం ధ్వంసమైతే పారిశ్రామిక వేత్తలూ పారిపోతారన్న నగసత్యం ప్రభుత్వానికి అర్థం కావడంలేదు. ఒకవేళ అర్థమైనా మొద్దు నిద్ర నటిస్తుంటే.. ఆ నిద్రను మేల్కొలిపే పనే ఇప్పుడు రైతులు చేస్తున్నారు. ఈ విషయం రైతులకు అర్థమైంది గనుకనే దేశ పరిరక్షణ కోసం ఉద్యమబాట పట్టారు. రిపబ్లిక్‌ రక్షణ కోసమే రైతులు పోరాడుతున్నారు. రిపబ్లిక్‌ను మేమే కాపాడుతున్నామని అనుకుని, భుజకీర్తులు తగిలించుకునే పాలకుల విధానాలు వటవృక్షం లాంటి మన గణతంత్రం వేళ్లను తొలిచేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం యొక్క గణతంత్రం దేశానికి నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ప్రజలు పోరాడి సాధించిన ఈ గణతంత్రంలో రైతులు, కార్మికులు లేకుంటే కండపుష్టి వచ్చేది కాదు. ఆ రోజు స్వాతంత్య్రం తెచ్చిందీ రైతులే.. ఈ 74 ఏళ్ల స్వతంత్ర భారతం యొక్క మనుగడను కాపాడుతున్నదీ రైతులే. 60 రోజులుగా రైతులు సాగిస్తోన్న వ్యవసాయ పరిరక్షణోద్యమ పోరాటంలో 147 మంది రైతులు అసువులు బాసారు. చలి, వర్షం, బురద, ఒత్తిళ్లు.. దేనికీ చలించక, మొక్కవోని దీక్షతో రైతులు సాగిస్తున్న పోరాటాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకూ ఆందోళన చేయడానికే రైతులు మొగ్గు చూపుతున్నారు. సుప్రీం ఈ చట్టాలపై స్టే విధించినా.. కమిటీని ఏర్పాటు చేసినా.. రైతుల స్వరంలో మాట మారలేదు. వారి సత్తువలో చేవ చావలేదు. ఆ కమిటీలో సభ్యులంతా చట్టాలకు మద్దుతు ఇచ్చినవారేనని.. కమిటీ ముందు కూడా హాజరకాబోమని తేల్చి చెప్పారు. దీంతో సుప్రీం సైతం చేతులెత్తేసింది. దేశ భవితపై, రైతు జీవితాలపై దెబ్బకొట్టే ఈ చట్టాల రద్దుకు వెనకాడుతోన్న కేంద్ర ప్రభుత్వానికి తమ సత్తా ఏమిటో చూపించడానికి రైతులు సిద్ధమయ్యారు. మరోవైపు ప్రభుత్వం తాను చేసిన చట్టాలను సమర్థించుకోలేక నానా తంటాలు పడుతోంది. అందుకే ఆ చట్టాలలో సవరణలు చేస్తాం.. ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తాం.. అంటూ రైతులతో బేరాలకు దిగింది.

రైతు గణతంత్రం

జై కిసాన్‌.. జై జవాన్‌..
చివరకు రైతులపై బలప్రయోగం చేయడానికీ ప్రభుత్వం జంకుతోంది. ఎందుకంటే దేశానికి జవాన్లను అందించే రైతులపై తుపాకులు ఎక్కుపెట్టడానికి వాళ్లు సిద్ధంగా లేరు. పదవీ విరమణ చేసిన ఆర్మీ జవాన్లు సైతం తమ యూనిఫాం, మెడల్స్‌ ధరించి ఉద్యమంలో మమేకం అవుతున్నారు. ఇది గమనించి గంగవెర్రులెత్తిన ప్రభుత్వం యూనిఫాంతో నిరసనల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధం అంటూ... మాజీ జవానులెవరూ యూనిఫాంతో నిరసనల్లో పాల్గొనరాదంటూ ప్రకటన చేయాల్సి వచ్చింది. మరికొందరు జవాన్లు, పోలీసు అధికార్లు సైతం తమ ఉద్యోగాలను వదులుకొని ఉద్యమ భాగస్వాములవుతున్నారు. ఆ రోజు దేశాన్ని కాపాడటానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన జవాన్లు.. నేడు దేశం మూలాలను కాపాడటం కోసం కంకణం కట్టుకున్నారని అర్థమవుతోంది. ప్రతి చిన్న విషయంలో జవాన్ల జపం చేసే మోడీకి ఇప్పుడు ఆ జవాన్లే ఉద్యమంలోకి వస్తోంటే మింగుడు పడటంలేదు.
 

కిసాన్‌ కవాతు..
దేశం శక్తిని ప్రదర్శించే రిపబ్లిక్‌ దినోత్సవానికి సమాంతరంగా రైతు శక్తిని ప్రదర్శించే ఉద్యమ రూపమే.. నేడు జరగబోయే గణతంత్ర దినోత్సవం. అదే ఆ రోజున రైతులు నిర్వహించే కిసాన్‌ కవాతు. ప్రభుత్వ శకటాలకు పోటీగా రైతుల శకటాలు (ట్రాక్టర్లు) సిద్ధమయ్యాయి. 'ఈ రిపబ్లిక్‌ మాది.. ఈ పరేడ్‌ కూడా మాదే!' అంటూ.. జాతీయపతాకంతో ముస్తాబైన ట్రాక్టర్లతో రైతులు కదం తొక్కనున్నారు. ఇది కాషాయవాదుల దేశభక్తి కాదు.. మట్టిన నమ్ముకున్న నేలతల్లి ముద్దుబిడ్డల అసలుసిసలు దేశభక్తి. ఇది పోరుశక్తి. అక్కడే కవితాగోష్టులు, అక్కడే చిన్నచిన్న మీటింగ్‌లు, మధ్యమధ్యలో వినోద కార్యమ్రాలు, కుస్తీపోటీలు, వైద్యశిబిరాలు అన్నీ అక్కడే. అంతేకాదు తిరునాళ్లను తలపించేలా చిన్నచిన్న దుకాణాలు. వాన, బురద, చలీ, మంచు అన్నింటినీ పోరాటంలో భాగం చేసుకుంటూ.. అలసటను పారద్రోలుతూ సాగుతూ... కొత్తపుంతలు తొక్కుతోన్న రైతు పోరాటం ఇది.

చరిత్రలో నిలిచిపోతుంది..
స్వతంత్ర భారతదేశ చరిత్రలో గణతంత్ర పరేడ్‌కు పోటీగా అదేరోజున భారీఎత్తున రైతుల పరేడ్‌ నిర్వహించడం ఒక చరిత్ర. ఈ ప్రభుత్వానికి ఇంతకంటే పెద్ద అభిశంసన ఇంకేం ఉండదు. ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. అపఖ్యాతి మూటగట్టుకున్న వ్యక్తిగా.. గాడ్సే వారసుడిగా మోడీ నిలుస్తాడు. దేశానికి స్వతంత్రం తెచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ హత్యచేసిన గాడ్సే గురించి ఇప్పటికీ చర్చించుకుంటున్నాం. అదేమాదిరిగా భారతీయ రిపబ్లిక్‌ మూలాలను కాపాడటానికి పోరాడుతున్న రైతులు, ఈ పోరాటంలో ప్రాణాలను అర్పించిన రైతు వీరులతో పాటు.. ఆ రైతాంగానికి ద్రోహం చేసిన వ్యక్తిగా.. 147 మంది రైతు వీరుల మరణానికి కారణమైన వ్యక్తిగా మోడీ చరిత్రలో నిలిచిపోతాడు. ఈ గణతంత్ర దినోత్సవం.. రైతుల గ(ర)ణతంత్ర దినోత్సవంగా చరిత్రలో నిలిచిపోతుంది. 'దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.. నీతి మనదే.. జాతి మనదే.. ప్రజల అండదండా మనదే.. ఎన్ని భేదాలున్నా.. మాకెన్ని తేడాలున్నా.. దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ..' అంటూ రైతుల పక్షాన నిలిచేందుకు మన వ్యవసాయాన్ని, మన భూమిని కాపాడుకునేందుకు చేయి చేయి కలుపుదాం.. పిడికిలి బిగించి నినదిద్దాం..!

 

రైతు గణతంత్రం

గ్రామాలే పునాది..
గ్రామాలు ఏర్పడిన చారిత్రక క్రమంలో ఆయా గ్రామాలలో మిగులు ఉత్పత్తి ఉండేది. ఆ మిగులు వ్యాపార రూపంలోకి మారేది. పట్టణాల నుంచి వచ్చిన వ్యాపార కేంద్రాలు.. ఆ తర్వాతి క్రమంలో అవే పట్టణాలుగా అభివృద్ధి అయ్యాయి. పారిశ్రామిక అభివృద్ధి జరిగిన తర్వాత మహానగరాలు, పారిశ్రామిక వాడలుగా ఏర్పడ్డాయి. కాబట్టే ఈ మానవ సమాజం యొక్క నాగరికతకు గ్రామాలే పునాది. ఆర్థిక వ్యవస్థలోను, వ్యవసాయ రంగంలోను వచ్చిన మిగులు ఈ దేశంలో నూటికి 60 శాతం వ్యవసాయంపైనే ఆధారపడిన రైతాంగానికి ఉపయోగపడింది. గ్రామాల్లోని రైతులు పండించిన పంట అమ్ముకుంటే వచ్చే డబ్బులోని మిగులు.. ఆయా గ్రామాల్లోనే ఉండిపోదు. ఆ డబ్బు దాచుకుంటే బ్యాంకుల్లోకో, సరుకులు కొంటే మార్కెట్‌లోకో వస్తుంది. ఆ కొనుగోలు శక్తినంతటినీ సొమ్ము చేసుకొని, లాభాలు సంపాదించుకొని, సరుకులు ఉత్పత్తి చేస్తారు. తద్వార పరిశ్రమలకు డిమాండ్‌ పెరుగుతుంది. ఈ క్రమంలో పరిశ్రమలు అభివృద్ధి చెంది పురోగమనం సాగించాలంటే, వ్యవసాయంలో మిగులు పెరగాలి. అయితే, గత పది పదిహేనేళ్లుగా వ్యవసాయంలో మిగులు పెరగనందువల్లే దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఫలితంగా రైతులు పెట్టే పెట్టుబడి పెరిగిపోతోంది. దిగుబడి తగ్గిపోతోంది. ఆదాయాలు పడిపోతున్నాయి. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ల కొమ్ముకాస్తూ.. రైతుల వెన్ను విరిచేందుకు సిద్ధమయ్యాయి.

 

రైతు గణతంత్రం

ట్రోలీటైమ్స్‌ పత్రికే ఆయుధం..
స్వాతంత్య్ర పోరాటంలో అనేక పత్రికలు దేశ ప్రజలకు ఆయుధంగా మారినట్లుగానే, రైతు పోరాటానికి వాళ్లు తీసుకొచ్చిన 'ట్రోలీ టైమ్స్‌' పత్రిక ఆయుధంగా మారింది. 'విప్లవ కరవాలాన్ని భావాల రాతిపై నిరంతరం పదును పెడుతూనే ఉండాలి!' అన్న భగత్‌సింగ్‌ మాటలను తొలి సంచికలోనే ప్రముఖంగా ప్రచురించి, గోడీ మీడియాకు సవాల్‌ విసిరారు. ప్రపంచ వ్యాప్తంగా లభిస్తోన్న మద్దతును, వస్తోన్న స్పందనకు అద్దం పట్టేలా వార్తలు, వ్యాసాలు, కార్టూన్లు, కవితలను ముద్రిస్తూ గోడీ మీడియాకు గట్టి జవాబు చెప్పారు. విద్యార్థులు, యువకులతో చిత్రకారులు, కవులు పత్రిక, యూట్యూబ్‌ ఛానల్‌ పనిలో నిమగమయ్యారు. మొబైల్‌ఫోన్‌లో 24 గంటలూ ఈ ప్రసారాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం రైతు ఉద్యమంపై దుష్ప్రచారానికి తన మీడియాను వాడుకుంటుంటే.. గోడీ మీడియా ప్రచారాన్ని రైతులు నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం ప్రయోగించే అస్త్రాలేమీ పనిచేయకుండా పోయాయి. మహాభారత యుద్ధంలో కర్ణుడి అస్త్రశస్త్రాలన్నీ నిరుపయో గమైపోయినట్లు.. మోడీ అస్త్రాలు, తంత్రాలు నిరుపయోగంగా మారిపోయాయి.

ఆరంభం ఇలా..
భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరూ గుర్తుపెట్టుకునే అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటిష్‌వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటిష్‌ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని దేశం నుంచి వెళ్లగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాల్సి వచ్చింది. 1950, జనవరి 26న రాజ్యాంగాన్ని రూపొందించుకొని, డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వం.. ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. ఆనాటి నుంచి భారతదేశం ''సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర'' రాజ్యంగా అవతరించింది. అప్పటి నుంచి జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

- రాజాబాబు కంచర్ల

94900 99231