ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేత వల్ల ఉద్రిక్తత ఏర్పడిన నేపథ్యంలో గ్రామంలో పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ విగ్రహాల చుట్టూ కంచె వేసి బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యాలు ఆదివారమూ కనిపించాయి. ఇప్పటంలో కేవలం ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్ల ప్రహరీలనే కూల్చివేశారని మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన ప్రకటనలను జనసేన నాయకులు తప్పుపట్టారు. జనసేన రాష్ట్ర ప్లీనరీ సభకు స్థలం ఇచ్చినందుకే ఇళ్లను కూల్చివేశారని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు గుంటూరులోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన మీద ఉన్న కక్షతో రాజకీయ ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను తొలగించారని, వైఎస్ విగ్రహం చుట్టూ ఇనుప కంచె వేసి పోలీసుల పహారా పెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే 120 అడుగుల రోడ్డు లేదని, అలాంటిది ఒక పల్లెటూరిలో 120 అడుగుల రోడ్డు వేస్తామని ఇళ్లు కూలుస్తారా? అని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్ సభకు స్థలం ఇస్తే నేరం చేసినట్లు మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.










