రేయంతా
కలలుగన్న కళ్ళు
రేపటి ఉదయానికి ఉషస్సు కిరణాలై
కళ్ళలో వాలేవి
అనుకోకుండా వచ్చి వాలే కొన్ని దు:ఖాలు
శ్రమతోనో, సేవతోనో
చరమగీతంపాడి చల్ మోహనరంగా అని
తుర్రుమనేవి
ఇప్పుడు పొడిచే పొద్దు నుంచీ
వాలే పొద్దు వరకూ
ఊపిరి సలపని ఉపద్రవాలు
బతికున్న మనిషిని ఉన్న చోటనే బందిస్తూ
బాహ్య ప్రపంచాన్ని శాసిస్తూ
మార్మికాన్ని మంద్రంగా మంత్రిస్తోంది
మనిషిగా పుట్టిన మనసుకి ఇప్పుడు
తన ఉనికిని కోల్పోతూ
బీతిళ్ళిన దేహాన్ని అర్థాయుస్సుతో
కాటికి సాగిస్తూ, కంటిపాపనో, ఇంటిదీపాన్నో
మట్టిపాలు చేయడం మనసుని బాధిస్తోంది
ఎన్నో జయించిన మనిషికి
ఒక్క సవాల్ ఊపిరి సలపని ఉద్విగ క్షణాలు
ఉక్కిరి బిక్కిరి చేస్తూ
విశ్వ మానవుని కలలు కల్లలు అవుతూ
మనిషి లేని మరో ప్రపంచాన్ని ఊహించగలమా?
అందుకే అతని కలలు పండాలి
ఎన్ని అవరోధాలు అడ్డొచ్చినా
ప్రపంచ పటంలో
మనిషి అజేయుడై నిలవాలి
అవును ఇప్పుడు మనిషి బ్రతకాలి...
- మహబూబ్ బాషా చిల్లెం
9502000415