Oct 22,2023 11:04
  • ప్రపంచవ్యాప్తంగా, మనం ఇతరులతో కనెక్ట్‌ అవడానికి, విషయాల ప్రవాహాన్ని నిర్వహించుకోడానికి, సమాచారాన్ని షేర్‌ చేసుకోడానికి ఇంటర్నెట్‌ వారధిగా కొనసాగుతోంది. వ్యక్తిగత వినియోగంతో పాటు పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలపై పెరుగుతున్న ఇంటర్నెట్‌ ప్రభావం, మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. 2023లో, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 5.18 బిలియన్లకు చేరుకుంది. అంటే ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ప్రస్తుతం 'వరల్డ్‌ వైడ్‌ వెబ్‌'కు కనెక్ట్‌ అయి వున్నారు.
  • ఆన్‌లైన్‌ జనాభా

2023 నాటికి, ప్రపంచంలోని ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్యలో చైనా అగ్రస్థానంలో వుండగా, భారత్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తమ్మీద, తూర్పు ఆసియా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఇంటర్నెట్‌ వినియోగదారులను కలిగి ఉన్న ప్రాంతం. అయితే ఉత్తర ఐరోపా అత్యధిక ఇంటర్నెట్‌ వ్యాప్తి రేటును కలిగి ఉంది.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో డిజిటల్‌ జనాభా పెరుగుతున్నప్పటికీ, ఇంటర్నెట్‌ సదుపాయం, లభ్యత ప్రాంతాన్ని బట్టి గణనీయంగా మారవచ్చు. ఇంటర్నెట్‌ సదుపాయం ప్రపంచ సగటు తక్కువగా ఉన్న దేశాలు, ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. 2022 నాటికి, ఆఫ్రికా ఇతర ప్రాంతాలలో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగం అతి తక్కువనే చెప్పాలి. ఏప్రిల్‌ 2023 నాటికి, ఉత్తర కొరియా జనాభా దాదాపు పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంది.
ఎందుకంటే సాధారణ ప్రజలకు ఇంటర్నెట్‌ సదుపాయం ప్రభుత్వంచే భారీగా పరిమితం చేయబడింది. అదే సమయంలో దక్షిణ సూడాన్‌, సోమాలియాలో అత్యధికంగా ఇంటర్నెట్‌కు కనెక్టివిటీ లేనివారి సంఖ్య వరుసగా 93, 90 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సదుపాయం క్రమంగా పెరుగుతున్నప్పటికీ, అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు ఉన్న దేశాల్లో కనెక్టివిటీ నాణ్యత కూడా మెరుగ్గా ఉంది. 2022 నాటికి, సింగపూర్‌ ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన సగటు స్థిర బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ను కలిగి ఉంది.

  • మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగం

మొబైల్‌ పరికరాలు మిలియన్ల మంది ప్రజల రోజువారీ జీవితంలో ఒక స్థిరంగా మారాయి. 2022 నాటికి మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య ఐదు బిలియన్లకు చేరుకుంది. అంటే... ప్రపంచ ఇంటర్నెట్‌ జనాభాలో 60 శాతం మంది మొబైల్‌లోనే ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారు. గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల సర్వే ప్రకారం... జూన్‌ 2022 నాటికి, మొబైల్‌ పరికరాలలో అత్యంత జనాదరణ పొందిన యాప్‌ కార్యకలాపాలు చాటింగ్‌, కమ్యూనికేట్‌ చేయడం, సంగీతం వినడం, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు.
ఏప్రిల్‌ 2023 నాటికి, ప్రపంచంలోని పురుష జనాభాలో దాదాపు 67 శాతం మంది ఇంటర్నెట్‌ ఉపయోగిస్తుండగా, మహిళలు 61.8 శాతం మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ అసమానత ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. 2022 నాటికి, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని పెద్దల కంటే 15- 24 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులలో ఆన్‌లైన్‌ వినియోగ రేటు ఎక్కువగా ఉంది. 16-34 సంవత్సరాల వయస్సు గలవారు ప్రతిరోజూ సగటున ఏడు గంటలు ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో గడుపుతున్న వారి సగటు సమయంలో వివిధ వయస్సుల మధ్య పోల్చి చూస్తే, 45 - 54 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులు రోజుకు ఐదు గంటల యాభై నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. కాగా, యునైటెడ్‌ స్టేట్స్‌లో 44 శాతం మంది ఇంటర్నెట్‌ లేకుండా తమ జీవితాన్ని ఊహించలేమని చెప్పారు. జర్మనీలో దాదాపు 40 శాతం మంది వినియోగదారులు వైరస్‌లు, డేటా దుర్వినియోగం నుండి బాగా రక్షించబడతారని నిశ్చయించుకున్నారు . అయితే జపాన్‌లో 42 శాతం మంది తమ డేటా ఇంటర్నెట్‌లో దుర్వినియోగం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో... ప్రతి పది మంది ఇంటర్నెట్‌ వినియోగదారులలో ఏడుగురు తమ డిజిటల్‌ గుర్తింపును కాపాడుకోవడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నారు.