
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ వామపక్ష పార్టీలు, ట్రేడ్‌యూనియన్లు, ప్రజాసంఘాలు బుధవారం చేపట్టిన ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడం తగదు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం, రోడ్లపై ఆందోళనకు యత్నించినవారిని అరెస్టు చేయడమేగాక అసలు రాస్తారోకోలనే జరగనీయకుండా పోలీసులు ప్రయత్నించడం దారుణం. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అని నినదించి, 32 మంది యువ కిశోరాల ప్రాణత్యాగంతో తెలుగువారు సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేట్‌పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బిజెపి తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలూ వ్యతిరేకించాయి. ప్రయివేటీకరణ ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. స్టీల్‌ప్లాంట్ కార్మికులు గత 800 రోజులకుపైగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ట్రేడ్‌యూనియన్లు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. వాటిలో భాగంగానే మే 3న రాస్తా రోకోలకు విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక పిలుపున్చింది. ఆ వేదికలో వైఎస్‌ఆర్‌టియు భాగస్వామి కూడా! ఈ వేదిక నిర్వహించిన వివిధ ఆందోళనలకు వామపక్షాలతోపాటు అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కూడా మద్దతునిస్తున్నాయి. సంఘీభావం తెలుపుతూనే వచ్చాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిరసనలపై నిర్బంధం ప్రయోగించడంతో దాని చిత్తశుద్ధిని శంకించవలసి వస్తోంది. వైసిపి సర్కారు వైఖరి 'నోటితో నవ్వి నొసటితో వెక్కిరించిన' చందంగా ఉంది. ఉత్తరాంధ్రలో ట్రేడ్ యూనియన్, వామపక్ష, ప్రజాసంఘాల నాయకులను ఎక్కడికక్కడ ఎందుకు గృహ నిర్బంధం చేస్తున్నారని అడిగితే ముఖ్యమంత్రి పర్యటన సాకుగా చెప్పిన పోలీసులు రాష్ట్రమంతటా ఏ పర్యటనలున్నాయని అరెస్టులు చేశారో !
రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మకుటాయమానమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సాగుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వమే నాయకత్వం వహించి ముందుకు నడపాల్సిందిపోయి ఆందోళనకారులపై నిర్బంధానికి పూనుకోవడం సబబు కాదు. కొత్తగా పెట్టుబడులు తెస్తాం... పరిశ్రమలు వస్తున్నాయని హోరెత్తించే నేతలు ఉన్న భారీ పరిశ్రమను ప్రభుత్వరంగంలో కొనసాగించేందుకు కృషి చెయ్యకపోతే ఎలా? స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు పోరాడుతున్న వారిపై వైసిపి సర్కారు నిర్బంధం ప్రయోగించడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కుయుక్తులకు వత్తాసు పలకడంగానే ప్రజలు భావించక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తుంటే, అదానీ పంపిన ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి భోగాపురం ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపనకు వెళ్లారన్న వార్తతో సర్కారు ప్రతిష్ట ప్రజల్లో మరింత పలచబడింది. ప్రయివేట్ స్టీల్ ప్లాంట్లకు సొంత ఉక్కు గనులు కేటాయించిన కేంద్రం... ప్రభుత్వ రంగంలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించడంలేదు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విదితమవుతోంది. రాష్ట్ర ప్రజల ఆందోళన, ఆగ్రహం గమనించి అయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేందుకు కలిసి రావడం విజ్ఞతగా ఉంటుంది.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల సంపద. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేట్‌పరం కానివ్వరాదు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి రాష్ట్రంలోని కార్మిక వర్గం, ప్రజానీకం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి. ఢిల్లీ రైతు ఉద్యమ స్ఫూర్తితో స్టీల్ ప్లాంట్ వద్ద సుదీర్ఘ కాలంగా కార్మికులు దీక్ష సాగించడం అభినందనీయం. విశాల శక్తుల సంఘీభావంతో అది మరింత ముందుకు సాగించాలి. ఉక్కు సాధనకు ఉద్యమం సాగించిన రీతిలోనే దాని పరిరక్షణకు మహోద్యమం సాగించడమే మన ముందున్న ఏకైక మార్గం. అలా మాత్రమే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం సాధ్యమవుతుంది.