న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గతవారం నుండి సానుకూలంగా ట్రేడవుతున్నాయి. మంగళవారం ప్రారంభ ట్రేడ్‌లోనే లాభాల్లో కొనసాగాయి. జిఎస్‌టి వసూళ్లు పెరగడం, ఏప్రిల్‌లో కొనసాగిన విదేశీ నిధుల ప్రవాహంతో గత వారం నుండి స్టాక్ మార్కెట్‌లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. మంగళవారం ఉదయం 9.33 గంటలకు స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 0.5, 0.6 శాతం ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 227 పాయింట్ల లాభంతో 61,340 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 18,131 దగ్గర కొనసాగుతోంది.
సోమవారం మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా భారత స్టాక్ ఎక్సేంజీని మూసివేశారు. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అయితే, దేశీయంగా మాత్రం అనేక సానుకూలతలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మొత్తంగా రూ.1.87 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలైందని సోమవారం విడుదలైన ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వసూళ్లపరంగా ఇది జీవనకాల గరిష్ఠం. గతేడాది ఇదే నెలలో వసూలైన 167,540 కోట్ల కన్నా 19,495 కోట్లు అధికం. విదేశీ నిధుల ప్రవాహం భారతీయ స్టాక్ మార్కెట్‌లలో ఏప్రిల్ రూ.11,631 కోట్లు, మార్చిలో రూ.7,936 కోట్ల విలువైన ఆస్తులను విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) కొనుగోలు చేశాయి. వరుసగా ఏడవసెషన్‌లో శుక్రవారం లాభాలను గడించింది. అమెరికా డాలర్ బలహీన పడటంతో భారతీయ , ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల వాటాలను కొనుగోలు చేసేందుకు పెట్టుబడి దారులు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.