జెనీవా : ఐక్యరాజ్య సమతి మానవ హక్కుల మండలి (యుఎన్‌హెచ్‌ఆర్‌సి)లో బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. పవిత్ర ఖురాన్‌ను అపవిత్రం చేసే బహిరంగ, ముందస్తు ప్రణాళిక చర్యలను ఖండిస్తూ, తీవ్రంగా తిరస్కరిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 'వివక్ష, శత్రుత్వం లేదా హింసను ప్రేరేపించే మతపరమైన విద్వేషాన్ని నిరోధించడం' అనే ఈ ముసాయిదా తీర్మానాన్ని 47 దేశాలు సభ్యులుగా ఉన్న యుఎన్‌హెచ్‌ఆర్‌సి ఆమోదించింది. 28 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించగా, 12 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఏడు దేశాలు గైర్హాజరయ్యాయి. భారత్‌తోపాటు పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, క్యుబా, మలేషియా, మాల్దీవులు, ఉక్రెయిన్, యుఎఈ, ఖతార్ వంటి దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఫిన్లాండ్ వంటి దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. పాలస్తీనా చేత ఈ ముసాయిదా తీర్మానాన్ని పాకిస్తాన్ తీసుకువచ్చింది. ఈ తీర్మానం సందర్భంగా యుఎన్‌హెచ్‌ఆర్‌సి హైకమిషనర్ వోల్కర్ టర్క్ మాట్లాడుతూ వందల కోట్లమంది విశ్వాసమైన ఖురాన్‌ను తగులబెట్టడం ఇటీవల కాలంలో పెరిగిందని తెలిపారు. గత నెలలో ఈద్ అల్ అదా రోజున స్వీడెన్‌లోని స్టాకహేోమ్‌లో ఒక నిరసనలో ఖురాన్‌ను తగులబెట్టడంతో ఇస్లామిక్ దేశాల నుంచి తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమయ్యాయి.










