Sep 21,2023 22:28

న్యూఢిల్లీ, టరంటో : ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ఇండియా కారణం అంటూ కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రుడో ఆ దేశ పార్లమెంట్‌లో ఆరోపించడంతోపాటు సీనియర్‌ భారత దౌత్యవేత్తను బహిష్కరించిన నేపథ్యంలో భారతదేశం ప్రతిచర్యలకు దిగింది. కెనడియన్‌ సీనియర్‌ దౌత్యవేత్తను ఐదు రోజుల్లో ఇండియా వదిలి వెళ్లాలని ఇప్పటికే ఆదేశించింది. కెనడా పౌరులకు భారతీయ వీసాలను గురువారం సస్పెండ్‌ చేసింది. కెనడియన్ల వీసా దరఖాస్తులను ప్రాథమికంగా పరిశీలించేందుకు ఏర్పాటైన ప్రైవేటు ఏజెన్సీ తన వెబ్‌ సైట్‌ లో ఈ విషయాన్ని ప్రకటించింది. నిర్వహణ కారణాల వల్ల సెప్టెంబర్‌ 21 నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారత వీసాలను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది.

  • కెనడాలో మరో ఖలిస్తానీ ఉగ్రవాది హత్య

కెనడాలో మరో ఖలిస్తానీ ఉగ్రవాది సుఖా దున్‌కె హత్యకు గురయ్యాడు. విన్నిపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్‌ జరిపిన దాడిలో అతను మరణించినట్లు ఎన్‌ఐఎ వర్గాలు తెలిపాయి. తామే సుఖా దున్‌కెను హత్య చేసినట్లు లారెన్స్‌ బిష్ణోరు ముఠా ప్రకటించింది.

  • కెనడా ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదు : భారత్‌

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యోదంతంలో ఎలాంటి ఆధారాలను కెనడా సమర్పించలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. తమకు ఎలాంటి నిర్ధిష్ట సమాచారం అందించినా పరిశీలించేందుకు సిద్ధమని చెప్పామని విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. కెనడా భూభాగం నుంచి వ్యక్తుల నేర కార్యకలాపాలకు సంబంధించి తమవైపు నుంచి నిర్ధిష్ట సమాచారాన్ని కెనడాతో పంచుకున్నామని చెప్పారు. రాజకీయ కోణంలోనే కెనడా ఈ ఆరోపణలు చేసిందని బాగ్చి వ్యాఖ్యానించారు.

  • ఖలిస్తానీ ఉగ్రసంస్థలతో పాక్‌ ఐఎస్‌ఐ రహస్య సమావేశం..

పాకిస్తాన్‌ గూఢఛార సంస్థ 'ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ)' కెనడాలోని వాంకోవర్‌లో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు, కీలక వ్యక్తులతో రహస్యంగా ఐదురోజుల క్రితం సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సిక్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జె) చీఫ్‌, ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూతో సహా ఖలిస్తానీ సంస్థల అధినేతలు హాజరయ్యారని నిఘా వర్గాలు తెలిపాయి.