Jul 28,2023 16:49

న్యూఢిల్లీ :  ఇండో-పసిఫిక్‌లో తమకి భారత్‌ అత్యవసర భాగస్వామి అని జపాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి యోషిమస హయషి పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన ఇండియా -జపాన్‌ ఫోరమ్‌లో యోహిమస మాట్లాడారు. ఇండో-పసిఫిక్‌లో యథాతథ పరిస్థితిని బలవంతంగా మార్చేందుకు యత్నిస్తే సహించేది లేదని అన్నారు. భవిష్యత్తులో భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా హీరోషిమాలో ఈ ఏడాది మేలో జరిగిన జి-7 సదస్సులో సభ్యదేశాల నేతలు చేసిన ప్రకటనను గుర్తు చేశారు. రెండు రోజుల భారత్‌ పర్యటన నిమిత్తం గురువారం ఆయన ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.

భారత్‌ జి 20 నాయకత్వాన్ని విజయంతం చేసేందుకు కలిసి పనిచేయడానికి జపాన్‌ చాలా ఉత్సాహంగా ఉందని అన్నారు. త్వరలో జరగనున్న ఇంటర్‌ గవర్నమెంటల్‌ ఫోరమ్‌పై దఅష్టిపెట్టామన్నారు. సైబర్‌ మరియు అంతరిక్షం వంటి కొత్త రంగాలలో ఇరు దేశాలు పురోగతి సాధించాయని అన్నారు. అలాగే రక్షణ పరికరాలు, సాంకేతిక రంగాలలో గణనీయమైన సహకారానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ సహా అనేక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో విభజనకు మరియు ఘర్షణలకు బదులు ప్రపంచాన్ని సహకారంతో నడిపించాల్సిన అవసరాన్ని జపాన్‌ మరియు భారత్‌ పూర్తిగా పంచుకుంటున్నాయని అన్నారు.