Aug 04,2022 06:56

బ్రాండిక్స్‌ సెజ్‌లో విషవాయువు లీక్‌ అయి 150 మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురికావడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నిబంధనలను, భద్రతా ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోని కంపెనీలు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరుకు, మొద్దు నిద్ర వీడని పాలకుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనం. సరిగ్గా రెండు నెలల క్రితం (జూన్‌ 3వ తేది) ఇదే సెజ్‌ లోని సీడ్స్‌ దుస్తుల కంపెనీలో విషవాయువు లీక్‌ అయిన తీరు రాష్ట్రంలో కలకలం రేపింది. అప్పట్లో 350 మందికిపైగా కార్మికులు ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో కొందరు ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఇంత దారుణం జరిగిన తరువాత ప్రభుత్వం స్పందించి ఉంటుందని, ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటుందని అనుకోవడం సహజం! కానీ అట్టహాసపు పర్యటనలు...ఆర్భాటపు ప్రకటనలు తప్ప జరిగింది శూన్యం. రెండు నెలల క్రితం చోటుచేసుకున్న భయోత్పాతం సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతుండగానే మళ్లీ అదే సెజ్‌లో, అదే సీడ్స్‌ కంపెనీలో అటువంటి వైపరీత్యమే మరోసారి చోటుచేసుకోవడాన్ని ఏమనాలి? ఒకసారంటే ప్రమాదం...! రెండోసారి....? కార్మికుల, కష్టజీవుల ప్రాణాలను పూచిక పుల్లలకన్నా హీనంగా తీసిపారేస్తున్న యాజమాన్య నిర్లక్ష్య వైఖరి పాలకులకు ఎందుకు కనిపించడం లేదు? తాజా సంఘటన జరిగిన తరువాత ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జి. అమర్‌నాధ్‌ ఈ ప్రమాదం యాదృచ్ఛికమా.. ఉద్దేశ్య పూర్వకంగా జరిగిందా...? అన్న విషయం తేలాల్సి ఉందని అన్నట్లు వార్తలు వచ్చాయి. ఎప్పటికి తేలుస్తారు?
              రెండు నెలల క్రితం విషవాయువు లీక్‌ అయినప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉండాలి. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు కూడా ఇదేరకమైన సంకేతాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి చెందిన నిపుణులు కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. కారణాలపై నివేదికను రూపొందించారు. కానీ జరిగిందేమిటి? ఆ నివేదిక ఇప్పటకీ గోప్యమే. ఆ నివేదికను బయటపెట్టి లోపాలను సరిదిద్దేటట్టు చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదే కదా! ఇప్పుడు మరోసారి ప్రమాదం జరిగిన తరువాతైనా అప్పట్లో ప్రమాదం ఎందుకు జరిగింది? దానికి బాధ్యత ఎవరిది? ఏం చర్యలు తీసుకున్నారు? ఇవి కదా ప్రభుత్వం చెపాల్సింది! అవి వదిలిపెట్టి ఏవో మాట్లాడితే ఎలా? నిజానికి బ్రాండిక్స్‌ సెజ్‌లో భద్రతా ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. వీటిపై ప్రభుత్వ స్పందన ఏదీ? బాధ్యులను ఎందుకు అరెస్ట్‌ చేయరు? అనుకోనిది ఏదో జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప దుర్ఘటనలు జరగకుండా చూడటానికి నిర్దిష్ట చర్యలేవి? ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌ యావలో కార్మిక చట్టాలను సవరించడం, అరకొరగా ఉన్న వాటిని కూడా చూసీ చూడనట్లు వెళ్లండని అధికారులను ఆదేశించడంతో వారు కాడిని ఎప్పుడో కింద పడేశారు. కార్మికుల సంక్షేమాన్ని, వారి భద్రతను చూసేదానికన్నా పెట్టుబడిదారుల సౌకర్యాలను పట్టించుకోవడానికే వారికి సమయం చాలడం లేదు. తాజా ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాదం జరిగిన సీడ్స్‌ కంపెనీని తాత్కాలికంగా మూసివేసి ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని వేయడంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లోనూ సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అయితే, ఇటువంటి కమిటీని వేస్తే, ఆడిట్‌ను నిర్వహిస్తే మాత్రమే ఫలితం ఉండదు. అనంతర చర్యలు కూడా ఉండాలి. అటువంటివి లేవు కాబట్టే ఈ తరహా సంఘటనలు పునరావృతమవుతున్నాయి. రాష్ట్రంలో కార్మికచట్టాలు అమలుకావడం లేదు. సంఘాలను పెట్టుకోనియ్యడం లేదు. భద్రతా ప్రమాణాలను ఎప్పుడో గాలికొదిలేశారు. వరుస ప్రమాదాల తరువాతైనా ఈ తీరును ప్రభుత్వం మార్చుకోవాలి. కార్మికులు ధైర్యంగా, భద్రతతో, నమ్మకంగా పని చేయగలిగినప్పుడే రాష్ట్రంలో నిజమైన పారిశ్రామిక వాతావరణం నెలకొంటుంది. పరిశ్రమలూ వృద్ధి చెందుతాయి.