May 24,2023 16:35
  •  జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌తో పేద‌ల కుటుంబాల్లో విద్యా వెలుగులు
  •  కాకినాడ ఎంపీ వంగా గీత

ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర ప్ర‌భుత్వం విద్య‌, వైద్య రంగాల‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తోంద‌ని పేద కుటుంబాల విద్యార్థుల‌కు సైతం ఉన్న‌త విద్య‌ను ద‌గ్గ‌ర చేసేందుకు జ‌గ‌న‌న్న విద్యాదీవెన, వ‌స‌తి దీవెన త‌దిత‌ర ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తోంద‌ని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. 2023, జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి సంబంధించి జ‌గ‌న‌న్న విద్యా దీవెన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తూర్పుగోదావ‌రి జిల్లా, కొవ్వూరులో బుధ‌వారం ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న‌న్న విద్యా దీవెన జిల్లాస్థాయి కార్య‌క్ర‌మం కాకినాడ క‌లెక్ట‌రేట్ వివేకానంద‌హాల్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కాకినాడ ఎంపీ వంగా గీత‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళాదీప్తి, ఇన్‌ఛార్జ్ డీఆర్‌వో కె.శ్రీర‌మ‌ణి త‌దిత‌రుల‌తో పాటు వివిధ క‌ళాశాల‌ల విద్యార్థులు, త‌ల్లిదండ్రులు హాజ‌ర‌య్యారు. ముఖ్య‌మంత్రి బ‌ట‌న్ నొక్కి నేరుగా విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో ఫీజు మొత్తాన్ని జ‌మ‌చేసిన అనంత‌రం ఎంపీ వంగా గీత‌, క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా త‌దిత‌రులు అధికారులతో క‌లిసి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ మొత్తం మెగా చెక్‌ను విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌కు అందించారు. 
ఈ సంద‌ర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకొని ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గాల‌ని విద్యార్థుల‌కు సూచించారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజ‌నీరింగ్‌, మెడిసిన్ తదిత‌ర కోర్సులు చ‌దివే పేద విద్యార్థులు కాలేజీల‌కు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్ర‌మంత‌ప్ప‌కుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంట‌నే కుటుంబంలో ఎంత‌మంది పిల్ల‌లుంటే అంత‌మంది పిల్ల‌ల‌కు ఇచ్చేలా వారి త‌ల్లుల ఖాతాల్లో నేరుగా ప్ర‌భుత్వం జ‌మ‌చేస్తోంద‌ని వివ‌రించారు. ఆర్థిక సమస్యల వల్ల ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితిలో పూర్తిగా మార్పు వ‌చ్చింద‌న్నారు. దేశంలో ఎక్క‌డాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయ‌న్నారు. విద్యా రంగ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల వ‌ల్ల ఇప్పుడు మెరుగైన ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయ‌న్నారు. మంగ‌ళ‌వారం విడుద‌లైన యూపీఎస్సీ ఫ‌లితాల్లో మొద‌టి మూడు ర్యాంకులు అమ్మాయిలే సాధించార‌ని ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని బాగా చ‌దువుకొని ఉన్న‌తంగా ఎద‌గాల‌ని ఎంపీ వంగా గీత విద్యార్థుల‌కు సూచించారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

  • రూ. 31.05 కోట్ల ల‌బ్ధి : క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా

కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన పథకం కింద 2023, జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి కాకినాడ జిల్లాలో 37,787 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ, కాపు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 31.05 కోట్లు జ‌మ‌వుతున్న‌ట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చ‌దువుకొని, కెరీర్ ప‌రంగా ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన త‌దిత‌ర ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. జ‌గ‌న‌న్న విద్యా దీవెన జిల్లాస్థాయి కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఎంపీ వంగా గీత‌, క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళాదీప్తి త‌దిత‌రులు విద్యార్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. బాగా చ‌దువుకొని ఉన్న‌త స్థాయికి ఎదిగి త‌ల్లిదండ్రుల‌కు మంచి పేరు తీసుకురావాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో బీసీ సంక్షేమ అధికారి ఎస్‌వీఎస్ సుబ్బ‌ల‌క్ష్మి, జిల్లా గిరిజ‌న సంక్షేమ అధికారి ఎ.విజ‌య‌శాంతి, స‌హాయ సాంఘిక సంక్షేమ అధికారి పీఎన్‌వీ స‌త్య‌నారాయ‌ణ‌, వివిధ క‌ళాశాల‌ల విద్యార్థులు, త‌ల్లిదండ్రులు హాజ‌ర‌య్యారు.