Jan 12,2023 06:48

భారత స్వాతంత్య్రోద్యమంలో ఆంగ్లేయుల గుండెల్లో నిదురించిన అల్లూరి, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన భగత్‌ సింగ్‌ వంటి ఎందరో యువతీయువకుల త్యాగాల వారసత్వం మనది. వీరు పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నారు. నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, కుల వివక్షతపై ఉద్యమించారు. మన దేశంలో అనేక సాంఘిక దురాచారాలపై జరిగిన ఉద్యమాల లో కీలక పాత్ర పోషించారు. విశాఖ ఉక్కు సాధనలో ప్రాణ త్యాగం చేశారు.
నూతన ఆర్థిక విధానాల అమలు తరువాత నేను, నా కుటుంబం, నా కెరీర్‌కి పరిమితం అవుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం అవుతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వ్యవస్థలు నాశనమవుతున్నా నా మతం, నా కులం గొడవలో కొట్టుకుపోతోంది యువత!
మన దేశానికి యువత పెద్ద సంపద. జనాభాలో 62 శాతం కంటే ఎక్కువ మంది పనిచేసే వయస్సు గలవారు (15-59 సంవత్సరాలు) వున్నారు. మొత్తం జనాభాలో 54 శాతం కంటే ఎక్కువ మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్కులు. మన జనాభా పిరమిడ్‌ వచ్చే దశాబ్దంలో కూడా ఇదే రీతిలో కొనసాగుతుందని భావిస్తున్నారు. రాబోయే 25 ఏళ్లపాటు కొనసాగే ఈ యువ శ్రామిక శక్తిని ఉపాధి నైపుణ్యాలు మరియు విజ్ఞానంతో సన్నద్ధం చేయాలి. తద్వారా వారు దేశ ఆర్థికవృద్ధికి గణనీయంగా దోహదపడతారు. ఉపాధిని కల్పించే విధానాలు మాత్రమే ఈ దేశ అభివృద్ధికి దోహదపడతాయి.
అయితే యువత అనేక సమస్యలతో సతమతమౌతోంది. మాదకద్రవ్యాలు, మద్యం, సిగరెట్‌, డ్రగ్స్‌ వంటి వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. ఆ మత్తులో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
ఒక దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటంటే యువతరానికి సరైన ఆలోచనా దృక్పథం లేకపోవడం. ప్రభుత్వాలు సరైన రీతిలో అవకాశాలు కల్పించక పోవడమే. యువతలో జాతీయ సమైక్యత, సౌభ్రాతృత్వం, సహనం, శౌర్యం, సాహసం యొక్క ఆలోచనను పెంపొందించాలి. వారిలో వున్న సాంస్కృతిక నైపుణ్యాన్ని వెలికితీయాలి. సామాజిక సమస్యలను అర్ధం చేసుకొంటూ వాటి పరిష్కారంలో యువత భాగస్వామ్యం పెరగాలి. అందుకనుగుణంగా వారిని ప్రోత్సహించాలి. రాజకీయాలకు విద్యావంతులైన యువత దూరంగా ఉండకూడదు. చైతన్యవంతమైన యువత రాజకీయాలలో విలువలు పెంచాలి. రాజకీయాల్లో నాయకత్వం వహించడానికి ముందుకు రావాలి. చట్ట సభలకు వెళ్లి శక్తివంతంగా నడిపించాలి.
యువత భాగస్వామ్యం పెంచేందుకు జాతీయ యువజన దినోత్సవాన్ని కింది అంశాలపై క్షేత్ర స్థాయిలో నిర్వహించవచ్చు.
ఎంపిక చేసిన గ్రామం/వాడలలో శ్రమదానం/సేవా కార్యక్రమాలు నిర్వహించి గ్రామ/ వార్డు స్థాయిలో ఒక క్లబ్‌ను ఏర్పాటు చేయడం. - యువత ప్రజాక్షేత్రంలో తమ భావాలను వ్యక్తీకరించడానికి బహిరంగ చర్చలు జరపడం. గ్రామ, నివాస ప్రాంతంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు-పరిష్కార మార్గాలపై 30 ఏళ్ల లోపు వారితో చర్చా కార్యక్రమం నిర్వహించడం. - సోషల్‌ మీడియాలో యువత, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలి? వంటి అంశాలపై వర్క్‌షాప్‌ నిర్వహించడం. - క్రీడలు, ఇతర పోటీలు నిర్వహించడం. విజేతలకు బహుమతులు అందజేయడం. - స్థానిక సంస్థలలో భాగస్వామ్యం కావడం, గ్రామాభి వృద్ధికి స్వచ్ఛంద సేవలను అందించడం, స్థానిక క్రీడలు, సంస్కృతులను ప్రోత్సహించడం... వంటి కార్యక్రమాల ద్వారా యువత భాగస్వామ్యం పెంచాలి.

భారత స్వాతంత్య్రోద్యమంలో ఆంగ్లేయుల గుండెల్లో నిదురించిన అల్లూరి, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన భగత్‌ సింగ్‌ వంటి ఎందరో యువతీయువకుల త్యాగాల వారసత్వం మనది. వీరు పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నారు. నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, కుల వివక్షతపై ఉద్యమించారు

 

 


/ వ్యాసకర్త : డా. కె.రమాప్రభ, సామాజిక కార్యకర్త,
సెల్‌ : 9492348428/