Jun 03,2023 15:32

ప్రజాశక్తి - పెద్దాపురం : మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుండి బయలుదేరిన జాతా శనివారం పెద్దాపురం చేరుకుంది.ఈ సందర్భంగా మున్సిపల్ సెంటర్లో మున్సిపల్ కార్మికులతో జరిగిన సభలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని,కనీస వేతనాలు అమలు చేస్తానని చెప్పారన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు.పెద్దాపురం మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు యూనిఫామ్ కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాతా నాయకులు దడాల గోవిందు,శేఖర్, రాజ్యలక్ష్మి, పెద్దాపురం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వర్రె గిరిబాబు, శివకోటి అప్పారావు, స్వామి, బాసిన భద్రరావు, రమణ, చేపల శ్రీను, శేఖర్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.