Apr 13,2023 06:45

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి అక్షరాస్యత 12 శాతం మాత్రమే. ప్రాచీన కాలం అద్భుతమైనదని గొప్పగా చెప్పుకున్న తర్వాత కూడా భారతదేశంలో అక్షరాస్యత శాతం అత్యంత స్వల్పంగానే వుంది. అంటే ఏదో ఒకటి రెండు కులాలకు తప్ప మిగిలిన కులాలు చదువుకోకుండా, అణగారిన వర్గాలు చైతన్యం పొందకుండా విద్యను దూరం చేసే అత్యంత కర్కశ విధానాలు అమలులో వున్నాయనే విషయం అర్ధం చేసుకోవాలి. భారత దేశంలో కులం పేరుతో కొందరికి విద్య, విజ్ఞానం, భూమి, ఆస్తులు నిరాకరించబడ్డాయి. రాజకీయాలకు దూరంగా ఉంచారు. కుల వివక్ష కారణంగా ఊరికి దూరంగా కనీస సదుపాయాలు లేని దుర్భర జీవితం గడపాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక ఈ కులాలకు అందరితో సమానంగా అవకాశాలు లభించేందుకు... విద్య, రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం సాధించేందుకు... రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 330, 332, 243(డి)లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. ఆర్టికల్‌ 15(4), 16(4), 335లో విద్య, ఉద్యోగాలలో, పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం అమలు తీరు, రిజర్వేషన్లపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయం పరిస్థితి ఎలా ఉంది?

  • సామాజిక న్యాయం

అణగారిన వర్గాలకు ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగాలలో సమాన అవకాశాలను కల్పించి భాగస్వాములను చేయటం ద్వారా సమజాభివృద్ధి చెందుతుంది. దీనికోసం ఎందరో కృషి చేశారు. ఏప్రిల్‌ 5 బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి, ఏప్రిల్‌ 11 జ్యోతిబా ఫూలే జయంతి, ఏప్రిల్‌ 14 డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి. వీరు ముగ్గురు దేశంలో ఉన్న అణగారిన వర్గాలకు సామాజిక వివక్షతను రూపుమాపటం కోసం తమ జీవితాంతం కృషి చేసినటువంటి వారు. వీరి బాట లోనే పెరియార్‌ రామస్వామి, శ్రీ నారాయణగురు, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహోన్నత వ్యక్తులు...భారతదేశంలో సామాజిక న్యాయాన్ని సాధించకుండా, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వకుండా భారత స్వాతంత్య్ర ఉద్యమ ఫలాలు అందరికీ అందుబాటులోకి రావని విశ్వసించారు. జీవితాంతం సామాజిక న్యాయ సాధన కోసం పోరాడారు. తమ జీవితాన్ని సంఘసంస్కరణ ఉద్యమాలకు అంకితం చేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 నుంచి 1990 వరకు భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అమలు చేయబడింది. ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బిహెచ్‌ఇఎల్‌, ఉక్కు కర్మాగారాలు, బిఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వేలు, పోస్టల్‌, బీమా రంగాలన్నింటిని ప్రభుత్వ రంగంలో స్థాపించారు. యుజిసి అనుబంధంగా యూనివర్సిటీలు, డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు అన్నిటినీ ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని నెలకొల్పింది. రిజర్వేషన్లు అమలు జరిగాయి. సామాజికంగా వెనకబడిన కులాలు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పొందడానికివి ఉపయోగపడ్డాయి. రాజకీయాలలో రిజర్వేషన్ల వల్ల కొద్దిమందైనా చట్టసభలలోకి అడుగెట్టగలిగారు.

  • ఆర్థిక సంస్కరణలు

1991 నాటికి భారత దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోవటం, బంగారాన్ని కుదవ పెట్టుకోవాల్సి రావడం, అప్పులు పెరిగిపోవడం వల్ల ఏర్పడిన ఆర్థిక మాంద్యాన్ని నివారించడానికి విరుగుడుగా ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. దీనికి ఏ పేరు పెట్టినా సేవా రంగం, ఉత్పత్తి రంగం నుండి ప్రభుత్వం తప్పుకొని మార్కెట్‌ శక్తులకు అప్పగించడం ప్రధాన లక్ష్యంగా ఈ సంస్కరణ అమలు చేస్తున్నారు. మార్కెట్‌ శక్తులే సమస్తాన్ని నిర్దేశించాలని, ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలని, బడా కార్పొరేట్లకు అనుకూలంగా, సమాజ సంపద అంతటిని మళ్లించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. దీని పర్యవసానంగా... ప్రభుత్వ రంగం తగ్గిపోతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు వారికి అప్పగించటం, అమ్మివేయటం జరుగుతున్నది. ప్రభుత్వాలు డిజిన్వెస్ట్‌మెంట్‌ శాఖను కూడా ఏర్పాటు చేయడం ఈ సంస్కరణలకు పరాకాష్ట. బిహెచ్‌ఇఎల్‌ అమ్మివేస్తున్నారు. ఓడ, విమానయానాలను ప్రవేటీకరిస్తున్నారు. ముడి సరుకు అందనివ్వకుండా చేసి ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరిస్తున్నారు. 4జి, 5జి సదుపాయాన్ని బిఎస్‌ఎన్‌ఎల్‌ కి కల్పించకుండా ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెబుతున్నారు. ఎల్‌ఐసిలో ప్రభుత్వ రంగ వాటాలను తగ్గించివేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహిస్తున్నారు. పేదలు ఉపయోగించుకునే ప్యాసింజర్‌ రైళ్ళను తగ్గించి రైల్వే ప్రైవేటీకరణ దిశగా ముందుకు వెళుతున్నారు. విద్యుత్‌ ప్రవేటీకరణ అయిపోయింది. ప్రభుత్వ యూనివర్సిటీల స్థానంలో డీమ్డ్‌ యూనివర్సిటీలు వచ్చేశాయి. డిగ్రీ, జూనియర్‌ కాలేజీలు ప్రభుత్వ రంగం నుంచి కనుమరుగు అవుతున్నాయి. ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీనం పేరుతో, విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను కూడా కుదించేస్తున్నారు. దీనివల్ల కొన్ని వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా మారుతున్నాయి.

  • ప్రైవేటీకరణ అయితే...

ఇలా ప్రైవేటీకరణ అయితే, రిజర్వేషన్ల అమలు సాధ్యమయ్యేది లేదు. ఆ మాటకొస్తే సామాజికంగా వెనకబడిన వారికే కాదు, మిగిలిన ఉన్నత వర్గాలు, కులాల వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు దొరకవు. దీని స్థానంలో కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల సంఖ్య పెరిగిపోతుంది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ విభాగాల్లో 6 లక్షలకు పైగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ఎలాంటి రిజర్వేషన్లు, సామాజిక న్యాయం వర్తించదు. మండల విద్యావనరుల కేంద్రంలో సైతం సమగ్ర శిక్షణ కింద 3000 పైచిలుకు కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ట్రైబల్‌ ప్రాంతంలో 1700 మంది, జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో 1200 మంది సీఆర్టీలు గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పర్మినెంట్‌ ఉద్యోగుల కంటే కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య ఎక్కువ. కె.జి.బి.వి లలో మొత్తం కాంట్రాక్టు ఉద్యోగులే. వీరికి మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ కూడా అమలు కావడం లేదు. పాఠశాల విద్యా రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మినిమమ్‌ టైమ్‌ టీచర్ల వ్యవస్థ కూడా ఏర్పడుతున్నది. వీటన్నిటిలోనూ ఎక్కడ రాజ్యాంగం నిర్దేశించిన నియమాలు, పని గంటలు, కనీస వేతనాలు ఉండవు.
ఇక్కడ ఏ రిజర్వేషన్లూ అమలు కావు. కాంట్రాక్టర్‌ ఇష్టాయిష్టాలు మీద, ప్రైవేట్‌ సంస్థల కోపతాపాల మీదే వీళ్ళ ఉద్యోగ భద్రత, జీతాలకు భరోసా ఆధారపడి ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, సెజ్‌లు, ప్రైవేట్‌ పరిశ్రమలకు భూమిని కేటాయించడం వల్ల భూకేంద్రీకరణ జరిగి వ్యవసాయ పని దినాలు తగ్గుతాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఉపాధి కోల్పోతారు. కొన్ని లక్షల పనిగంటలు తగ్గిపోతాయి. పేద ప్రజానీకానికి వచ్చే ఆదాయం కోల్పోతారు. అయితే పర్మినెంట్‌ ఉద్యోగాలు ఉత్పత్తిని పెంచడానికి అవరోధమని, ఉద్యోగిని నిరంతరం అభద్రతకు గురిచేస్తేనే అతని సామర్థ్యం పెరుగుతుందని విచిత్రమైన అంశాలు ప్రచారం చేస్తున్నారు. పర్మినెంట్‌ పనులకు పర్మినెంట్‌ ఉద్యోగులను నియమించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా పర్మినెంట్‌ పనుల్లో కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాలు జరుగుతున్నాయి. దీనివల్ల రిజర్వేషన్‌ వ్యవస్థ కనుమరుగు అవుతుంది. సామాజిక న్యాయం అందని ద్రాక్షగా మారిపోతుంది. ఉత్పత్తి అయిన సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుంది. ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతాం. ఇక ప్రైవేట్‌ రంగంలో ఎలాంటి రిజర్వేషన్లూ అమలు కావు.

  • అస్తిత్వవాద అంశాలు

భూమి అందరికి లేదు. ప్రభుత్వ రంగం కుదించ బడుతున్నది. రండి అందరం కలసి పోరాడదాం, సామాజిక న్యాయాన్ని రక్షించుకుందాం అనే పిలుపు స్థానంలో మన కులం వారికి పలానా పదవి లేదు, మన కులం వారికి గౌరవం లేదు, రండి ...మనం అంతా పోరాడుదాం...అనే అస్తిత్వవాద రాజకీయాలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. అనుభవించే వాడికి తెలుస్తుంది. బయట ఉన్న వారికి ఏం తెలుస్తుంది? మా సమస్య మేమే పరిష్కరించుకుంటాం! అనే వాదనలు ముందుకు వస్తున్నాయి. ఈ వాదనలలో తమ హక్కులు తమకు రావడం లేదనే ఆక్రోశం ఉంది. అయితే ప్రవేటీకరణ వల్ల అసలు రిజర్వేషన్లు వ్యవస్థకే మోసం వస్తున్నప్పుడు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం చేయకుండా సామాజిక న్యాయం సాధించడం సాధ్యం కాదు. గమననించవలసిన అంశం ఏమిటంటే ఈ అస్తిత్వవాదాలు సమిష్టి వాదానికి, సంఘ భావనలకు వ్యతిరేకంగా ఉంటాయి. అంతిమంగా ఆర్థిక రంగ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణను వెనక్కి కొట్టే సమిష్టి పోరాటాలకు ఈ రాజకీయాలు అవరోధంగా మారుతున్నాయి.

  • ప్రభుత్వ రంగం బలపడితేనే...

ప్రభుత్వ రంగం బలపడకుండా రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయాన్ని సాధించడం సాధ్యం కాదు. ప్రభుత్వమే ఉపాధి, ఉద్యోగ కల్పన చేయకుండా సమాన పనికి సమాన వేతనం అందే అవకాశం లేదు. భూమిని అందరికీ అందుబాటులోకి తేకుండా విద్య, వైద్యం కనీస మౌలిక సదుపాయాలు ప్రజలందరికీ అందించడం సాధ్యం కాదు. భూ పంపిణీ వల్ల ఒక స్థిర ఆదాయం వస్తుంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని ప్రజలు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, తమకు కావలసిన వస్తువుని కొనుగోలు చేయడానికి వినియోగిస్తారు. తద్వారా వస్తువులు తయారు చేసే కంపెనీలు పెరుగుతాయి. ఈ కంపెనీలలో పనిచేయటానికి కావలసిన వర్కర్ల సంఖ్య పెరుగుతుంది. కొద్దిమేరకైనా నిరుద్యోగం రూపుమాపబడుతుంది. ఇవన్నీ ప్రభుత్వ రంగంలో వుంటే సామాజిక న్యాయం కొంతైనా దక్కుతుంది.

article-by-nakka-venkateswarlu

 

 

 

వ్యాసకర్త : నక్కా వెంకటేశ్వర్లు, యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు