- ఆ కాంట్రాక్ట్ సంస్థపై ప్రభుత్వ అధికారులకు అంత ప్రేమ ఎందుకో?
ప్రజాశక్తి-కొండాపురం : మండలంలో జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ అక్రమ మార్గాలకు తెరలేపింది ఇందులో బాగంగా ఇప్పటికే విద్యుత్ టవర్లు, స్తంబాల ఏర్పాటు విషయంలో అక్రమాలకు పాల్పడిందని గతంలో వార్తలు వచ్చినప్పటికీ సంబందిత శాఖాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.అందువలన వారి వ్యవహారంలో మార్పు రాలేదు. జాతీయ సంపద అయిన ఇసుకను కూడా అక్రమంగా తరలించడానికి కూడా వెనుకాడడం లేదు. ఇప్పటికే లక్షలు రూపాయలు విలువ చేసే ఇసుక అక్రమంగా తరలించారని ప్రజలు వాపోతున్నారు. మండలంలోని ఏటూరు వద్ద ఇసుక చర్చకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. గండికోట ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండడం వలన ఏటూరు వద్ద ఇసుకరీచ్ ను ప్రభుత్వం రద్దుచేసింది. కానీ ఈ కాంట్రాక్టు సంస్థ అక్కడ రీచ్ ఉన్నట్లు స్థానిక ప్రజలను మభ్యపెడుతూ చిత్రావతి నదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. చిత్రావతి నదిలో ఇసుకను తీసుకోవడానికి కేవలం డ్రెజ్జింగ్ మిషన్ ద్వారానే ఇసుకను వెలికి తీసి ప్రభుత్వ రాయల్టీ చెల్లించి ప్రభుత్వ ధరలకు కొనుగోలు చేయాలి ఇక్కడ అలా కాకుండా నది ఒడ్డున ఉన్న ఇసుకను అక్రమంగా తరలిస్తూ కాంట్రాక్టు పనులు చేస్తూ కోట్ల రూపాయలు దోచుకోవడానికి జరుగుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి జాతీయ రహదారి నిర్మాణ పనుల విషయంలో ఆ సంస్థ పై దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.










