Jul 12,2023 20:29
  • నెతన్యాహు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ప్రజల ఆందోళనలు

జెరూసలేం : న్యాయ వ్యవస్థపై ప్రభుత్వ దాడి ప్రయత్నాలను నిరసిస్తూ ఇజ్రాయిల్‌ వ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు మంగళవారం ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం తన ప్రణాళిక ప్రకటించిన నేపథ్యంలో నెలల తరబడి కొనసాగుతున్న ఆందోళనల్లో భాగంగా మంగళవారం నాడు నిరసనలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. జెరూసలేం, హైఫా, టెల్‌ అవీవ్‌ నగరాలకు దారితీసే హైవేలను, ప్రధాన నగరాల్లోని జంక్షన్లను ఆందోళనకారులు దిగ్బంధించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షక అధికారాలను పరిమితం చేసేందుకు తీసుకువచ్చిన బిల్లుకు నెతన్యాహు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆందోళనలు తలెత్తాయి. అయితే విస్తృతంగా నిరసనలు తలెత్తినా న్యాయవ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ప్రభుత్వం పట్టుదలగా వుంది. ఈ మార్పులు దేశాన్ని నిరంకుశ పాలన వైపునకు నెడుతున్నాయనివారు విమర్శిస్తున్నారు. జెరూసలేంకు దారి తీసే ప్రధాన రహదారిని దిగ్బంధించిన ఆందోళనకారులపై పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. మరో రహదారిని దిగ్బంధించిన వారిని పలువురిని అధికారులు అరెస్టు చేశారు. హైఫాలో ప్రధాన రహదారిని కూడా ప్రదర్శకులు దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఇందుకుసంబంధించి 42మందినిఅరెస్టు చేశారు. పరిస్థితులు తీవ్రంగా మారితే సమ్మె తప్పదనినేషనల్‌ లేబర్‌ యూనియన్‌ హిస్టాడ్రట్‌ అధినేత ఆరున్‌ బార్‌ డేవిడ్‌ హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ప్రణాళికను అమలు చేస్తే అత్యంత మితవాద ప్రభుత్వం చేతుల్లోనే అధికారాలు ఎక్కువగా కేంద్రీకృతమవుతాయని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. అనేక అవినీతి ఆరోపణలపై నెతన్యాహు విచారణను ఎదుర్కొంటును నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఆయనకు ప్రయోజనాలు ఒనగూరతాయని వారు పేర్కొన్నారు.