జులై-సెప్టెంబరు త్రైమాసికపు జిడిపి అంచనాలను చూసి ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఎందుకింత సంబరపడుతున్నారో అర్ధం కాదు. 2019-20 సంవత్సరంలో జులై-సెప్టెంబరు జిడిపి తో పోల్చితే ఈ సంవత్సరం అదే కాలంలో జిడిపి 'కేవలం' 7.5 శాతం మాత్రమే తగ్గింది. ఇది 8 లేదా 9 శాతం వరకూ తగ్గవచ్చునని మొదట అనుకున్నారు. దీనికి ముందు మూడు నెలల కాలానికి గాను 23.9 శాతం తగ్గింది. అక్కడి నుండి కోలుకుంటున్న తీరు ముందు ఊహించినదానికన్నా బాగుందని ప్రభుత్వ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కాస్త లోతుల్లోకి పోయి చూస్తే ఈ కోలుకోవడం అనేది నమ్మదగినదిగా లేదు. అంతేగాక ఇది పేదరికాన్ని మరింత పెంచింది. అందుచేత ఇది నికరంగా నిలబడేది కాదు.
ఈ జిడిపి అంచనాల్లో 'పరస్పరం పొసగని అంశాలు' అన్న ఖాతా కింద గణనీయంగా జిడిపి పెరిగినట్టు చూపించారు. అంచనాల్లో తప్పులకు, మినహాయింపులకు మారు పేరు ఈ ఖాతా. 2019-20లో ఇదే త్రైమాసికంలో ఈ ఖాతా కింద ఎంత చూపించారో ఇప్పుడూ అంతే గనుక చూపి వుంటే ఈ త్రైమాసికానికి జిడిపి తరుగుదల 8.7 శాతం అవుతుంది. ఇది ముందస్తు అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. కాని ఈ ఖాతాలో అంతకన్నా ఎక్కువ చూపించి తరుగుదల 7.5 శాతం అని ప్రకటిస్తున్నారు. అందుచేత ఇది నమ్మదగినది కాదు. అయినా, ప్రభుత్వం చెప్పింది కాసేపు వాస్తవమే అనుకుందాం. లాక్‌డౌన్ కారణంగా ఒక్కసారి ఉత్పత్తి పడిపోయింది గనుక అక్కడినుండి తిరిగి ఎంతోకొంత మేరకు కోలుకోవడం అనివార్యం. అయితే, ఈ విధంగా కోలుకోవడానికి దోహదం చేసిన అంశాలేమిటి?
జిడిపి వృద్ధితో ఉపాధికల్పన ముడిపడి వుండే అంశం. కనుక ఈ కోలుకోవడం ఫలితంగా కొంత ఉపాధి కల్పన జరిగి వుండాలి. ఐతే మన దేశంలో తాత్కాలికంగా పనులు దొరకడం, కొన్నాళ్ళు పని ఉండి తక్కిన రోజుల్లో లేకపోవడం, పార్ట్ టైం పనులు, ఇళ్ళ దగ్గర నుండే చేసే పనులు వంటివి ఎక్కువ. రెగ్యులర్ ఉద్యోగాల లెక్కలు దొరికినట్టు వీటి లెక్కలు దొరకవు. అందుచేత కార్మికుల ఆదాయాలు పెరిగాయా లేదా అన్నది అంచనా వేస్తే దానిని బట్టి కొత్తగా ఉపాధి కల్పన జరిగినదీ లేనిదీ తెలుస్తుంది. కార్మికుల ఆదాయాలు పెరిగితే దానికి తగినట్టు వినిమయం పెరుగుతుంది. అందుచేత వినిమయం ఎంత పెరిగిందో చూస్తే ఈ జిడిపి కోలుకోవడంతో బాటు ఉపాధి కల్పన పెరిగిందా లేదా అన్నది, పెరిగితే ఏ మేరకు పెరిగింది అన్నది తెలుస్తుంది.
ప్రస్తుతం మనకు ప్రత్యేకించి కార్మికుల వినియోగం ఎంత అని తెలిపే వివరాలేమీ లేవు. మొత్తం మీద వినియోగం ఎంత అన్న సమాచారమే ఉంది. దాని నుంచి కొంత మేరకు కార్మికుల వినియోగం అంచనా వేయవచ్చు. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది జూలై-సెప్టెంబరు లో జిడిపి తరుగుదల 7.5 శాతం అని ప్రభుత్వ అంచనాలు చెప్తున్నాయి. ఇదే కాలంలో ప్రైవేటు వినియోగం 11.32 శాతం తగ్గింది. నిజానికి గణాంకాలు వెల్లడిస్తున్న ప్రకారం 2019-20 రెండవ త్రైమాసికంలో 56.5 శాతంగా ఉన్న ప్రైవేటు వినియోగం 2020-21లో అదే కాలానికి 54.2 శాతానికి పడిపోయింది.
జనాభాలో సంపన్న వర్గాలు, ఉన్నత మధ్యతరగతి వర్గాలు లాక్‌డౌన్ కాలంలో ఎటువంటి ఖర్చూ చేయలేని పరిస్థితి ఉంది. ఆ లాక్‌డౌన్ సడలించాక వారు పాత పద్ధతిలో ఖర్చు చేయడానికి ఎటువంటి ఆటంకమూ లేదు. లాక్‌డౌన్ కాలంలో వారి ఆదాయాలేమీ తగ్గలేదు. ఒకవేళ తగ్గినా వారివద్ద తగినంత నగదు నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు దానిని ఖర్చు చేయడానికి ఏ ఇబ్బందీ లేదు గనుక జిడిపిలో వారి ఖర్చు వాటా పెరుగుతుంది. కొత్తగా ఉత్పత్తి పెరగకపోయినా నిల్వ ఉన్న స్టాకులు వీరి ఖర్చు వలన తరుగుతాయి. పెరిగిన వీరి ఖర్చును కలుపుకున్నా వినిమయం తరుగుదల 11.32 శాతం ఉంది అంటే వీరిని మినహాయిస్తే కార్మికవర్గం వినిమయం 11.32 శాతం కన్నా ఇంకా ఎక్కువగానే తరిగిపోయి వుండాలి. అంటే జిడిపి కోలుకోవడం అనేది జరిగిన కాలంలోనే కార్మికుల ఆదాయాలు తగ్గిపోయాయనేది మనకు బోధపడే అంశం. అంటే ఈ కోలుకోవడం వెనుక కార్మికుల నుండి గుంజుకున్న అదనపు విలువ వాటా ఈ కాలంలో మరింత పెరిగిందని స్పష్టం అవుతుంది.
రెండు విధాలుగా పేదరికం పెరుగుదల ఇప్పుడు జరుగుతోంది. కరోనా మహమ్మారి వలన, పూర్తి, పాక్షిక లాక్‌డౌన్‌ల వలన తలసరి ఆదాయం, దానితోబాటు తలసరి వినియోగం, జీవన పరిస్థితులు దిగజారాయి. ఇందులో శ్రామిక ప్రజల తలసరి వినియోగం మరీ ప్రత్యేకంగా దిగజారింది. లాక్‌డౌన్ సడలింపు తర్వాత కూడా ఇది కొనసాగుతోంది. శ్రామికుల ఆదాయాలు తగ్గడం అదనపు విలువలో పెట్టుబడిదారుల వాటా మరింత పెరిగిన పర్యవసానమే. ఇక ప్రత్యేకంగా మనం పరిగణించాల్సిన రెండో అంశం జిడిపిలో ప్రభుత్వ వినిమయ ఖర్చు శాతం తగ్గిపోవడం. 2019-20 రెండవ త్రైమాసికంలో 13 శాతంగా ఉన్న ప్రభుత్వ వ్యయం 2020-21 లో అదే కాలంలో 10.9 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ వ్యయం భారీ మొత్తంలో ఉంటుందన్న సంగతిని దృష్టిలో ఉంచుకుంటే ఈ తగ్గుదల చాలా ఎక్కువేనని చెప్పాలి.
జిడిజిలో తగ్గుదల ఉంటే ప్రభుత్వ ఆదాయంలో కూడా తగ్గుదల ఉంటుంది. కాని ప్రభుత్వ వ్యయంలో ఆ విధంగా తగ్గుదల ఉండదు. ప్రభుత్వ వ్యయంలో ఎక్కువ భాగం ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వ ఆదాయం తగ్గినంత మాత్రాన ఈ ఖర్చులేమీ తగ్గవు. అందుచేత ఈ విధంగా జిడిపి తగ్గినప్పుడు సాపేక్షంగా ప్రభుత్వ వ్యయం శాతం పెరగాలి. మరీ ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం మీద, సంబంధిత ఇతర రంగాల మీద (వైద్య పరికరాల కొనుగోలు వగైరా) ప్రభుత్వ ఖర్చు పెరగాలి. కాని మోడీ ప్రభుత్వం ఈ సమయంలో ప్రభుత్వ ఖర్చును తగ్గించింది. నిజానికి ఈ సంక్షోభం కాలంలో ప్రభుత్వ వ్యయం పెరిగితే ఆమేరకు డిమాండ్ పెరిగి సంక్షోభం తీవ్రతను తగ్గించవచ్చు. కాని మోడీ ప్రభుత్వానికి ప్రపంచ ద్రవ్య పెట్టుబడి అడుగులకు మడుగులొత్తడం తప్ప తక్కినవి ప్రాధాన్యత గలిగిన అంశాలు కావు. ఈ విధంగా ప్రజల వినిమయమూ తగ్గి, ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గినప్పుడు ఇక జిడిపి కోలుకోడానికి దోహదం చేసినదేమిటి? పెట్టుబడులలో వృద్ధి చోటుచేసుకుంది. ముఖ్యంగా స్థూల స్థిర పెట్టుబడి పెరిగింది. జిడిపి పెరుగుదలలో 58 శాతం ఈ స్థూల స్థిర పెట్టుబడి పెరుగుదల వల్లనే సాధ్యపడింది. ఇందులో ప్రభుత్వం నుండి, ప్రైవేటు రంగం నుండి పెట్టుబడి ఉంది.
ఈ స్థూల స్థిర పెట్టుబడి పెరుగుదల ఇదే విధంగా కొనసాగడం సాధ్యపడే విషయం కాదు. ఇప్పటికే ఈ ఏడాది మొత్తానికి ఎంతమేరకు ద్రవ్యలోటు ఉండవచ్చునని మన కేంద్ర ప్రభుత్వానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి షరతు విధించిందో ఆ పరిమితిని ఈ అక్టోబరు మాసాంతానికే మనం దాటివేశాం. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విధించిన లక్ష్మణరేఖను దాటే సాహసం మన ప్రభుత్వం చేయలేదు. అంటే ద్రవ్యలోటును పరిమితి లోనే ఉంచాలి. అందుచేత ఇకముందు ప్రభుత్వ పెట్టబడిని ఇదేవిధంగా కొనసాగించడం సాధ్యపడదు. ఇంక మిగిలినది ప్రైవేటు పెట్టుబడి. అది పెరగాలంటే ముందు వినిమయం పెరగాలి. అప్పుడే ప్రైవేటు రంగం అదనంగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతుంది. ఈ వినిమయం తగ్గిపోయిందన్న వాస్తవాన్ని ముందే చెప్పుకున్నాం.
ఇక ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి దోహదం చేసే ఒక అంశం విదేశాలకు ఎగుమతులు పెరగడం. అసలే మన విదేశీ ఎగుమతుల వాటా చాలా తక్కువ. దానికి తోడు కరోనా పరిస్థితుల్లో ఎగుమతులు పెరిగే అవకాశాలు దాదాపు లేనట్టే. అందుచేత వినిమయ ఖర్చును పెంచే విధంగా మార్పులను తీసుకోకపోతే జిడిపి వృద్ధిరేటు కోలుకోవడం అనేది కొనసాగదు. 2020-21 మొదటి ఆరు నెలల కాలాన్నీ మొత్తంగా కలిపి చూస్తే మన వినిమయం దాదాపు 20 శాతం పడిపోయింది. ఇప్పటికే మన దేశంలో కోట్లాది మంది కనీస స్థాయిలో బతుకుతున్నారు. ఆ స్థాయి కన్నా 20 శాతం పడిపోవడం అంటే ఎంత దుర్భరమో ఊహించవచ్చు. పైగా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కానరావడం లేదు. అందుచేత మన ప్రభుత్వ అధికార ప్రతినిధులు మన ఆర్థిక పరిస్థితి కోలుకోవడం గురించి చెప్పే మాటలు వాస్తవ పరిస్థితిని చూపడంలేదు. ఈ స్థితి నుండి మన దేశం బైటపడాలంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలను, షరతులను తోసిరాజని గట్టిగా నిలబడాలి. ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు చేపట్టాలి. కాని ఆ దారిలో నడిచే దమ్ము మోడీ ప్రభుత్వానికి లేదు.
* ప్రభాత్ పట్నాయక్ (స్వేచ్ఛానుసరణ)










